ల‌గ‌డ‌పాటి ఆవేద‌న‌..త‌ప్పుచేశాను..వ‌దిలేయండి

Update: 2018-12-16 05:42 GMT
లగడపాటి రాజగోపాల్....మాజీ ఎంపీ... ఆంధ్రా ఆక్టోపస్ అని పేరు. ఖ‌చ్చిత‌మైన‌ స‌ర్వేల‌కు ఆయ‌న `కొద్దికాలం కింద‌టి వ‌ర‌కు` సుప‌రిచితుడు. ఇటీవ‌ల తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న తర్వాత.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై లగడపాటి స్పందించిన సంగతి తెలిసిందే. 8 నుంచి 10 మంది ఇండిపెండెంట్లు గెలవబోతున్నారని ప్రకటించిన రాజగోపాల్... వారిలో ఇద్దరు పేర్లను కూడా అక్కడే ప్రకటించారు. ఆ తర్వాత పోలింగ్‌కు రెండు రోజుల ముందు కూడా మీడియా ముందుకు వచ్చి తన సర్వే అంచనాలు వెల్లడించారు. మహాకూటమిదే విజయం ఎంతో ధీమాగా చెప్పారు. ఎన్నికలు పూర్తయ్యాక అన్ని ఎగ్జిట్ పోల్స్ టీఆర్ ఎస్ గెలుస్తుందని అంచనా వేయగా... లగడపాటి మాత్రం మహాకూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని పదే పదే చెప్పి ఉత్కంఠ రేపారు. కానీ ఫలితాల్లో టీఆర్ ఎస్ ఘనవిజయం సాధించడంతో లగడపాటి అంచనాలు రివర్స్ అయిన విషయం విదితమే.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాకూటమి విజయం సాధిస్తుందని తన సర్వేలో తేలిందని చెప్పి లగడపాటి నవ్వులపాలైన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఎక్కడా కనిపించని లగడపాటి సడెన్‌ గా తిరుమలలో ప్రత్యక్షమయ్యారు. కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం తర్వాత బయటకు వచ్చిన ఆయనను మీడియా పలు ప్రశ్నలు అడిగింది. అయితే సమాధానాలు చెప్పేందుకు లగడపాటి నిరాకరించారు. ముఖ్యంగా తెలంగాణ ఎన్నికల ఫలితాలు - తన సర్వేపై మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు దాటవేశారు. రాజకీయాల గురించి తిరుపతిలో మాట్లాడకూడదని అనుకుంటూనే మొన్న మాట్లాడేశానని - అదే పెద్ద పొరపాటైందని లగడపాటి వాపోయారు. నిజానికి తిరుపతిలో తానెప్పుడూ రాజకీయాల గురించి మాట్లాడనని అన్నారు.  కానీ మొన్న మీ అందరినీ చూసి ఆగలేక మాట్లాడేశానని చెప్పారు. ఆ రోజు మాట్లాడడమే పొరపాటైందని - మళ్లీ ఇప్పుడు ఆ విషయాన్ని ప్రస్తావించి మరో పొరపాటు చేయబోనని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Tags:    

Similar News