మోడీకి దక్కిన సూపర్ పొగడ్త ఇదేనేమో

Update: 2016-05-29 05:06 GMT
బీజేపీ కురువృద్ధుడిగా కీర్తిని అందుకుంటూనే.. శిష్యుడు చేతిలో అవమానాల మీద అవమానాలు ఎదుర్కొంటూ అపర భీష్ముడిగా అభివర్ణించే నేత లాల్ కృష్ణ అద్వానీ. తాను ఏరికోరి ఎంపిక చేసుకున్న శిష్యుడే తనకు ఈస్థాయిలో దెబ్బేస్తారని అద్వానీ ఎప్పడూ ఊహించి ఉండరేమో. మోడీ నిరాదరణకు గురై అప్పుడప్పుడు తన వ్యాఖ్యలతో కలకలం రేపే అద్వానీ కొద్ది రోజులుగా కామ్ గా ఉండటం తెలిసిందే. అద్వానీకి మోడీకి మధ్య టర్మ్స్ సరిగా లేవన్న సంగతి అందరికి తెలిసిందే.

అయినప్పటికీ తాజాగా మోడీని ఆయన కీర్తించిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రధానిగా అధికారాన్ని చేపట్టి రెండేళ్లు అవుతున్న నేపథ్యంలో భారీఎత్తున సంబరాలు చేసుకుంటున్న మోడీ సర్కారుకు.. సూపర్ పొగడ్త అద్వానీ నోటి వెంట రావటం విశేషంగా చెప్పాలి. మోడీ హయాంలో పరిస్థితులు ఎలా మారిపోయాయన్న విషయాన్ని ఆయన ఒక అంశాన్ని ప్రస్తావిస్తూ చెప్పుకొచ్చారు. గతంలో తాను ఒకసారి సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించానని.. గాంధీజీకి ఎంతో ఇష్టమైన సబర్మతి నది పరిస్థితి దారుణంగా ఉండేదన్నారు. అలాంటి ఇప్పుడు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుతో సబర్మతి రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని.. ఈ ప్రాజెక్టు ద్వారా మోడీకి గాంధీజీకి ఘనమైన నివాళి అర్పించారని.. ఈ అభివృద్ధి మనందరికి గర్వకారణమంటూ అద్వానీ పొగిడేయటం విశేషం.

తనను పూర్తిగా పక్కన పెట్టేసిన శిష్యుడి పాలనపై అద్వానీ ఇచ్చిన సర్టిఫికేట్ చూస్తే.. మరికొద్ది నెలల్లో రౌష్ట్రపతి పదవికి జరగనున్న ఎంపికకు తాను అర్హుడినేనన్న విషయాన్ని గుర్తు చేసే క్రమంలో ఇలాంటి వ్యాఖ్య చేశారా? అన్నది ప్రశ్నగా మారింది. మోడీ రెండేళ్ల పాలనను ఇంతలా పొగిడేసిన గురువును మోడీ గుర్తుంచుకున్నారా? లేదా? అన్నది మరికొద్ది నెలల్లో తేలిపోవటం ఖాయమని చెప్పకతప్పదు.
Tags:    

Similar News