కేటీఆర్ నోట ఆంధ్రా పార్టీ అంతర్థానం మాట

Update: 2016-05-02 12:44 GMT
ఇప్పటివరకూ చూడని ఒక సన్నివేశం ఒకటి తెలంగాణలో చోటు చేసుకుంది. ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా ఎంతోమంది నేతలు పార్టీలు మారటం తలిసిందే. అలా పార్టీలు మారాలనుకున్న నేత.. తనకు మద్దుతుగా నిలిచే చోటా నేతలు.. కార్యకర్తల్ని భారీగా సమీకరించుకొని పార్టీ మారాలనుకున్న అధినేత ఇంటికో.. ఆఫీసుకో వెళ్లి.. ఆయన చేతుల మీదుగా మెడలో పార్టీ కండువా కప్పించుకోవటం ఓ ముచ్చట. ఇలాంటివి ఈ మధ్య కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తున్న రోటీన్ సీన్.

ఇందుకు భిన్నమైన సీన్ ఒకటి తాజాగా ఆవిష్కృతమైంది. తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ‘ఫ్యాన్’ గాలి తనకు వద్దంటూ.. ‘కారు’లో షికారుకు ఓకే చెప్పిన నేపథ్యంలో.. ‘కారు’ ఓనర్ కొడుకే స్వయంగా వచ్చి పొంగులేనిని ‘కారు’లోకి ఆహ్వానించటం గమనార్హం. ఇప్పటివరకూ మరే నేతకు దక్కని గౌరవం పొంగులేటికి దక్కిందనుకోవాలి. ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి తమ పార్టీలోకి వస్తున్న దానికి ప్రతిఫలంగా.. తగిన గౌరవం ఇచ్చేలా కేసీఆర్ ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది.

కారు పార్టీలోకి చేరటానికి రెఢీ అయిన పొంగులేటి మెడలో గులాబీ జెండా కప్పి సాదరంగా ఆహ్వానించిన మంత్రి కేటీఆర్ చాలా హుషారుగా కనిపించారు. ఆయన సంతోషానికి తగ్గట్లే ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. పొంగులేటిని టీఆర్ఎస్ లోకి ఆహ్వానించేందుకే తాను ఖమ్మం వచ్చినట్లు చెప్పటం ద్వారా.. ఆయనకు తామెంత గౌరవం ఇస్తున్న విషయాన్ని తన మాటలతో చెప్పే ప్రయత్నం చేశారు. అంతేకాదు.. పొంగులేటి.. ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు పార్టీ చేరికతో ఖమ్మం జిల్లాలో టీఆర్ ఎస్ మరింత బలపడటంతో పాటు.. ఆంధ్రా పార్టీ ఒకటి తెలంగాణలో అంతర్థానమైనట్లేనన్న విషయాన్ని ప్రకటించారు. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ కూడా ఇదే తీరులో అంతర్థానం అవుతుందని వ్యాఖ్యానించటం గమనార్హం. ఆపరేషన్ ఆకర్ష్ తో ప్రత్యర్థి పార్టీలను బలహీన పర్చే ధోరణికి భిన్నంగా.. సదరు పార్టీనే అంతర్థానం చేసే కొత్త కల్చర్ కు కేటీఆర్ నాంది పలికినట్లుగా చెప్పొచ్చు.
Tags:    

Similar News