ఐపీఎల్-19 మినీ వేలం రౌండ‌ప్.. వింత‌లు.. విశేషాలు..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజ‌న్ కు సంబంధించి వేలం ముగిసింది. ఇక వ‌చ్చే సీజ‌న్ కు ఏ జ‌ట్టులో ఎవ‌రు ఉండ‌నున్నారో తేలిపోయింది.;

Update: 2025-12-16 19:45 GMT

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజ‌న్ కు సంబంధించి వేలం ముగిసింది. ఇక వ‌చ్చే సీజ‌న్ కు ఏ జ‌ట్టులో ఎవ‌రు ఉండ‌నున్నారో తేలిపోయింది. త‌మ ఆట‌గాళ్ల తుది జాబితాను ఫ్రాంచైజీలు విడుద‌ల చేస్తే ఆ కాస్త స్ప‌ష్ట‌త కూడా వ‌చ్చేస్తుంది. మంగ‌ళ‌వారం అబుధాబిలో జ‌రిగిన మినీ వేలంలో అన్ని ఫ్రాంచైజీలూ క‌లిపి రూ.215.45 కోట్లు ఖ‌ర్చు చేశాయి. అయితే, వేలం క్ర‌మంలో ప‌లు విశేషాలు, వింత‌లు చోటుచేసుకున్నాయి. అన్ సోల్డ్ అవుతార‌ని అనుకున్న‌వారికి జాక్ పాట్ త‌గిలింది. మంచి ధ‌ర వ‌స్తుంద‌ని భావించిన‌వారికి నిరాశే మిగిలింది. అంద‌రూ అనుకున్న‌ట్లే ఆస్ట్రేలియా ఆల్ రౌండ‌ర్ కామెరూన్ గ్రీన్ కు రికార్డు ధ‌ర ద‌క్కింది. ఎన్న‌డూ లేనివిధంగా రికార్డు ధ‌ర ప‌లికి అన్ క్యాప్డ్ ఆట‌గాళ్లు కూడా మోత మోగించారు. మొత్తం 77 మంది ఆట‌గాళ్ల‌ను ఫ్రాంచైజీలు వేలంలో ఎంచుకోగా వీరిలో 29 మంది విదేశీయులు. ఒక‌ప్పుడు భార‌త దేశ‌వాళీ క్రికెట్ లో సంచ‌ల‌నాలు రేపిన ఇద్ద‌రు బ్యాట్స్ మ‌న్లు చివ‌ర‌కు క‌నీస ధ‌ర‌తో అమ్ముడుపోయి ప‌రువు ద‌క్కించుకున్నారు. వేలం రౌండ‌ప్ ఏమిటో చూద్దామా?

-రూ.2 కోట్ల బేస్ ప్రైస్ తో వేలంలోకి వ‌చ్చిన 18 ఆట‌గాళ్లు అన్ సోల్డ్ గా మిగిలారు. డెవాన్ కాన్వే, స్టీవ్ స్మిత్, తీక్ష‌ణ, డారిల్ మిచెల్, జాక్ ఫ్రేజ‌ర్ మెక్ గ‌ర్క్, బెయిర్ స్టో, మిచెల్ బ్రాస్ వెల్. భార‌త ఆట‌గాళ్ల‌లో ఆల్ రౌండ‌ర్ విజ‌య్ శంక‌ర్, ఉమేష్ యాద‌వ్, దీప‌క్ హుడా, మ‌యాంక్ అగ‌ర్వాల్ ను ఎవ‌రూ తీసుకోలేదు.

-రూ.2 కోట్ల క‌నీస ధ‌ర‌తో వేలంలోకి వ‌చ్చిన గ్రీన్ ను కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ రూ.25.20 కోట్ల ధ‌ర‌కు తీసుకుంది. దీనికోసం చెన్నై సూప‌ర్ కింగ్స్ తో పోటీ ప‌డింది. ఐపీఎల్ లో ఇది మూడో అత్య‌ధిక ధ‌ర‌. దీనికంటే ముందు గ‌త ఏడాది టీమ్ ఇండియా వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ రిష‌భ్ పంత్ ను ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ రూ.27 కోట్ల‌కు, బ్యాట్స్ మ‌న్ శ్రేయ‌స్ అయ్య‌ర్ ను పంజాబ్ కింగ్స్ రూ.26.75 కోట్ల‌కు వేలంలో ద‌క్కించుకున్నాయి.

జూనియ‌ర్ మ‌లింగ‌కు జాక్ పాట్

శ్రీలంక‌కు చెందిన పేస‌ర్ మ‌తీశ ప‌తిర‌న‌కు జాక్ పాట్ త‌గిలింది. ఆ దేశ మేటి పేస‌ర్ ల‌సిత్ మ‌లింగ త‌ర‌హాలో బౌలింగ్ చేసే ప‌తిర‌న‌ను రూ.18 కోట్ల‌కు కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ తీసుకుంది. ఇక్క‌డ ఢిల్లీ క్యాపిట‌ల్స్, ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ నుంచి పోటీ ఎదుర‌వ‌గా నైట్ రైడ‌ర్స్ భారీ మొత్తం వెచ్చించింది.

-అన్ క్యాప్డ్ (జాతీయ జ‌ట్టుకు ఆడ‌ని) ఆల్ రౌండ‌ర్లు ప్ర‌శాంత్ వీర్, కార్తీక్ శ‌ర్మల‌ను రూ.14.20 కోట్ల చొప్పున వెచ్చించి చెన్నై సొంతం చేసుకుంది. అన్ క్యాప్డ్ ఆట‌గాళ్ల‌కు లీగ్ చ‌రిత్ర‌లో ఇదే అత్య‌ధిక ధ‌ర కావ‌డం విశేషం.

మొద‌ట అన్ సోల్డ్.. త‌ర్వాత హైద‌రాబాద్ కు

ఇంగ్లండ్ విధ్వంస‌క బ్యాట‌ర్ లివింగ్ స్టోన్ మొద‌ట అన్ సోల్డ్ గా మిగిలిపోయాడు. మ‌ళ్లీ వేలంలోకి వ‌చ్చిన అత‌డిని స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఏకంగా రూ.13 కోట్ల‌కు పాడుకుంది. ఇత‌డిలాగానే ఆస్ట్రేలియా వికెట్ కీప‌ర్ బ్యాట్స్ మ‌న్ జోస్ ఇంగ్లిస్ కూడా మొద‌ట అన్ సోల్డ్ గా మిగిలాడు. త‌ర్వాత వేలంలోకి రాగా.. ల‌క్నో, హైద‌రాబాద్ పోటీ ప‌డ్డాయి. ల‌క్నో రూ.8.60 కోట్ల‌కు ద‌క్కించుకుంది. భార‌త స్పిన్న‌ర్ ర‌వి బిష్ణోయ్ ప‌ట్ల మొద‌ట ఎవ‌రూ ఆస‌క్తి చూప‌లేదు. రూ.2 కోట్ల బేస్ ప్రైస్ అయిన‌ప్ప‌టికీ వేలంలో తీసుకోలేదు. మ‌ళ్లీ వేలంలోకి రాగా.. రూ.7.20 కోట్ల‌కు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ తీసుకుంది. బంగ్లాదేశ్ పేస‌ర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ కూ మంచి ధ‌రే ద‌క్కింది. ఇత‌డిని రూ.9.20 కోట్ల‌కు కోల్ క‌తా ఎంచుకుంది.

మూడేళ్ల త‌ర్వాత రీఎంట్రీ.. రూ.7 కోట్ల ధ‌ర‌

మూడేళ్ల త‌ర్వాత లీగ్ లోకి రీఎంట్రీ ఇచ్చిన వెస్టిండీస్ ఆల్ రౌండ‌ర్ జేస‌న్ హోల్డ‌ర్ ను రూ.7 కోట్ల‌కు గుజ‌రాత్ టైటాన్స్ పాడుకుంది. నిరుడు రూ.23.75 కోట్ల రికార్డు ధ‌ర‌కు కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ తీసుకున్న వెంక‌టేశ్ అయ్య‌ర్ ను ఈసారి వేలంలోకి వ‌దిలేయ‌గా రూ.7 కోట్లు పెట్టి డిఫెండింగ్ చాంపియ‌న్ రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు సొంతం చేసుకుంది.

-ఒక‌నాటి భార‌త దేశ‌వాళీ సంచ‌ల‌నాలు స‌ర్ఫ‌రాజ్ ఖాన్ రూ75 ల‌క్ష‌ల బేస్ ప్రైస్ కు అన్ సోల్డ్ గా మిగిలాడు. మ‌ళ్లీ వేలంలోకి రాగా చెన్నై అదే ధ‌ర‌కు తీసుకుంది. మ‌రో యువ బ్యాట‌ర్ పృథ్వీ షాకు కూడా ఇదే ప‌రిస్థితి ఎదురైంది. ఇత‌డిని రూ.75 ల‌క్ష‌ల‌కు ఢిల్లీ క్యాపిట‌ల్స్ సొంతం చేసుకుంది.

Tags:    

Similar News