బోండి బీచ్ లో రెండో హీరో... కొత్త ఫుటేజ్ వైరల్!
ఆదివారం సిడ్నీలోని బోండీ బీచ్ లో హనుక్కా వేడుకలకు హాజరైన యూదులపై ఇద్దరు దుండగులు తుపాకులతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే.;
ఆదివారం సిడ్నీలోని బోండీ బీచ్ లో హనుక్కా వేడుకలకు హాజరైన యూదులపై ఇద్దరు దుండగులు తుపాకులతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 10 ఏళ్ల నుంచి 87 ఏళ్ల వయస్సు గల వారూ మొత్తం 15 మంది ఉన్నారు. మరోవైపు సుమారు 25 మంది ఇప్పటికి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని చెబుతున్నారు. ఇక ఈ ఘటనలో ఇప్పటికే ఒక హీరో తెరపైకి రాగా, తాజాగా రెండో హీరో ఫుటెజ్ బయటకు వచ్చింది.
అవును.. ఆస్ట్రేలియాలోని బోండీ బీచ్ లో యూదుల ఉత్సవంపై దాడి జరిపిన ఇద్దరు సాయుధులను సాజిద్ అక్రం (50), నవీద్ అక్రం (24)గా గుర్తించిన సంగతి తెలిసిందే. ఇందులో సాజిద్ అక్రం ను అడ్డుకుని, అతని చేతుల్లో నుంచి తుపాకీ లాక్కునే ప్రయత్నంలో తీవ్రంగా గాయపడి.. హీరో ఆఫ్ ఆస్ట్రేలియా అనిపించుకుంటున్న అహ్మద్ అల్ అహ్మద్ గురించి తెలిసిందే. ఈ క్రమంలో మరో హీరో తెరపైకి వచ్చారు.
ఇందులో భాగంగా... బీచ్ లో జరిగిన సామూహిక కాల్పుల సమయంలో వృద్ధ దంపతులు దాడి చేస్తున్న వారిలో ఒకరిని ఆపడానికి, అతని చేతుల్లో నుంచి తుపాకీని లాక్కోడానికి ప్రయత్నిస్తున్నట్లు చూపించే కొత్త వీడియో ఒకటి బయటపడింది. ఈ వీడియోలో ఓ వృద్ధుడు, ఓ స్త్రీ ఫుట్ పాత్ పై తుపాకీదారుడితో కుస్తీ పడుతున్నట్లు అస్పష్టంగా కనిపిస్తోంది. అయినప్పటికీ విషయం అర్ధమవుతుంది.
ఆ వీడియోలో షార్ట్స్, టీ షర్ట్ ధరించిన వృద్ధుడు తెల్లటి ప్యాంట్ ధరించి తుపాకీ పట్టుకున్న వ్యక్తితో కుస్తీపడుతున్నట్లు చూపిస్తోంది. ఆ సమయంలో వారిద్దరూ నేలపై పడిపోగా.. వృద్ధ మహిళ మాత్రం కారు పక్కన నిలబడి ఉంది! అయితే ఆ దాడి నుంచి ఆ దంపతులు బయట పడలేదు కానీ.. వారి ధైర్యసాహసాలు మాత్రం ప్రశంసలు అందుకుంటున్నాయి. వారిని బోరిస్, సోఫియా గా ఆస్ట్రేలియా మీడియా గుర్తించింది.
కాగా... బోండీ బీచ్ లో ఇద్దరు ముష్కరులు ఒక ఫుట్ బ్రిడ్జ్ పై నుంచి వేడుకకు హాజరైన యూదులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఆ ఇద్దరు ముష్కరులు తండ్రీకొడుకులను పోలీసులు తెలిపారు. ఆ సమయంలో అహ్మద్ అల్ అహ్మద్ అనే వ్యక్తి.. దాడికి పాల్పడుతున్న వ్యక్తిని ఎదుర్కొని, అతని చేతిలో నుంచి తుపాకీ తీసుకున్నాడు.. అతని ధైర్య సాహసాలతో క్షణాల్లో అనేకమంది ప్రాణాలు కాపాడారు!
ఈ సమయంలో... అహ్మద్ అల్ అహ్మద్ ఆ నేరస్థుడి తుపాకీని తనకు తాను ప్రమాదంలోకి నెట్టుకుని తీసేసుకున్నాడని, దాని ఫలితంగా అతనికి తీవ్ర గాయం అయ్యిందని.. అహ్మద్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని.. ఆయన త్వరగా కోలుకోవాలని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ అన్నారు. ఈ క్రమంలో తాజాగా మృతి చెందినప్పటికీ రెండో హీరో ఫుటేజ్ తెరపైకి వచ్చి, ప్రశంసలు అందుకుంటున్నారు!