కోనసీమకు నిర్మలమ్మ గుడ్ న్యూస్.. పలాసకు పంట పండినట్లే..!
ఆదివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.;
ఆదివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కు పలు గుడ్ న్యూస్ లు చెప్పారు. ఇందులో ప్రధానంగా కోనసీమతో పాటు కొబ్బరి రైతులకు, పలాసకు పలు వరాలు కురిపించారు! ఇదే సమయంలో ఏపీలో ప్రత్యేక మైనింగ్ మిషన్ ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. దీనిపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
అవును... కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు లోక్ సభలో 2026-27 వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో.. ప్రధానంగా కోనసీమలోనూ, అటు శ్రీకాకుళంలోనూ ప్రధాన పంటగా ఉన్న కొబ్బరి విషయంలో గుడ్ న్యూస్ లు చెప్పారు. ఇందులో భాగంగా... తీర ప్రాంతాల్లో కొబ్బరి చెట్ల ఏర్పాటుకు ప్రోత్సాహం అందిస్తామని.. కాయలు కాయని చెట్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయడానికి ప్రోత్సాహకాలు అందిస్తామని వెల్లడించారు.
అదేవిధంగా.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గంలోని మోరి.. శ్రీకాకుళంలోని పలాసలు జీడిపప్పు ఉత్పత్తికి ప్రత్యేక కేంద్రాలుగా ఉన్న నేపథ్యంలోనూ.. వారికీ గుడ్ న్యూస్ లు అందించారు. ఇందులో భాగంగా... జీడిపప్పు ఉత్పత్తి కోసం ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. దీంతో.. ఆంధ్రప్రదేశ్ లోనే అతిపెద్ద జీడిపప్పు కేంద్రంగా ఉన్న పలాస వాసులకు ఇది శుభపరిణామమని అంటున్నారు!
నాలుగు రాష్ట్రల్లో ప్రత్యేక మైనింగ్ మిషన్!:
ఇదే క్రమంలో తాజా ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్... ఖనిజ వనరులున్న రాష్ట్రాలకు ప్రత్యేక ప్రోత్సాహం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే రేర్ ఎర్త్ మినరల్స్ కోసం నాలుగు రాష్ట్రాల్లో స్పెషల్ ప్రోగ్రాం చేయనున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా... ఒడిశా, కేరళ, తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్ లోనూ ప్రత్యేక మైనింగ్ మిషన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.
స్పందించిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు!:
తాజా కేంద్ర బడ్జెట్ పై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందిస్తూ... తాజా బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు సింహభాగం కేటాయింపులు జరగడం ఆనందంగా ఉందని అన్నారు. ఇదే క్రమంలో... శ్రీకకుళం జిల్లాలో ప్రధాన పంటగా ఉన్న కొబ్బరికి తోడ్పాటు అందించే విధంగా ఈ ప్రోగ్రాం ఉందని.. ఇదే సమయంలో జీడి పంటకు సైతం తోడ్పాటు అందించే విధంగా కేటాయింపులు ఉండటం శుభపరిణామనని తెలిపారు.
ఇదె క్రమంలో... విదేశీ యాత్రలపై పన్ను తగ్గింపు చర్య పౌర విమానయాన రంగానికి మరింత ఊతమిస్తుందని చెప్పిన రామ్మోహన్ నాయుడు... ఏడు నగరాల మధ్య హైస్పీడ్ కారిడార్లు.. టూరిజం అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ, డేటా సెంటర్ల ఏర్పాటుకు తోడ్పాటు అందివడం మొదలైనవి ప్రగతిని సూచిస్తోన్నాయని అన్నారు. అదేవిధంగా... ప్రతీ జిల్లాలో బాలికల వసతి గృహం గొప్ప ఆలోచన అని తెలిపారు.