రాజకీయ సెగలు... జోగి రమేష్ ఇంటికి నిప్పు, ఎగసిపడుతున్న మంటలు!

ఏపీలో వైసీపీ తలపెట్టిన పాప ప్రక్షాళన పూజల కార్యక్రమం, అనంతర పరిణామాలు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన సంగతి తెలిసిందే.;

Update: 2026-02-01 18:25 GMT

ఏపీలో వైసీపీ తలపెట్టిన పాప ప్రక్షాళన పూజల కార్యక్రమం, అనంతర పరిణామాలు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై తీవ్రమైన అభ్యంతరకర, అసభ్యకర వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ నాయకులు, కార్యకర్తలుగా చెబుతున్నవారు.. ఆయన ఇల్లు, వాహనంపై దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా జోగి రమేష్ ఇంటికి నిప్పు పెట్టడం సంచలనంగా మారింది!

అవును... ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత జోగి రమేష్ కు నిరసన తెగ తగిలింది. ఇందులో భాగంగా... ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటిని ముట్టడించిన టీడీపీ శ్రేణులు.. పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఈ క్రమంలో కొందరు వ్యక్తులు జోగి రమేష్ ఇంటికి నిప్పంటించారు. దీంతో... జోగి రమేష్ ఇంటి నుంచి పెద్ద ఎత్తున మంటలు, పొగలు వ్యాపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది.

ఇబ్రహీంపట్నలో జోగి రమేష్ ఇంటికి వందలాదిగా వచ్చిన నిరసన కారులు, టీడీపీ కార్యకర్తలు దాడికి యత్నించారు. ఈ సమయంలో.. పెట్రోల్ బాంబులు, కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో కొంతమంది కార్యకర్తలు ఇంటికి నిప్పు పెట్టడంతో పెద్ద ఎత్తున పొగలు, మంటలు ఎగసిపడుతున్నాయి. ఈ ఘటన జరిగే సమయంలో జోగి రమేష్ తండ్రి, ఆయన సతీమణి ఇంట్లోనే ఉండగా.. రమేష్ మాత్రం తిరుపతిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నివాసంలో ఉన్నారని తెలుస్తోంది.

మరోవైపు శనివారం అంబటి రాంబాబుపై జరిగిన దాడి అనంతరం వైసీపీ నేతలు ఆయన నివాసానికి చేరుకుని పరామర్శించారు. ఇందులో భాగంగా... సజ్జల రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి, మేరుగ నాగార్జున, విడదల రజని, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, నందిగం సురేష్, లేళ్ల అప్పిరెడ్డి మరికొందరు నేతలు అంబటి రాంబాబు ఇంటికి వెళ్లి, ఆయన కుటుంబ సభ్యులను ప్రోత్సహించారు. ఈ సందర్భంగా స్పందించిన సజ్జల.. రాష్ట్రంలో దాడుల సంస్కృతి పెరిగిపోతుందని అన్నారు!

ఫోన్ లో జగన్ పరామర్శలు!:

తాజా పరిణామాల నేపథ్యంలో.. వైసీపీ నేతలు మాజీ మంత్రి విడదల రజనీ, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడులతో మాజీ సీఎం వైఎస్ జగన్ ఫోన్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా.. రాష్ట్రంలో జంగిల్ రాజ్ నడుస్తోందని.. చంద్రబాబు ఆటవిక పాలన చేస్తున్నారని విమర్శించిన జగన్.. పోలీసులను అడ్డుపెట్టుకుని చంద్రబాబు రాష్ట్రంలో దుర్మార్గాలు చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా ధైర్యంగా ఉండాలని, పార్టీ అండగా ఉంటుందని ఆ ఇద్దరు నేతలకు ధైర్యం చెప్పారు.

జోగి వివాదాస్పద వ్యాఖ్యలు!:

ఇబ్రహీంపట్నంలో ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం పూజలు నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడిన జోగి రమేష్... కల్తీ మాటలతో టీడీపీ కల్తీగా మారిందని.. సొంత సిట్ వేసుకుని తనను జైల్లో పెట్టి రాక్షసానందం పొందారని.. మంత్రి లోకేష్ కు చిప్ దెబ్బతిందని.. ఏడాదిన్నరలోనే రాష్ట్రాన్ని నాశనం చేశారని.. ఇకనైనా బుద్ధి తక్కువ రాజకీయాలు మానుకోవాలని.. టీడీపీ నాయకులకు మంచి బుద్ధిని ప్రసాదించాలని పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు!

Tags:    

Similar News