రెండు పదవులు, మూడు కులాలు... కాబోయే కేంద్ర మంత్రులపై ఊహాగానాలు!

ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవడంతో మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేయాలని ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది.

Update: 2026-06-25 16:30 GMT

కేంద్ర మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ దాదాపు ఖరారైందని అంటున్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవడంతో మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేయాలని ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. మంత్రివర్గంలో సీనియర్లను తప్పించి యువరక్తం ఎక్కించాలనే ఆలోచనతో ఈ సారి కొత్తవారికి ఎక్కువ అవకాశాలు ఇవ్వాలనే ఆలోచనతో ప్రధాని ఉన్నారని అంటున్నారు. అదే సమయంలో కొందరు అనుభవజ్ఞులకు మంత్రివర్గంలో చోటిస్తారని చెబుతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల వరకు వస్తే ఏపీ నుంచి ఈ సారి ఇద్దరు ఎంపీలను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకునే చాన్స్ ఉందని అంటున్నారు. దీంతో కేంద్ర మంత్రి వర్గంలో చేరే ఆ ఇద్దరు ఎవరు? అన్న అంశంపై విస్తృత చర్చ జరుగుతోంది.

ఏపీలో ఎన్డీఏ కూటమికి 21 మంది లోక్ సభ ఆరుగురు రాజ్యసభ సభ్యులు ఉన్నారు. వీరిలో ప్రస్తుతం ముగ్గురు కేంద్ర మంత్రులుగా పనిచేస్తున్నారు. టీడీపీ నుంచి శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహననాయుడు కేబినెట్ మంత్రిగా ఉండగా, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, నరసాపురం బీజేపీ ఎంపీ భూపతిరాజు శ్రీనివాసవర్మ సహాయ మంత్రులుగా పనిచేస్తున్నారు. ఈ ముగ్గురిలో రామ్మోహననాయుడు, పెమ్మసాని 50 ఏళ్లలోపు వారే కావడంతో వారిని తప్పించే అవకాశాలు లేవని అంటున్నారు. అదే సమయంలో బీజేపీ మంత్రి శ్రీనివాసవర్మ కూడా పెద్ద వయసు వారు కాదని, రాష్ట్రం నుంచి బీజేపీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక మంత్రి కావడంతో ఆయన విషయంలో వేరే ఆలోచన ఉండకపోవచ్చని అంటున్నారు.

ఇక ఈ ముగ్గురిని కొనసాగిస్తే, కొత్తగా ఎవరికి అవకాశం దక్కుతుందనేదే ఉత్కంఠ రేపుతోంది. సామాజిక, ప్రాంతీయ రాజకీయ సమీకరణలతో ఎవరెవరికి చాన్స్ లభించే అవకాశం ఉందనే చర్చ ఎక్కువగా జరుగుతోంది. ప్రస్తుతం కేబినెట్ లో ఉన్న ముగ్గురిలో రామ్మోహననాయుడు బీసీ సామాజికవర్గానికి చెందిన వారు. ఇక మిగిలిన పెమ్మసాని, శ్రీనివాసవర్మ అగ్ర కులాలు వారే. దీంతో కొత్తగా కేబినెట్ లో చేర్చుకునే వారిలో ఎస్సీలకు తప్పనిసరిగా అవకాశం ఇవ్వాలనే ప్రతిపాదన పరిశీలిస్తున్నారని అంటున్నారు. అదే సమయంలో రాష్ట్రంలో ప్రధాన సామాజిక వర్గాలైన కాపు, రెడ్డి కులాలకు చెందిన నేతలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలనే సూచనలు వస్తున్నాయని చెబుతున్నారు.

రాష్ట్రంలో ప్రధాన సామాజిక వర్గాలైన కాపు, కమ్మ, రెడ్డి కులాల్లో ప్రస్తుతం పెమ్మసాని మాత్రమే మంత్రిగా ఉన్నారు. దీంతో కాపు, రెడ్డి సామాజిక వర్గాల వారికి అవకాశం కల్పించాలని డిమాండ్ వినిపిస్తోంది. దీంతో ఆయా సామాజికవర్గాలకు చెందిన పలువురు నేతలు అధిష్టానం దృష్టిలో పడే ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. ఇదే సమయంలో రాష్ట్రానికి కేటాయించే రెండు మంత్రి పదవులను ఏ పార్టీ వారికి ఇస్తారనేది కూడా చర్చనీయాంశంగా ఉంది. ప్రస్తుతం టీడీపీ 2, బీజేపీ 1 చొప్పున మంత్రులు ఉండగా, త్వరలో కేటాయించే రెండింటిని ఏ పార్టీకి ఇస్తారనేది చూడాల్సివుందని అంటున్నారు. కేంద్ర మంత్రివర్గంలో ఇప్పటివరకు జనసేనకు ప్రాతినిధ్యం లేకపోవడంతో ఆ పార్టీకి చాన్స్ వస్తుందా? అన్న చర్చ ఎక్కువగా జరుగుతోంది. బీజేపీ, జనసేన నుంచి ఒకరికి, టీడీపీ నుంచి మరొకరికి చాన్స్ వస్తుందన్న ప్రచారం జరుగుతోంది. దీంతో కేంద్ర మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణ అంశం రాజకీయంగా హీట్ పుట్టిస్తోంది.

Tags:    

Similar News