8 ఉద్యోగాలు.. 25 మంది అర్హులు.. కానీ ఒక్కరే హాజరు: భయంతో భవిష్యత్తును బలి!

మధ్యప్రదేశ్ అటవీశాఖ 8 ఫారెస్ట్ గార్డ్స్ ఉద్యోగాల కోసం గతంలో నోటిఫికేషన్ ఇచ్చింది.

Update: 2026-06-25 18:30 GMT

దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని, ప్రభుత్వ ఉద్యోగాల కోసం విపరీతమైన పోటీ ఉంటుందని తరచూ వింటుంటాం.. చదువుతుంటాం.. ప్రభుత్వ ఉద్యోగం అనేది లక్షలాది మంది యువత కల. ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడి చదవడమే కాకుండా, ఎన్నో త్యాగాలు చేసి ఉద్యోగం తెచ్చుకోవాలని ప్రయత్నాలు చేస్తుంటారు. చాలా మంది యువకులు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలనే ఏకైక లక్ష్యంతో సంవత్సరాలు తరబడి తపస్సు చేస్తుంటారు. నిద్రహారాలు మానుకుని ఉద్యోగ అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణత కోసం కష్టపడుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగ అవకాశాన్ని ఎవరైనా చేజేతులా వదులుకుంటారా? పోటీ ఉందనే భయంతో వెనక్కి తగ్గుతారా? ఎక్కడైనా ఇలా జరుగుతుందో లేదో కానీ ఇలాంటి విచిత్రం మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది.

మధ్యప్రదేశ్ అటవీశాఖ 8 ఫారెస్ట్ గార్డ్స్ ఉద్యోగాల కోసం గతంలో నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ పోస్టులను మూడు వెనుకబడిన తరగతుల వారికి రిజర్వు చేసింది. ప్రభుత్వ ఉద్యోగాలు కావడంతో చాలా మంది అర్హులు దరఖాస్తు చేసుకున్నారు. ఇక నిబంధనల ప్రకారం వడపోత అయ్యాక 26 మంది ఫిజికల్ టెస్ట్ కు అర్హత సాధించారు. 15 కి.మీ. నడక పోటీలో ఉత్తీర్ణులయ్యే వారిని ఉద్యోగాలకు ఎంపిక చేస్తామని అధికారులు ప్రకటించారు. 8 ఉద్యోగాల కోసం 26 మంది ఫిజికల్ టెస్ట్ కు కాల్ లెటర్స్ పంపారని అంటున్నారు. అయితే అంతకుముందు విపరీతమైన పోటీని తట్టుకుని ఫిజికల్ టెస్ట్ కు అర్హత సాధించిన వారు చివరి నిమిషంలో మాత్రం వెనకడుగు వేశారు.

అధికారులు 26 మందికి కాల్ లెటర్స్ పంపితే కేవలం ఒక మహిళా అభ్యర్థి మాత్రమే ఫిజికల్ టెస్ట్ కు హాజరయ్యారు. దీంతో చేసేది లేక అధికారులు ఆ మహిళా అభ్యర్థి ఒక్కరికి మాత్రమే పరీక్ష పెట్టి ఉద్యోగానికి ఎంపిక చేశారు. దీంతో 8 ఉద్యోగాలకు 7 పోస్టులు ఖాళీగా ఉండిపోయాయి. ఇక ఫిజికల్ టెస్టుకు హాజరైన ఏకైక అభ్యర్థి కోసం దాదాపు డజను మందికి పైగా అధికారులు పర్యవేక్షణకు రావడం గమనార్హం. కాగా, రాత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఫిజికల్ టెస్టుకు గైర్హాజరు కావడం ఎవరికీ అంతుచిక్కడం లేదు. పోటీని తట్టుకుని నెగ్గుకు రాలేమన్న భయంతో వెనక్కి తగ్గారా? లేక 15 కి.మీ. నడక పరీక్షను చూసి భయపడ్డారో తెలియడం లేదని అంటున్నారు.

ప్రభుత్వ ఉద్యోగం కోసం వేల మంది ఎదురుచూస్తున్న తరుణంలో, అర్హులైన అభ్యర్థులు ఇలా భయపడి వెనక్క తగ్గడం అనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరో వైపు ఈ ఉదంతంపై అనేక విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. కష్టపడి సాధించిన అవకాశాన్ని చిన్న చిన్న భయాలతో వదులుకోవడం అంటే జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేయడమే అంటున్నారు. భవిష్యత్తుపై నమ్మకంతో, ఆఖరి నిమిషం వరకు పోరాడాలని నిరుద్యోగులకు సూచిస్తున్నారు. మొత్తం మీద, ఈ సంఘటన నిరుద్యోగ యువతకు ఒక కనువిప్పు కావాలని అంటున్నారు. పోటీ తీవ్రంగా ఉన్నప్పుడు, వచ్చిన ప్రతి అవకాశాన్ని ఒక మెట్టుగా భావించి, విజయ శిఖరాలను అధిరోహించాలని హితవు పలుకుతున్నారు.

Tags:    

Similar News