కృష్ణా జిల్లా అమ్మాయిపై అమెరికా ఉపాధ్యక్షుడు మతమార్పిడి ఒత్తిళ్లు చేశారా?!
అమెరికా రాజకీయాల్లో అత్యున్నత స్థానంలో ఉన్న ప్రముఖులలో భారతీయ మూలాలున్న ఉషా వాన్స్ (నీ చిలుకూరి) ఒకరు.
అమెరికా రాజకీయాల్లో అత్యున్నత స్థానంలో ఉన్న ప్రముఖులలో భారతీయ మూలాలున్న ఉషా వాన్స్ (నీ చిలుకూరి) ఒకరు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సతీమణి అయిన ఈమె ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్ `రెండవ మహిళ`గా గుర్తింపు పొందారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన భారతీయ-అమెరికన్ కుటుంబంలో జన్మించిన ఉషా వాన్స్ పూర్వీకులు కృష్ణా జిల్లాతో పాటు పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు సమీపంలో గల వడ్లూరు గ్రామానికి చెందినవారు. అయితే ఇటీవల ఉషా భర్త జేడీ వాన్స్ తన భార్య క్రిస్టియన్ మతంలోకి మారాలని గతంలో చేసిన కొన్ని వ్యాఖ్యల ఆధారంగా.. ఉషా వాన్స్‌పై మతమార్పిడి ఒత్తిళ్లు-వేధింపులు జరుగుతున్నాయంటూ నెట్టింట పెద్ద ఎత్తున రూమర్స్, అపార్థాలు మొదలయ్యాయి.
ఈ వివాదంపై ఉషా వాన్స్ ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో స్పందిస్తూ కీలకమైన స్టేట్‌మెంట్ ఇచ్చారు. తన భర్త జేడీ వాన్స్ తనపై మతమార్పిడి ఒత్తిడి తెస్తున్నారనే వాదనలను పూర్తిగా ఖండించారు. జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలను ప్రజలు, మీడియా తప్పుగా అర్థం చేసుకున్నారని.. తనపై ఎలాంటి ఒత్తిళ్లు లేవని స్పష్టం చేశారు. `అలాంటిదేం లేదు` అని వ్యాఖ్యానిస్తూ తన భర్తకు ఆమె పూర్తి మద్దతుగా నిలిచారు. తామిద్దరం పరస్పర గౌరవంతో జీవిస్తున్నామని ఉషా చెప్పిన మాటలు ఈ వివాదానికి, నెట్టింట జరుగుతున్న ప్రచారానికి తెరదించాయి.
ఉషా చిలుకూరి వాన్స్ 1986 జనవరి 6న కాలిఫోర్నియాలోని శాన్ డియాగోలో తెలుగు మాట్లాడే భారతీయ సంతతి కుటుంబంలో జన్మించారు. ఈ ప్రముఖురాలి తల్లిదండ్రులు క్రిష్ చిలుకూరి, లక్ష్మి చిలుకూరి ఇద్దరూ ప్రొఫెసర్లుగా పనిచేసారు. చిన్నతనం నుండే పుస్తకాలు ఎక్కువగా చదివే అలవాటున్న ఉషను తన స్నేహితులు `పుస్తకాల పురుగు` అని పిలిచేవారు. విద్యాభ్యాసం విషయానికి వస్తే.. ఉషా యేల్ విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి.. ఆ తర్వాత యేల్ లా స్కూల్ , కేంబ్రిడ్జ్‌లోని క్లేర్ కాలేజీలో లా (న్యాయశాస్త్రం) అభ్యసించారు.
ఉషా వాన్స్ వృత్తి జీవితంలో ఎన్నో కీలక బాధ్యతలను విజయవంతంగా నిర్వహించారు. 2014-2015 వరకు డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా సర్క్యూట్ న్యాయస్థానంలో న్యాయవాదిగా పనిచేసిన ఉషా 2017-2018 మధ్య కాలంలో అమెరికా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్‌కు లా క్లర్క్ (సహాయకురాలిగా) సేవలు అందించారు. 2019లో డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా బార్‌లో చేరిన ఉష... 2024 జూలై వరకు ప్రఖ్యాత న్యాయ సంస్థ `ముంగెర్, టోల్లెస్ & ఓల్సన్ ఎల్.ఎల్.పి` లో న్యాయవాదిగా పనిచేశారు. దీనితో పాటు సిన్సినాటి సింఫనీ ఆర్కెస్ట్రా బోర్డు కార్యదర్శిగా కూడా ఉషా బాధ్యతలు నిర్వర్తించారు.
వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. యేల్ లా స్కూల్‌లో చదువుతున్న రోజుల్లో జేడీ వాన్స్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. వీరు 2014లో కెంటకీలో మతాంతర వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇవాన్, వివేక్, మిరాబెల్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. జేడీ వాన్స్ రోమన్ క్యాథలిక్ మతాన్ని అనుసరిస్తుండగా..ఉషా వాన్స్ మాత్రం తన హిందూ మతాన్ని ఎంతో భక్తిశ్రద్ధలతో ఆచరిస్తున్నారు. అమెరికా చరిత్రలోనే వైస్ ప్రెసిడెంట్ భార్యగా (సెకండ్ లేడీగా) హిందూ మతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మొదటి మహిళగా ఉషా వాన్స్ ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. తాను హిందూ కుటుంబంలో జన్మించి ఇతర మతాలను అనుసరించలేనని ఉషా వాన్స్ స్పష్టంగా ప్రకటించారు.