బూజు ప‌డుతున్న తెలంగాణ భ‌వ‌న్‌!

తెలంగాణ భ‌వ‌న్‌.. ఈ పేరును దాదాపు తెలంగాణ ప్ర‌భుత్వం మ‌రిచిపోయిన‌ట్టుగా క‌నిపిస్తోంది.

Update: 2026-06-25 14:30 GMT

తెలంగాణ భ‌వ‌న్‌.. ఈ పేరును దాదాపు తెలంగాణ ప్ర‌భుత్వం మ‌రిచిపోయిన‌ట్టుగా క‌నిపిస్తోంది. రాష్ట్ర అధికారులు, మంత్రులు, ముఖ్య‌మంత్రి అవ‌స‌ర‌మై.. ఢిల్లీ వెళ్తే.. అక్క‌డ ఉండేందుకు.. అక్క‌డే కార్య‌క‌లా పాలు నిర్వ‌హించేందుకు కీల‌క‌మైన తెలంగాణ భ‌వ‌న్‌కు కేసీఆర్ రెండో విడ‌త పాల‌న‌లో శంకుస్థాప‌న చేశారు. ప‌టౌడీ రోడ్డులో దీనికి భూమిని కేటాయించిన కేంద్ర ప్ర‌భుత్వం కొంత మేర‌కు సాయం చేసేందుకు కూడా ముందుకు వ‌చ్చింది.

అప్ప‌టిలెక్క‌ల ప్ర‌కారం.. 8 అంత‌స్థుల‌తో ఈ భ‌వ‌నం నిర్మాణం పూర్తి చేయాల‌ని నిర్ణ‌యించారు. 200 కార్లు, 500 బైకుల పార్కింగ్ ఏరియాతో దీనికి ఎల్ అండ్ టీ సంస్థ ఇంజ‌నీరింగ్ స‌హ‌కారం అందిస్తోంది. అప్ప‌ట్లో సీఎం కేసీఆర్ ఎంతో అట్ట‌హాసంగా ఈ భ‌వ‌నానికి శంకుస్థాప‌న చేశారు. ఈ నిర్మాణాన్ని నాలుగు సంవ‌త్స‌రాల్లో పూర్తి చేయాల‌ని కూడా నిర్ణ‌యించిన‌ట్టు తెలిపారు. ఎలాంటి వ‌ర‌ద‌లు, భూకంపాలు వ‌చ్చినా త‌ట్టుకునేలా ప్లాన్ చేసిన‌ట్టు కూడా తెలిపారు.

అయితే.. 2023లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ ప్ర‌భుత్వం దిగిపోయింది. అనంత‌రం.. అధికారంలోకి వ‌చ్చిన కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఈ నిర్మాణాన్ని కొన‌సాగించాల్సి ఉంది. కానీ.. కార‌ణాలు ఏవైనా కూడా.. తెలంగాణ భ‌వ‌న్ నిర్మాణంపై ప్ర‌భుత్వం ఊసెత్త‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు.. క‌నీసం ఈ నిర్మాణంపై స‌మీక్ష కూడా చేయ‌డం లేదు. మ‌రోవైపు విడ‌త‌ల వారీగా కేంద్రం ఇచ్చే నిధుల విష‌యం కూడా నిలిచి పోయింది.

తాజాగా అలెర్ట్‌..

ఈ వ్య‌వ‌హారంపై తాజాగా కేంద్ర హోం శాఖ వ‌ర్గాలు ఆరా తీశాయి. నిర్మాణానికి సంబంధించి ఇప్ప‌టి వ‌ర‌కు ఇచ్చిన 300 కోట్ల రూపాయ‌ల‌కు లెక్క‌లు చెప్పాల‌ని.. నిర్మాణ పురోగ‌తిపై నివేదిక ఇవ్వాల‌ని తెలంగాణ అధికారుల‌ను హోం శాఖ వ‌ర్గాలు కోరిన‌ట్టు స‌మాచారం. అయితే.. ఈ వ్య‌వ‌హారంపై ఇప్ప‌టి వ‌ర‌కు స‌ర్కారు స్పందించ‌లేదు. మ‌రోవైపు. ప్ర‌స్తుతం ఏపీకి ఉన్న ఏపీ భ‌వ‌న్‌లో నే తెలంగాణ అధికారులు మ‌రోవైపు ఉంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లినా.. వేరే ప్రాంతంలో ఉంటున్నారు త‌ప్ప‌.. ఏపీ భ‌వ‌న్‌కు రావ‌డం లేద‌ని, తెలంగాణ భ‌వ‌న్ గురించి ప‌ట్టించుకోవ‌డం లేద‌ని చెబుతున్నారు.

Tags:    

Similar News