అన్ క్యాప్డ్.. ఐనా ఐపీఎల్ వేలంలో రూ.కోట్లు కొల్లగొట్టారు
ప్రశాంత్ వీర్.. కార్తీక్ శర్మ, ఆకిబ్ దార్.. దేశవాళీల్లో ఎప్పుడూ వినిపించని క్రికెటర్ల పేర్లు ఇవి..! కానీ, ఇప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మినీ వేలంలో సూపర్ హీరోలు.;
ప్రశాంత్ వీర్.. కార్తీక్ శర్మ, ఆకిబ్ దార్.. దేశవాళీల్లో ఎప్పుడూ వినిపించని క్రికెటర్ల పేర్లు ఇవి..! కానీ, ఇప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మినీ వేలంలో సూపర్ హీరోలు. మంగళవారం అబుధాబిలో జరిగిన వేలంలో అంతగా డబ్బులు పోసుకున్నారు మరి..! వాస్తవానికి చాలా రోజుల నుంచి ఈ కుర్రాళ్లు ఐపీఎల్ వేలంలో జాక్ పాట్ కొడతారని భావిస్తున్నారు. చివరకు అనుకున్నదే అయింది. కేవలం రూ.30 లక్షలతో వేలంలోకి వచ్చిన వీరు రూ.కోట్లు దక్కించుకున్నారు. ప్రశాంత్, కార్తీక్ ఏకంగా రూ.14.20 కోట్లు పొందారు. వీరిద్దరినీ చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకోవడం విశేషం. భారతీయ అన్ క్యాప్డ్ (జాతీయ జట్టుకు ఆడని) ఆటగాళ్లకు లీగ్ లో ఇప్పటివరకు దక్కిన అత్యధిక ధర ఇదే. కశ్మీర్ బౌలర్ అకిబ్ దార్ దేశవాళీల్లో వికెట్ల మీద వికెట్లు తీస్తున్నాడు. ఇతడిని ఢిల్లీ క్యాపిటల్స్ రూ.8.40 కోట్లకు దక్కించుకుంది.
స్వింగ్ కింగ్ అకిబ్..
కశ్మీర్ కు చెందిన అకిబ్ దార్ స్వింగ్ బౌలింగ్ తో దుమ్మురేపుతున్నాడు. అతడి బంతులు బ్యాట్స్ మెన్ ను అంతగా కంగుతినిపిస్తున్నాయి. ఇటీవల డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ గానూ మారాడు. ముస్తాక్ అలీ ట్రోఫీలో 15 వికెట్లు తీశాడు. గతంలో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్ కతా నైట్ రైడర్స్ కు నెట్ బౌలర్ గా పనిచేశాడు అకిబ్ దార్.
ప్రశాంతంగా ఆడేస్తాడు..
ముస్తాక్ అలీ ట్రోఫీతో పాటు యూపీ అండర్ 23 జట్టులో మెరుపులు మెరిపించాడు ప్రశాంత వీర్. 170 స్ట్రయిక్ రేట్ తో 112 పరుగులు చేయడంతో పాటు 6.76 ఎకానమీతో 9 వికెట్లు పడగొట్టాడు. ఇతడి కోసం లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కాఇంగ్స్, రాజస్థాన్ రాయల్స్ పోటీపడ్డాయి. రూ.14.20 కోట్లకు చెన్నై ఎగరేసుకుపోయింది. సీనియర్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా స్థానాన్ని ఇతడితో భర్తీ చేయాలని చూస్తోంది.
కార్తీక్.. క్లీన్ స్ట్రయికర్
భారీ షాట్లతో బంతిని క్లీన్ గా కొట్టడంతో పాటు లోయరార్డర్ లో ఫినిషర్ కార్తీక్ శర్మ. 12 టి20 మ్యాచ్ లు ఆడిన ఇతడు 164 స్ట్రయిక్ రేట్ తో 334 పరుగులు సాధించాడు. ఇందులో 28 సిక్సర్లు ఉండడం విశేషం. పీటర్సన్, అశ్విన్ వంటివారి ప్రశంసలు పొందిన ఇతడి కోసం వేలంలో కోల్ కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ పోటీ పడ్డాయి. ముస్తాక్ అలీ ట్రోఫీలో ఏడు మ్యాచ్ లలో ఆరు మ్యాచ్ లను రాజస్థాన్ గెలవడంలో కార్తీక్ ప్రమేయం ఉండడం విశేషం.