జగన్ పై రిలేషన్ ఎంత ఉందో క్లియర్ గా చెప్పేశారుగా?

Update: 2020-08-10 04:00 GMT
ఏ మాటకు ఆ మాటకు కొన్ని విషయాల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను.. ఆయన కుమారుడు కమ్ మంత్రి కేటీఆర్ ను అభినందించాల్సిందే. తమకు చికాకు పెట్టే ప్రశ్నలు అడిగిన సందర్భంలో మీరు ఫలానా మీడియా కదా? అంటూ రోటీన్ పంచ్ లకు భిన్నంగా.. ఏమయ్యా.. అడిగే ప్రశ్నలతో అర్థముందా? అంటూ ముఖాన అనేయటం ముఖ్యమంత్రి కేసీఆర్ కు అలవాటే. తన తండ్రి మాదిరి కాకుండా మంత్రి కేటీఆర్ మాత్రం కాస్త సాఫ్ట్ గా విషయాన్ని పక్కకు తీసుకెళ్లి.. మాట తప్పించేస్తుంటారు.

ఓపక్క విపక్షాలు విరుచుకుపడే అంశంపైన స్పందించటమంటే.. జాగ్రత్త చాలా అవసరం. అందునా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం నడిచే వేళలో.. ఏపీ సర్కారుతో తమకు సత్ సంబంధాలు ఉన్నాయన్న మాట నోటి నుంచి రావటానికి పెద్ద ఇష్టపడని తీరుకు భిన్నంగా స్పందించారు మంత్రి కేటీఆర్. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీళ్ల పంచాయితీ నడుస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రయోజనాల్ని దెబ్బ తినేలా తెలంగాణ అధికారపక్షం ఏపీ అధికారపక్షంతో రాజీ పడిందంటూ విపక్షాలు మండిపడుతున్నాయి.

ఇలాంటివేళ.. ఏపీ సర్కారుతో.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో ఎలాంటి రిలేషన్స్ ఉన్నాయన్న ఆసక్తికర ప్రశ్నను.. సోషల్ మీడియా వేదికగా.. ఒక నెటిజన్ మంత్రి కేటీఆర్ ను ప్రశ్నించారు. దీనికి స్పందించిన ఆయన.. కృష్ణా నదీ జలాల విషయంలో చట్టబద్ధమైన హక్కుల సాధనం కోసం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న పోరాటం కొనసాగుతందని స్పష్టం చేశారు.

 తమ స్టాండ్ ను ఇప్పటికే సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఏపీతో మంచి సంబంధాలు ఉన్నాయని.. అయినప్పటికీ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడేది లేదని స్పష్టం చేశారు. ఏపీతో అన్న మాటతో.. ముఖ్యమంత్రి జగన్ తో మంచి సంబంధాలు ఉన్నట్లు చెప్పారని చెప్పాలి. ఈ సందర్భంగా తాము రాజీ పడుతున్నామన్న ఆరోపణలకు మాత్రం స్పందించకపోవటం గమనార్హం.
Tags:    

Similar News