కోడెల పశ్చాతాపం ప్రకటించుకుంటున్నారా? ప్రయోజనం?

Update: 2019-03-14 16:48 GMT
సత్తెనపల్లిలో తెలుగుదేశం పార్టీ రాజకీయాలు ఆసక్తిదాయకంగా మారాయి.  ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి సిట్టింగ్ ఎమ్మెల్యే కోడెల శివప్రసాద్ ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు. నరసరావు పేట ఎంపీగా పోటీ చేయాలని చంద్రబాబు నాయుడు ఒత్తిడి చేస్తున్నా కోడెల అందుకు ససేమేరా అంటున్నారు. తను సత్తెనపల్లి  నుంచినే పోటీ చేయడానికి ఆయన మొగ్గుచూపుతూ ఉన్నారు.

ఇక మరోవైపు ఈ నియోజకవర్గం విషయంలో రాయపాటి సాంబశివరావు దృష్టి సారించారు. తన తనయుడికి సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని రాయపాటి చంద్రబాబును కోరుతూ ఉన్నారు. ఇలా తెలుగుదేశం పార్టీలో ఈ సీటు విషయంలో పోటీ నెలకొని ఉంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి అనుకూల పరిస్థితి ఉందని..అందుకే ఈపోటీ ఉందని ప్రచారం సాగుతూ ఉంది.

విశేషం ఏమిటంటే.. ఈ సీటు విషయంలో ఈ ఇద్దరి నేతలకూ చంద్రబాబు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం లేదు. దీంతో తెలుగుదేశం పార్టీకి రాజీనామాకు రెడీ అయ్యారు రాయపాటి. ఇక కోడెల ఇక్కడ నుంచి పోటీ చేయడానికి వీళ్లేదని తెలుగుదేశం పార్టీలోనే అసమ్మతి మొదలైంది. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిరసనలు తెలుపుతున్నారు. కోడెలకు సత్తెన పల్లి సీటు ఇవ్వవద్దని వారు వాదిస్తూ ఉన్నారు.

కోడెల తీరు సరిగా లేదని, ఆయన కుటుంబీకుల జోక్యం ఎక్కువని.. ఆయన పోటీ చేస్తే గెలిచే పరిస్థితి లేదని.. కోడెలను, దూడలను భరించలేకపోతున్నట్టుగా సత్తెనపల్లి తెలుగుదేశం వర్గాలు వాదిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో.. కోడెల స్పందించారు. ఈ సారికి తనకు సహకరించాలని ఆయన అంటున్నారు.

వచ్చేసారి తన సంతానం రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోరని ఆయన చెప్పుకురావడం విశేషం. అంటే ఇన్నాళ్లూ జరిగిందేదో జరిగిపోయింది, ఇక అలా జరగదు అని కోడెల ప్రాయశ్చిత్యాన్ని ప్రకటించుకుంటున్నట్టుగా ఉంది కథ. మరి దీంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చల్లబడతారా? అనేది ప్రశ్నార్థకమే!


Tags:    

Similar News