కేసీఆర్ వర్సెస్ ఈటల.. ఆసక్తికరంగా హుజూరాబాద్ ఫైట్

Update: 2021-06-19 23:30 GMT
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజకీయ చాణక్యత గురించి అందరికీ తెలిసిందే. తెలంగాణ రాదు అనుకున్న వారందరికీ షాకిస్తూ ఆయన సాధించిపెట్టారు. నయానో భయానో.. పొత్తులో ఎత్తులో కానీ కాంగ్రెస్ ను ఒప్పించి రాష్ట్రం సాధించుకున్నారు. అయితే గులాబీ దళపతిని ఎదురించిన నేతలను చావుదెబ్బ తీయడం ఆయనకు అలవాటు అన్న చర్చ రాజకీయవర్గాల్లో ఉంది. ఆలె నరేంద్ర నుంచి విజయశాంతి, ఇప్పటి ఈటల వరకు కేసీఆర్ ను ఎదురించిన వారు రాజకీయంగా వెనుకబడ్డ పరిస్థితి నెలకొంది.

అయితే అందరూ రాజకీయంగా సైలెంట్ అయినా కూడా ఈటల రాజేందర్ కు మాత్రం కేసీఆర్ పొడ గిట్టడం లేదు. గులాబీ దళపతిని దూకుడుగా ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఈటల రాజేందర్ వర్సెస్ కేసీఆర్ అన్నట్లుగా పోరు సాగుతోంది. టీఆర్ఎస్ పార్టీ వ్యూహాలకు పదును పెడుతోంది. ఈటల రాజేందర్ కూడా ప్రతివ్యూహాలతో హుజూరాబాద్ బరిలోకి దిగుతున్నారు.

ప్రస్తుతం కేసీఆర్... ఈటలను ఎలాగైనా సరే రాజకీయంగా చావుదెబ్బతీయాలని..ఎమ్మెల్యే కాకుండా నిరోధించాలని చూస్తున్నట్టుగా పరిస్థితులు కనపడుతున్నాయి. పాత నేతలలాగానే ఈటలను కూడా రాజకీయంగా ఉనికి లేకుండా చేయాలని కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నాడట.. ఈ క్రమంలోనే ఇటీవలే ఏకంగా హుజూరాబాద్ నియోజకవర్గానికి 35 కోట్లు కేటాయించడం చర్చనీయాంశమైంది. అభివృద్ధి పేరుతో ఈటలను కొట్టాలని కేసీఆర్ స్కెచ్ గీస్తున్నారు.

హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్టుగా పరిస్థితి కొనసాగుతోంది. హుజూరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఈటల రాజీనామా చేయడంతో అక్కడ ఉప ఎన్నిక వేడి రాజుకుంది. ఇక్కడ ఎలాగైనా సరే ఈటలను ఓడించాలని కేసీఆర్ పట్టుదలగా ఉన్నారు. ఇక ఈటల తనకు చావోరేవో అన్నట్టుగా పోరాడుతున్నారు. ఇప్పుడే ఇంటింటికి వెళుతున్నారు.

ఈటల రాజేందర్ ఈ ఉప ఎన్నికల్లో గెలిస్తే ఆయన బలం.. బీజేపీకి స్థైర్యం మరింత పుంజుకుంటుంది. ఓడితే ఈటల రాజకీయ భవిష్యత్తు మరింత ప్రశ్నార్థకం అవుతుంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా కదులుతోంది. మంత్రులు గంగుల, కొప్పుల, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, మాజీ ఎంపీ వినోద్ కుమార్ లను హుజూరాబాద్ లో టీఆర్ఎస్ అప్పుడే రంగంలోకి దింపింది. ఈటల వర్గాన్ని బలహీన పరిచేలా ప్రయత్నం చేస్తోంది. కేసీఆర్ వ్యూహాలను వీరంతా అమలు చేస్తున్నారు.

ఇక ఈటల మాత్రం ఉద్యమనాయకులను.. కేసీఆర్ ఉద్యమంలో వాడుకొని పదవులు ఇవ్వని నేతలను చేరదీసి వారికి పలు బాధ్యతలను అప్పగించి ముందుకెళుతున్నారు. ఉద్యమనేతలైన స్వామి గౌడ్, విజయశాంతి, మాజీ ఎంపీ వివేక్ లకు అప్పజెప్పనున్నట్లుగా సమాచారం. వీరంతా కేసీఆర్ బాధితులే కావడంతో బలంగా పోరాడుతున్నారు. టీఆర్ఎస్ వ్యూహాలకు చెక్ పెట్టాలని భావిస్తున్నారు.  

రాజకీయ నేతలంతా ఇప్పుడే హుజూరాబాద్ లో మోహరించడంతో ఇప్పుడు రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రజలు రేపు ఉప ఎన్నికల్లో ఎవరిని ఆదరిస్తారన్నది వేచిచూడాలి.
Tags:    

Similar News