కేసీఆర్ మొక్కు ఒకటి తీరింది

Update: 2016-05-03 06:17 GMT
తెలంగాణ రాష్ట్రం కానీ ఏర్పడితే చాలు.. కానుకలు సమర్పించుకుంటానని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ చాలానే మొక్కులు మొక్కిన సంగతి తెలిసిందే. తన పుష్కర ఉద్యమ ప్రస్థానంలో ఆయన మొక్కని దేవుడు లేడనే చెప్పాలి. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా చేయాలన్నది కేసీఆర్ జీవితాశయంగా చెప్పాలి. అంతటి కమిట్ మెంట్ తో పోరాడిన కేసీఆర్ పట్టుదలకు అసాధ్యమనుకున్న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సుసాధ్యం కావటమే కాదు.. ఆయనే తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా అధికారాన్ని చేపట్టటం తెలిసిందే.

ఉద్యమ సమయంలో తాను మొక్కుకున్న వివిధ మొక్కుల్ని ఒక లిస్ట్ గా తయారు చేసుకున్న కేసీఆర్.. ప్రభుత్వ సొమ్ముతో ఒక్కొక్క మొక్కు తీర్చుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే తన మొక్కుకు తగ్గట్లుగా ఆభరణాలు తయారు చేసి తిరుమల శ్రీ వేంకటేశ్వరుడికి పంపటం... వాటిని మీరే స్వయంగా స్వామివారికి అందజేస్తే బాగుంటుందన్న టీటీడీ అధికారుల సూచనతో తిరుమల వస్తానని కేసీఆర్ ప్రకటించటం తెలిసిందే.

ఇలా తాను మొక్కుకున్న మొక్కుల్ని తీర్చుకునే పనిలో ఉన్నకేసీఆర్.. తాజాగా అలాంటి మొక్కు ఒకటి పూర్తి చేశారు. కాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయానికి వెళ్లిన కేసీఆర్.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తాను మొక్కుకున్న మొక్కును తీర్చుకున్నారు. కాళేశ్వర ఆలయంలో శుభానందదేవికి రూ.34 లక్షల వ్యవయంతో బంగారు కిరీటాన్ని కేసీఆర్ దంపతులు సమర్పించారు. దీంతో.. కేసీఆర్ మొక్కుల చిట్టాలో మరో మొక్కు తీరినట్లైంది.
Tags:    

Similar News