హస్తంపై గులాబీ కన్నెర చేస్తుందా!

Update: 2018-12-11 07:14 GMT
జీవితంలో గెలుపోటములు సహజం. రాజకీయాలలో కూడా అంతే. గెలిచినా..ఓడినా 5 సంవత్సరాలే.. 5 సంవత్సరాలు ఎంత సేపు.. ఇట్టే వచ్చేస్తాయి. గెలిస్తే ఇదే పార్టీలో పదవులు అనుభవిద్దాం. లేకపోతే రాత్రికి రాత్రే గోడ దూకి గెలిచిన పార్టీలో చేరిపోదాం... ఇది నేటి రాజకీయ నాయకులు అంతరంగం. కాని తెలంగాణలో పరిస్దితి ఇందుకు భిన్నంగా ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. లోకల్ పార్టీయైన తెలంగాణ రాష్ట్ర సమితి కావచ్చు లేకపోతే కాంగ్రెస్ కావచ్చు... వెంటనే అధికారంలోకి వచ్చి, పదవులు చేపట్టాలన్న కాంక్ష ఇక్కడ నాయకులలో కనిపిస్తోందంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు. వారంతా కూడా తమకు పదవి దక్కడం కోసం ప్రయత్నాలు కంటే కూడా, ప‌క్క వాడికి పదవి దక్కకుండా ఉండడానికే ఎక్కువ ప్రయత్నాలు చేశారు. చేస్తూనే వ‌స్తున్నారు.

తెలంగాణలో జరిగిన ముందస్తు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి రేసులో చాలామందే ఉన్నారు. అయితే వీరిలో ఎంత మంది విజయం సాధిస్తారన్నది ప్రశ్న.  తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీలో  దాదాపు పోటీ చేసిన వారంతా కూడా ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు. ఎవరికి వారు తామే ముఖ్యమంత్రి కావాలనే ఆశతో పార్టీని నిలబెట్టే ప్రయత్నం కంటే వ్యక్తిగత గెలుపుకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటువంటి ప్రయత్నాలే కాంగ్రెస్ ఓటమికి దారి తీశాయని విశ్లేషకులు అంటున్నారు.

కాంగ్రెస్ పార్టీలో లోలోపల రాజకీయాలు వలనే పార్టీ తెలంగాణలో చాలా నష్టపోయిందని చెప్పవచ్చు. సీనియర్ నాయకుడు, మాజీ పీసీసీ అధ్య‌క్షుడు అయిన పొన్నాల లక్ష్మయ్య జనగామ నియోజకవర్గంలో పార్టీ టిక్కెట్టు కోసం హోరాహోరీ పారాడాల్సి వచ్చింది. పార్టీలో కుమ్ములాటాలు తారాస్దాయిలో ఉన్నాయని కొందరు గుసగుసలాడుకుంటున్నారు. రాజకీయాలలో నెగ్గాలంటే ఇటువంటి లోపాయికారి కుమ్ములాటాలు లేకుండా చూసుకోవాలని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇంకొద్ది సేపట్లో గులాబి తన జెండాను తిరిగి తెలంగాణ గడ్డపై ఎగురవేయనుంది. అయితే గతంలో గెలుపు ధీమాతో తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడైన కె. చంద్రశేఖర రావుపై అవాకులు - చవాకులు మాట్లాడిన వారి సంగతి ఏమిటి.... వారందరి భవిష్యత్తు ఎలా ఉండబోతోందో  వేచి చూద్దం !


Tags:    

Similar News