కేసీఆర్.. కాంగ్రెసోళ్లను వదలడం లేదు..

Update: 2019-02-23 04:57 GMT
కేసీఆర్ ఏ ఎత్తుగడ వేసినా దాని వెనుక అర్థం పరమార్థం ఉంటుంది. ఊరికే తాయిలాలు ప్రకటించరూ.. అదే సమయంలో రాజకీయ ప్రయోజనం లేకుండా ఊరికే సీట్లను వదలుకోరు.. ఇప్పుడూ అదే జరిగింది.

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు వేళయ్యింది. ఎమ్మెల్యేల కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ ఎస్ కు ఉన్న సంఖ్యా బలం ప్రకారం నలుగురిని ఎమ్మెల్సీలుగా గెలిపించుకోవచ్చు. కానీ కేసీఆర్ ఐదు సీట్లకు పోటీపెట్టడం ప్రతిపక్ష కాంగ్రెస్ ను కలవరపాటుకు గురిచేస్తోంది.

కేసీఆర్ ఇప్పటికే తమ ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి నలుగురు ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించారు. హోంమంత్రి మహమూద్ అలీ - శేరి సుభాష్ రెడ్డి - సత్యవతి రాథోడ్ - కురుమ సంఘం అధ్యక్షుడు మల్లేషంను టీఆర్ ఎస్ అభ్యర్థులుగా ప్రకటించారు. ఇక బలం లేకున్నా ఐదో సీటును ఎంఐఎంకు ఇస్తున్నట్టు ప్రకటించి రసవత్తర పోరుకు తెరలేపారు.

నిజానికి ఇప్పుడు గెలిచిన 19 మంది కాంగ్రెస్ - ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేల్లో చాలా మంది కేసీఆర్ తో టచ్ లో ఉన్నారట.. కొందరు చేరుదామని వచ్చినా కొన్ని అనివార్య కారణాల వల్ల ఇప్పుడే కేసీఆర్ వద్దన్నాడట.. వారంతా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ ఎస్ అభ్యర్థులకు ఓటేయడం ఖాయం. అందుకే ఎంఐఎంకు ఉన్న ఏడుగురు ఎమ్మెల్యేల మద్దతుతోపాటు కాంగ్రెస్ - టీడీపీ ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టి ఎంఐఎం అభ్యర్థిని గెలిపించేందుకు కేసీఆర్ నడుం బిగించారు.

 ఈ దెబ్బకు ఎన్నికల్లో తమకు సపోర్టు చేసిన ఎంఐఎంకు గిఫ్ట్ గా ఓ సీటును ఇచ్చినట్టు అవుతుంది. అదే సమయంలో ప్రతిపక్ష కాంగ్రెస్ కు సీటు దక్కకుండా శాసనమండలిలో వారికి చోటు లేకుండా చేయొచ్చని కేసీఆర్ ప్లాన్ చేశారు.. కేసీఆర్ వేసిన ఈ ఐదో సీటు ప్లాన్ చూసి ఇప్పుడు కాంగ్రెస్ లో కలవరం మొదలైంది. మనకు ఓటు వేసే వారు ఎవరు.? వేయని వారు ఎవరు.? అసలు పోటీ పెట్టాలా వద్దా అన్న మీమాంసలో కాంగ్రెసోళ్లు కలవరపడుతున్నారట..
Tags:    

Similar News