మళ్లీ తిప్పి పంపించారు.. టీడీపీలో ఏం జరుగుతోంది ..!
టిడిపిలో అసలు ఏం జరుగుతోంది అన్నది ఆసక్తిగా మారింది. జిల్లాలకు సంబంధించి కమిటీలను నియమించాలని సీఎం చంద్రబాబు తరచుగా చెబుతున్నారు.;
టిడిపిలో అసలు ఏం జరుగుతోంది అన్నది ఆసక్తిగా మారింది. జిల్లాలకు సంబంధించి కమిటీలను నియమించాలని సీఎం చంద్రబాబు తరచుగా చెబుతున్నారు. ఇప్పటికి రెండుసార్లు ఆయన సీరియస్ గా ఈ విషయాన్ని పార్టీ నాయకులతో చర్చించారు. జిల్లా స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయాలని ఆరు నెలల కిందటే చంద్రబాబు పార్టీ నాయకులకు సూచించారు. వెంటనే వీటిపై నిర్ణయం తీసుకోవాలని కూడా చెప్పారు. దీంతో తొలివిడత అప్పట్లోనే జాబితాలు సిద్ధమయ్యాయి.
కానీ వీటిపై తీవ్ర స్థాయిల విమర్శలు రావడం.. క్షేత్రస్థాయి నాయకులను పట్టించుకోవడంలేదని వైసీపీకి చెందిన వారిని బుజ్జగిస్తున్నారని వైసీపీ నుంచి వచ్చిన వారికి పదవులు ఇస్తున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ చేసిన చంద్రబాబు ఆ సమయంలో నివేదికను రద్దు చేశారు. ఆ తర్వాత మళ్లీ మూడు నెలల కిందట కొత్తగా కమిటీల్లో నియమించేందుకు పేర్లను సిఫార్సు చేయాలని కమిటీలను తానే నిర్ణయిస్తారని చంద్రబాబు చెప్పారు.
దీంతో మరోసారి నివేదిక ఇటీవల పార్టీ కార్యాలయానికి అందింది. ఇటీవల రెండు రోజుల కిందట సీఎం చంద్రబాబు పార్టీ కార్యాలయానికి వెళ్లినప్పుడు సదరు నివేదికను తీసుకున్నారు. అయితే, దీనిలో కూడా అవకతవకలు చోటుచేసుకున్నాయని గుర్తించారు. ఈ నేపథ్యంలో మరోసారి చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఎప్పటికప్పుడు అన్ని విషయాలను చర్చించాలంటే కుదరదని నాయకులు శ్రద్ధ తీసుకోవాలని చెప్పారు. ముఖ్యంగా ఎమ్మెల్యేల వ్యవహారం పై ఆయన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
తమకు అనుకూలంగా ఉన్న వారిని మాత్రమే జాబితాలో చేర్చడంపై అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణాజిల్లా, అనంతపురం అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలో కూడా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని జిల్లా కమిటీల్లో బాధ్యులను చేసేలాగా కొందరు ఎమ్మెల్యేలు పేర్లను సిఫార్సు చేయడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తాజాగా మరోసారి రెండో నివేదికను కూడా పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు పంపారు. ఈసారి మరింత పారదర్శకంగా ఉండేలా జిల్లా కమిటీలను నిర్ణయించాలని ఈ సారి తేడా వస్తే తానే స్వయంగా రంగంలోకి దిగాల్సి ఉంటుందని కూడా చంద్రబాబు హెచ్చరించారు.
మొత్తానికి ఈ పరిణామం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికి రెండుసార్లు నివేదికలు తిప్పి పంపడం చంద్రబాబు ఆగ్రహించటం నేపథ్యంలో ఇప్పటికైనా నాయకులు మారతారా అనేది చూడాలి. పార్టీలో ఆది నుంచి పనిచేస్తున్న వారు గత ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రాధాన్యం ఇస్తారా లేదా అనేది చూడాలి. ఏదేమైనా జిల్లా స్థాయి కమిటీలను త్వరగా నిర్ణయించడం ద్వారా వచ్చే పంచాయతీ ఎన్నికల్లో పార్టీ పుంజుకునేలా చేయాలన్నది చంద్రబాబు వ్యూహంగా ఉంది.