జ‌గ‌న్ పాద‌యాత్ర‌పై స‌స్పెన్స్‌.. స్ట్రాంగ్ రీజ‌న్ ఇదే.. !

వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర చేసేందుకు సిద్ధమవుతున్నారన్న వార్తలు తరచుగా వినిపిస్తున్నాయి. గతంలోనే ఆయన 2019 ఎన్నికలకు ముందు 3000 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేశారు;

Update: 2025-12-11 11:30 GMT

వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర చేసేందుకు సిద్ధమవుతున్నారన్న వార్తలు తరచుగా వినిపిస్తున్నాయి. గతంలోనే ఆయన 2019 ఎన్నికలకు ముందు 3000 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేశారు. ఆ సమయం లో అనేక హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చారు. ఇక ఇప్పుడు కూడా అదే పంథాను అనుసరిస్తారని ఖచ్చితంగా పాదయాత్రకు సిద్ధమవుతారని వైసిపి అనుకూల మీడియా సహా వైసిపి నాయకుల్లోను పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే అంతర్గత సంభాషణలో మాత్రం దీనిపై తీవ్రస్థాయిలో మరో వాదన వినిపిస్తోంది.

ప్రస్తుతం జగన్ అంత‌ సుదీర్ఘ పాదయాత్ర చేసే అవకాశం లేదని కీలక నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి ఆరోగ్య స‌మ‌స్య‌లేన‌ని అంటున్నారు. అప్పట్లో కూడా ఆయనకు ఆరోగ్యం సహకరించలేదన్న విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ఇది వాస్తవమే. గతంలో పాదయాత్ర చేసినప్పుడు ఒకటికి రెండు రోజులపాటు విశ్రాంతి తీసుకున్న సందర్భం తెలిసిందే. అప్పట్లో డాక్టర్ గురుమూర్తి (ప్రస్తుత తిరుపతి ఎంపీ) ఆయనకు వైద్యం చేశారు. అదేవిధంగా డాక్టర్ ఐ.వి రావు కూడా జగన్‌కు అప్పట్లో వైద్యస‌హ‌కారం అందించారు.

తొలిసారి పాదయాత్ర చేసినప్పుడే పలు కాంప్లికేషన్స్ ఎదుర్కొన్న జగన్ ఇప్పుడు అంత సుదీర్ఘ పాదయా త్ర చేయగలరా అనేది ప్రశ్న. ఇదే ఇప్పుడు వైసీపీలోనూ చర్చనీయాంశంగా మారింది. అధికారంలో ఉన్నప్పుడు జరిగిన కొన్ని సంఘటనలను నాయకులు గుర్తు చేస్తున్నారు. ఒక శంకుస్థాపన సమయంలో జగన్ కిందకు వంగి కొబ్బరికాయ కొట్టడానికి కూడా ఇబ్బంది పడ్డారు. దీంతో నిలబడే ఆయన కొబ్బరికాయ కొట్టారు. అదే విధంగా ఒక సందర్భంలో వంగి నిర్వహించాల్సిన కార్యక్రమాన్ని కూడా నిలబడే ఆయన పూర్తి చేశారు.

సో దీన్నిబట్టి ఆయన ఆరోగ్యం ముఖ్యంగా కండరాల పరిస్థితి పాదయాత్రకు సహకరించక పోవచ్చ‌న్నది వైసిపిలో అంతర్గతంగా వినిపిస్తున్న చర్చ. ఏదేమైనా పాదయాత్ర చేయాలన్న విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని కూడా తెలుస్తోంది. ఇది కేవలం రాజకీయ వాదాన్ని, అదేవిధంగా ప్రజల్లో ఒక ఇమేజ్‌ను పెంచేందుకు జరుగుతున్న చర్చగా మరికొందరు చెబుతున్నారు. పాదయాత్ర పై ఇంకా నిర్ణయం తీసుకోలేదని గుంటూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మీడియాకు వెల్లడించారు.

అంతేకాదు ఇప్పుడు పాదయాత్ర చేయాల్సిన అవసరం కూడా జగన్‌కు లేదని ఆయన చెప్పడం ఆరోగ్య సమస్యలకు సంబంధించా.. లేకపోతే రాజకీయ వర్గాలకు సంబంధించిన అనేది సందేహంగా మారింది. ఏదేమైనా జగన్ పాదయాత్ర పై స్పష్టమైన వైఖరి అయితే ఇంకా పార్టీలో కనిపించడం లేదు. ప్రస్తుతం ఇది ప్రచారానికి మాత్రమే పరిమితమైంది.

Tags:    

Similar News