పాయింట్లొద్దు... డాన్బాస్ కథ తేల్చు...జెలెన్ స్కీకి పుతిన్ అల్టిమేటం...
రష్యా ఉక్రెయిన్ మధ్యయుద్ధం ముగిసిందా? కొనసాగుతోందా? ట్రంప్ పెద్దరికం పలించిందా? పుతిన్ ఆగ్రహం చల్లబడిందా? జెలెన్ స్కీ బెట్టు సడలిస్తున్నారా? ఇవన్నీ ఇప్పటికీ తేలని ప్రశ్నలే.;
రష్యా ఉక్రెయిన్ మధ్యయుద్ధం ముగిసిందా? కొనసాగుతోందా? ట్రంప్ పెద్దరికం పలించిందా? పుతిన్ ఆగ్రహం చల్లబడిందా? జెలెన్ స్కీ బెట్టు సడలిస్తున్నారా? ఇవన్నీ ఇప్పటికీ తేలని ప్రశ్నలే. ఒకవైపు శాంతి సందేశాలు జెలన్ స్కీ పంపిస్తున్నా...రష్యాధ్యక్షుడు పుతిన్ ఆగట్లేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కై 20 పాయింట్స్ ప్రోగ్రామ్ అంటూ కొత్త పాట అందుకున్నారు. అమెరికా అధ్యక్షుడు చెప్పినట్లు తాను ఎన్నికలకు పోవడానికి సిద్ధమే కానీ ఉక్రెయిన్, దాని మిత్ర యూరోపియన్ దేశాలు రూపొందించిన 20 పాయింట్లను అంగీకరించాలని అంటున్నారు. ఈ చర్చ కొనసాగుతుండగానే రష్యా అధ్యక్షుడు పుతిన్ మరోసారి పాయింట్లు పక్కన పెట్టవోయ్...ముందు డాన్బాస్ కథ తేల్చు. అది ఎప్పటికీ రష్యా భూభాగమే. అది చారిత్రక సత్యం. దాన్ని వదులుకునే ప్రసక్తే లేదని బాంబు పేల్చారు.
ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ భేటీ అయ్యాక, వారి అలయెన్స్ అంగీకరించాక, ఈ 20 పాయింట్ల ప్రస్తావన తెరపైకి తెచ్చారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తోనూ ఇటలీతో అలయెన్స్ గురించి ప్రస్తావించారు. అయితే ఈ సమయంలోనే రష్యాఅధ్యక్షుడు పుతిన్ విరుచుకుపడటంతో కథ మళ్ళీ మొదటికొచ్చిందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. జలెన్ స్కీ మీడియాతో మాట్లాడుతూ...పొలిటికో మీడియాకు ట్రంప్ ఇచ్చిన ఇంటర్వ్యూ సారాంశాన్ని వివరించారు. ఆ ఇంటర్వ్యూలో ట్రంప్ తనపై ఆరోపణలతో ఎలా దండెత్తారో తెలిపారు. కేవలం ఎన్నికల్ని వాయిదా వేసుకోడానికే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ యుద్ధాన్ని సాకుగా చూపుతున్నారు. కానీ ఆ దేశ ప్రజలకు మాత్రం ఎన్నికలు ఉండాలని బలంగా కోరుకుంటున్నాను. జెలన్ స్కీని ఎన్నుకుంటారేమో తెలీదు. కానీ చాలా ఏళ్ళుగా ఆ దేశంలో ఎన్నికలే జరగలేదు. ఇది ప్రజాస్వామ్య భావనకు ప్రమాదకారి అని ట్రంప్ వ్యాఖ్యానించిన విషయంపై జెలెన్ స్కీ ఇటలీ ప్రధానితో భేటీ అయ్యాక స్పందించారు. ఇటలీ దేశం మాకు అండగా నిలుస్తోంది. ఆ దేశ మద్ధతుపైనే మేం ఆధారపడుతున్నాం. ఇది ఉక్రెయిన్ కు చాలా ప్రధానం అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు.
అనంతరం జెలెన్ స్కీ రష్యాతో శాంతి ఒప్పందం కుదుర్చుకోడానికి 20 పాయింట్లను సిద్ధం చేసినట్లు మొట్ట మొదటి సారి వివరించారు. ఈ పాయింట్లు ఉక్రెయిన్ యూరోపియన్ రెండూ కలిసి తయారు చేసినట్లు వివరించారు. వెంటనే ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు తెలిపినట్లు జెలెన్ స్కీ వివరించారు. యూరోపియన్ మిత్ర దేశాలతో కలిసి యుద్దం ముగించేందుకు అన్ని మార్గాల్లో సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు జెలెన్ స్కీ చెప్పారు.
అయితే రష్యాన్ అధ్యక్షుడు పుతిన్ ఈ విషయంగా చాలా ఘాటుగా స్పందించారు. మానవహక్కుల కౌన్సిల్ సమావేశంలో డాన్బాస్ ఎప్పటికీ రష్యాభూభాగమే అని ఇది చారిత్రక సత్యమని కరాఖండిగా ప్రకటించారు. ఈ భూభాగ సాధనకు సైనిక చర్యలకు కూడా వెనకాడబోమంటూ స్పష్టం చేశారు. ఈ సమస్యను అర్థవంతంగా ముగించేందుకు ప్రయత్నిస్తున్నాం. మేం అనుకున్న లక్ష్య సాధనకు మిలటరీ ఆపరేషన్ చేపడతాం అని పుతిన్ తెలిపారు.
డాన్బాస్ కోసం అంత భీకరంగా యుద్ధం జరగాల్సిన అవసరం లేనేలేదని పుతిన్ అభిప్రాయం. అక్కడి ప్రజలు ఉక్రెయిన్ తో ఉండాలని కోరుకోవట్లేదు. వారు రష్యాతోనే ఉండాలనుకుంటున్నారు. ఈ మేరకు ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొన్నారు. స్వంత్రం కావాలని ఓటు వేశారు. అందుకే అక్కడ్నుంచి సైనికుల్ని వెనక్కు తీసుకెళ్ళాలని రష్యా కోరుకుంటోంది. కానీ ఉక్రెయిన్ అలా చేయట్లేదు కాబట్టే యుద్ధం ఆగట్లేదని పుతిన్ స్పష్టం చేస్తున్నారు.
మొత్తానికి రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి అంత సులువు కాదని తెలుస్తోంది. ఒకవైపు రష్యా డాన్బాస్ ప్రాంతాన్ని వదులుకోవల్సిందిగా ఉక్రెయిన్ ను హెచ్చరిస్తోంది. మరోవైపు ఉక్రెయిన్ మిత్రులు యూరోప్ దేశాలు రష్యాపై యుద్ధానికే ఉక్రెయిన్ ను ఎగదోస్తున్నాయి. ఏం చేస్తారో నాకు తెలీదు ఉక్రెయిన్ లో ఎన్నికలు జరగాలంతే...యుద్ధం ఆగాలంతే అని అమెరికా పెద్దన్న ట్రంప్ పట్టుబడుతున్నారు. కనీసం జెలెన్ స్కీ ప్రతిపాదిస్తున్న 20 పాయింట్లన్నా శాంతిస్థాపనకు పనికి వస్తాయా అంటే అదీ ప్రశ్నార్థకమే అవుతోంది.