విశాఖకు 9 ఐటీ సంస్థలు.. రేపు చరిత్రలో నిలిచిపోయేలా కార్యక్రమాలు!
విశాఖ ఐటీ హబ్ లో శుక్రవారం సరికొత్త చరిత్ర మొదలుకానుంది. ఐటీ సెక్టార్ కు మరింత జోష్ వచ్చేలా ప్రపంచ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్ తోపాటు మరో 8 సంస్థలకు శంకుస్థాపనలు జరగనున్నాయి.;
విశాఖ ఐటీ హబ్ లో శుక్రవారం సరికొత్త చరిత్ర మొదలుకానుంది. ఐటీ సెక్టార్ కు మరింత జోష్ వచ్చేలా ప్రపంచ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్ తోపాటు మరో 8 సంస్థలకు శంకుస్థాపనలు జరగనున్నాయి. ఇక కాగ్నిజెంట్ తాత్కాలిక కార్యాలయం కూడా శుక్రవారమే ప్రారంభం అవుతోంది. టీసీఎస్ కంటే ముందుగానే కాగ్నిజెంట్ ముందుగా సేవలు ప్రారంభించడం ఆసక్తి రేపుతోంది. విశాఖలో సర్వీసు సెంటర్ ప్రారంభానికి టీసీఎస్ తొలుత ఉత్సాహంగా ముందుకువచ్చింది. తాత్కాలిక కార్యాలయం ఎంపిక చేసుకుని, సేవా కేంద్రం ప్రారంభానికి సిద్ధమైంది. కానీ, అనూహ్యంగా కాగ్నిజెంట్ ముందుకు దూసుకువచ్చి టీసీఎస్ కన్నా ముందుగానే తన సర్వీసు సెంటర్ ను శుక్రవారం ప్రారంభిస్తోంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుక్రవారం విశాఖలో 9 ఐటీ సంస్థల క్యాంపస్ ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి లోకేశ్ నేరుగా విశాఖ చేరుకుంటారు. శుక్రవారం ఉదయాన్నే విశాఖ చేరుకుంటారు. 9.30 నిమషాలకు రుషికొండ ఐటీ పార్కులోని హిల్ నెంబరు-2లో మహతి ఫిన్ టెక్ భవనంలో కాగ్నిజెంట్ తాత్కాలిక కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. ఆ తరువాత హిల్-3లో శ్రీటెక్ సంస్థకు భూమి పూజ చేస్తారు. అక్కడే నాన్ రెల్ టెక్నాలజీస్, ఏసీఎన్ ఇన్ఫోటెక్ సంస్థలకు భూమిపూజ చేయనున్నారు.
ఆ తర్వాత హిల్ నెంబరు 4లో సత్వాస్ వాంటేజ్ వైజాగ్ క్యాంపస్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత కాపులుప్పాడ చేరుకుని ఇమ్మాజినోటివ్, ప్లూయెంట్ గ్రిడ్ ఐటీ కంపెనీలకు శంకుస్థాపన నిర్వహిస్తారు. మదర్ సన్ టెక్నాలజీస్, క్వార్క్స్ టెక్నోసాఫ్ట్ సంస్థల శిలాఫలకాలు ఆవిష్కరిస్తారు. ఇవన్నీ కేవలం గంటర్నలో పూర్తి చేయనున్నారు. ఇక ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబుతో కలిసి కాగ్నిజెంట్ శాశ్వత కార్యాలయ పనుల ప్రారంభ కార్యక్రమంలో మంత్రి లోకేశ్ పాల్గొననున్నారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఐటీ కంపెనీల ప్రతినిధులతో ముచ్చటించనున్నారు.
కాగ్నిజెంట్ కు కాపులుప్పాడలో ప్రభుత్వం 22.19 ఎకరాల భూమిని కేటాయించింది. ఇందులో రూ.1580 కోట్ల రూపాయలతో ఏఐ టెక్నాలజీ సెంటర్ ను కాగ్నిజెంట్ నిర్మించనుంది. మొత్తం 8 వేల మందికి ఉపాధి కల్పించే ఈ సెంటర్ ను మూడేళ్లలో ప్రారంభించాలని కాగ్నిజెంట్ అడుగులు వేస్తోందని అంటున్నారు. ఇక హిల్-2లో శ్రీటెక్ తమ్మిన రెండు వేల మందికి ఉద్యోగాలు ఇవ్వనుంది. అదేవిధంగా సత్వ డెవలపర్స్, వాంటేజ్ వైజాగ్ సంస్థలు మరో 25వేల మందికి ఉపాధి కల్పించేలా కార్యాలయాలను ప్రారంభించనున్నాయి.
మొత్తానికి శుక్రవారం నిర్మాణాలు ప్రారంభించనున్న ఐటీ సంస్థలతో విశాఖకు అదనంగా 50 వేల ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉందంటున్నారు. కాగ్నిజెంట్, టీసీఎస్ వంటి సంస్థలు తక్షణమే తాత్కాలిక భవనాల్లో కార్యాలయాలు ప్రారంభిస్తుండటం వల్ల మిగిలిన సంస్థలు కూడా వేగంగా తమ సేవలు ప్రారంభించాలనే ఉద్దేశంతో ముందుకొస్తున్నాయి. దీంతో పాటు ప్రభుత్వం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో సత్వరమే అనుమతులు మంజూరు చేస్తుండటంతో విశాఖ ఐటీ సెజ్ కు కొత్త పరిశ్రమలు పోటాపోటీగా తరలివస్తున్నాయని అంటున్నారు.