అమెరికాలో కోమాలో భారతీయ యువతి.. అండగా మన కమ్యూనిటీ
డాలర్ల వేటలో.. ఆశల ఉపాధి కోసం అమెరికా వెళ్లిన చాలా మంది కలలు కల్లలుగానే మిగిలిపోతున్నాయి.;
డాలర్ల వేటలో.. ఆశల ఉపాధి కోసం అమెరికా వెళ్లిన చాలా మంది కలలు కల్లలుగానే మిగిలిపోతున్నాయి. ఓవైపు ప్రమాదాలు.. మరోవైపు అమెరికాలో ఆంక్షల వల్ల భారతీయ విద్యార్థులు, ఉద్యోగుల పరిస్థితి ఇప్పుడు అడకత్తెరలో పోకచక్కలా నలిగిపోతోంది. ఎన్నో ఆశలతో వెళ్లిన విద్యార్థులు అక్కడ ప్రమాదాల బారిన పడి అచేతనంగా మారడం కన్నవారికి కడుపుకోతను మిగిల్చేలా చేస్తోంది. అలాంటి విషాదాలు ఎన్నింటికో అమెరికా సాక్ష్యంగా నిలుస్తోంది.
ఈనెల ప్రారంభంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఒక యువ భారతీయ మహిళ ఇంకా కోమాలోనే ఉండడం ఆ తల్లిదండ్రులను విషాదంలోనే ఉంచేలా చేస్తోంది. ఆమె తండ్రి సుమిరన్ సింగ్ స్వదేశానికి దూరంగా ఒంటరిగా వైద్యపరమైన, న్యాయపరమైన సవాళ్లను ఎదుర్కొంటూ కూతురి కోసం వేచిచూస్తున్నారు. అయితే తాజాగా వీరికి స్థానిక కమ్యూనిటీ గ్రూపుల నుంచి అపారమైన మద్దతు లభిస్తోంది.
నవంబర్ 9వ తేదీన ఆర్తిసింగ్ అనే యువతి వృత్తిపరమైన నెట్ వర్కింగ్ ఈవెంట్ నుంచి ఇంటికి తిరిగివస్తుండగా తన ఇంటి దగ్గర రోడ్డు దాటుతుండగా ఒక వాహనం ఢీకొట్టింది. ఆ ప్రమాదం జరిగినప్పటి నుంచి ఆమె అపస్మారక స్థితిలోనే ఉంది. ఆమె ప్రస్తుతం శాంటాక్లారా వ్యాలీ మెడికల్ సెంటర్ లో ఐసీయూలో చికిత్స పొందుతోంది. ఆమె శ్వాస, ఆహారం కోసం డాక్టర్లు మెడకు, పొట్టకు పెద్ద శస్త్రచికిత్సలు నిర్వహించినట్లు మీడియా తెలిపింది. ఆమె పక్కనే నిరంతరం కూర్చుకున్న తండ్రి.. ‘ఆ డ్రైవర్ ఎవరో నాకు తెలియదు.. నాకు ఇక్కడ ఎవరూ తెలియదు.. న్యాయం చేయండి’ అంటూ వేడుకుంటున్న వైనం అందరినీ కన్నీళ్లు తెప్పిస్తోంది. నా కూతురు ఎప్పటికైనా కళ్లు తెరుస్తుందనే ఆశతో ప్రతీరోజు ఆమెతో మాట్లాడుతున్నా.. అంటూ ఆర్తి తండ్రి ఆవేదనతో చెబుతున్నాడు.
స్థానిక పోలీసు డిపార్ట్ మెంట్ మాత్రం ఇది ‘హిట్ అండ్ రన్’ కాదని ధ్రువీకరించింది. అయితే డ్రైవర్ గుర్తింపును మాత్రం పోలీసులు ఇంకా విడుదల చేయలేదు. ఈ ప్రమాదం సమయంలో డ్రైవర్ 50 ఏళ్ల వ్యక్తి అని.. అతడికి బీమా లేదని మాత్రమే తనకు చెప్పారని సుమిరన్ సింగ్ తెలిపారు. పోలీసులు డ్రైవర్ పరిస్థితి.. ఎవరు? అతడిపై ఏం చర్యలు తీసుకున్నారనే విషయాలు బయటపెట్టకపోవడంతో ఈ కుటుంబం తీవ్ర నిరాశలో ఉంది.
ఇక ఇండియానుంచి తండ్రి ఒక్కడే రావడం.. ఈ ఏరియాలో ఎటువంటి బంధువులు, మద్దతు నెట్ వర్క్ లేని సుమిరన్ సింగ్ కు కమ్యూనిటీ అండగా నిలిచింది. ఆయన వైద్య, న్యాయపరమైన, ఆర్థిక ఇబ్బందులను గమనించి పలువురు సాయం చేస్తున్నారు. భాష సమస్య కూడా తండ్రికి ఉండడంతో స్థానికులు సాయం చేస్తున్నారు. ‘మేం ఆయన్ను కలిసినప్పుడు.. ఆయన ఎక్కడ నిద్రపోవాలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. తన కూతురు ప్రాణాల కోసం పోరాడుతుండగా.. ఒక తండ్రి విదేశీ గడ్డపై ఒంటరిగా కష్టపడటాన్ని మనం అనుమతించలేం. ఆర్తిసింగ్, ఆమె తండ్రికి సాధ్యమైనంత మేరకు సహాయం అందించాలని భారత కమ్యూనిటీ పిలుపునిచ్చింది.
ఉత్తర కాలిఫోర్నియాలోని కమ్యూనిటీ గ్రూప్ ‘ఓవర్సీస్ ఆర్గనైజేషన్ ఫర్ బెటర్ బీహార్ (02B2) ఈ ప్రమాదం గురించి తెలుసుకొని సుమిరన్ సింగ్ కు మద్దతుగా రంగంలోకి దిగింది. ఈ కమ్యూనిటీ వాసులు ఆస్పత్రిని సంప్రదించి వసతి, రవాణా, భోజనం, ఇతర ప్రాథమిక అవసరాలను తీర్చడానికి ఒక నిధుల సేకరణ ప్రచారాన్ని ప్రారంభించింది.
అమెరికాలో ప్రమాదాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా కాలిఫోర్నియాలో, పాదచారుల ప్రమాదాలు గణనీయంగా పెరిగాయి. ఇదే ఆందోళన కలిగిస్తోంది.రద్దీగా ఉండే ట్రాఫిక్ కారిడార్లు, పరిమిత క్రాసింగ్ లు మెరుగైన భద్రతా చర్యల కోసం పదే పదే ప్రమాదాలు పెరుగుతుండడడంతో రోడ్డు ప్రమాదాలను నివారించాలని స్థానిక కమ్యూనిటీ కోరుతోంది.