కడుపు చేశాడని చంపేశారు.. శ్రవణ్ సాయి హత్య కేసులో సంచలన ఆరోపణలు!

ఒక యువతిని ప్రేమించినందుకు ఒక ఇంజనీరింగ్ విద్యార్థి దారుణంగా హత్యకు గురయ్యాడు.;

Update: 2025-12-11 10:11 GMT

ఒక యువతిని ప్రేమించినందుకు ఒక ఇంజనీరింగ్ విద్యార్థి దారుణంగా హత్యకు గురయ్యాడు. సంగారెడ్డి అమీన్ పూర్ మండలం, సృజన్ లక్ష్మీనగర్ లో డిసెంబర్ 8వ తేదీ రాత్రి జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. మృతుడు బీటెక్ విద్యార్థి శ్రవణ్ సాయి అలియాస్ శివ (19)ని తాను ప్రేమించిన యువతి తల్లి దారుణంగా బ్యాట్ తో కొట్టి చంపినట్లు వెలుగులోకి వీడియో వచ్చింది.

ఏపీలోని ఉమ్మడి కృష్ణా జిల్లా నందిగామకు చెందిన శ్రవణ్ సాయి హైదరాబాద్ శివారు మైసమ్మగూడలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్నాడు. అదే కాలేజీలో చదువుతున్న తన టెన్త్ క్లాస్ మేట్ శ్రీజతో అతడు కొంతకాలంగా ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడు. ఈ విషయం శ్రీజ కుటుంబ సభ్యులకు తెలియడంతో గతంలోనే వారు ఇద్దరినీ తీవ్రంగా హెచ్చరించినట్లు సమాచారం.

అయినా వారిద్దరిలో మార్పు రాకపోవడంతో శ్రీజ తల్లి సిరి ఏకంగా శ్రవణ్ పై దాడికి ప్లాన్ చేసినట్టు సమాచారం. పథకం ప్రకారం.. శ్రీజ ద్వారా శ్రవణ్ ను ఇంటికి పిలిపించింది. ఇంట్లోకి వచ్చిన తర్వాత శ్రవణ్ తో సిరి ప్రేమ విషయంపై గొడవకు దిగింది. వాగ్వాదం తీవ్రమవడంతో కోపంతో రెచ్చిపోయిన సిరి ఇంట్లో ఉన్న క్రికెట్ బ్యాట్ తో శ్రవణ్ పై విచక్షణారహితంగా దాడి చేసింది.

ఈ దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన కూతురు శ్రీజపైన కూడా సిరి బ్యాట్ తో దాడి చేసింది. ఈ దాడిలో శ్రీజ చేయి విరగగా.. శ్రవణ్ సాయి తల, వీపు భాగంలో బలమైన గాయాలై సృహ కోల్పోయాడు. శ్రవణ్ ను అక్కడే వదిలేసి గాయపడిన కూతురు శ్రీజను తల్లి, శ్రీజ మామ రాత్రికి రాత్రే ఆస్పత్రికి తరలించారు.

మరుసటి రోజు ఉదయం ఇంటికి వచ్చి చూసేసరికి శ్రవణ్ సాయి అపస్మారక స్థితిలోనే ఉండడంతో అతడిని నిజాంపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే శ్రవణ్ మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు.

సంచలన విషయాలు వెలుగులోకి..

సిరి తన భర్తను వదిలేసి పిల్లలతో ఒంటరిగా ఉంటోందని.. హరిప్రసాద్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తోందని తెలిసింది. శ్రవణ్ సాయి పెద్దనాన్న, హరిప్రసాద్ ఆధ్వర్యంలోనే ఈ హత్య జరిగిందని.. రాత్రంతా శ్రవణ్ ను హింసించారని.. తలపై బ్యాట్ తో బలంగా కొట్టడంతోనే చనిపోయాడని చెబుతున్నారు.

ఇక శ్రవణ్, శ్రీజ ఒకరోజు ఇంటి నుంచి వెళ్లిపోయి రాత్రంతా పార్కులోనే గడిపారని.. ఆ సమయంలో వారి మద్య శారీరక సంబంధం కలిగి శ్రీజ గర్భవతి అయినట్టుగా మీడియాలో ప్రచారం సాగుతోంది. ఇందులో నిజానిజాలు ఏమిటో తెలియాల్సి ఉంది. శ్రీజ తాను మాత్రం శ్రావణ్ ను మాత్రమే పెళ్లి చేసుకుంటానని పట్టుబడడంతోనే ఈ దాడి జరిగినట్టు తెలిసింది.

నిందితురాలి వివరణ

శ్రవణ్ హత్య తర్వాత నిందితురాలు సిరి మీడియాతో మాట్లాడింది. ‘శ్రవణ్ ను నేను చూడడం ఇదే రెండోసారి మాత్రమే.. నేను అతన్ని ఇంటికి పిలిపించాను. ఏడు నెలల క్రితం వాడు నా కూతురు కాలేజీ దగ్గరకు వచ్చాడు. ఆరోజు నా కూతురు తెల్లవారుజామున వరకూ 4.30 గంటల వరకూ ఇంటికి రాలేదు. దాంతో నేను మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాను. తర్వాత శ్రవణ్ పెదనాన్న ను పిలిచి వార్నింగ్ ఇచ్చాం. వాడు ‘నేను పెద్ద క్యాస్ట్ ’ అని పదేపదే అన్నాడు. వాడి క్యాస్ట్ తో నాకేం సంబంధం..? డబ్బుంటే వాడి దగ్గరే పెట్టుకోమను.. నాకేం ఇవ్వరు కదా.. నా కూతురు తో కలవకుండా ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది? గండి మైసమ్మ దగ్గర పార్కులో ఆ పనిచేస్తారా? రాత్రి 11 గంటలు దాటినా నా కూతురుతో కలిసి గల్లీల్లో తిరిగేవాడు. ప్రాబ్లం నా కూతురు కాబట్టే నా కూతురిని కొట్టాల్సి వచ్చింది’ అంటూ మీడియాతో వీడియోలో పంచుకుంది.

పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. సిరి ఒక్కతే కాకుండా ఆమె ప్రియుడు హరిప్రసాద్ పాత్ర కూడా ఉందని ఆరోపణలు వస్తున్నాయి. శ్రవణ్ ను ఒక పథకం ప్రకారమే ఇంటికి పిలిచి హత్య చేసినట్టుగా ఘటనను బట్టి స్పష్టమవుతోందని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ కేసు అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దర్యాప్తులో ఉంది.

Tags:    

Similar News