5 గంటల విచారణలో 38 ప్రశ్నలు.. వైసీపీ ఎమ్మెల్సీ సతీమణి

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు.. జాతీయ స్థాయిలో సంచలనంగా మారిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు విషయంలో తాజాగా విచారణను ఎదుర్కొన్నారు వైసీపీ ఎమ్మెల్సీ సతీమణి లక్ష్మీదుర్గ.;

Update: 2026-03-18 03:58 GMT

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు.. జాతీయ స్థాయిలో సంచలనంగా మారిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు విషయంలో తాజాగా విచారణను ఎదుర్కొన్నారు వైసీపీ ఎమ్మెల్సీ సతీమణి లక్ష్మీదుర్గ. ఈ హత్యకేసును విచారిస్తున్న సిట్ అధికారుల నోటీసుతో విచారణకు ఆమె హాజరయ్యారు. మంగళవారం ఉదయం 10.20 గంటలకు మొదలైన విచారణ దాదాపు 5 గంటల పాటు సాగింది. మొత్తం 38 ప్రశ్నలు సంధించగా.. అందులో అత్యధిక ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేదని తెలిసింది.

విచారణ సందర్భంగా ఆమె ఎదుర్కొన్న ప్రశ్నల్ని చూస్తే..

- మీ దగ్గర డ్రైవర్ గా పని చేసి మానేసిన సుబ్రహ్మణ్యం హత్యకు ముందు.. ఆ తర్వాత మీద భర్త అనంతబాబు ప్రవర్తన ఎలా ఉంది?

- ఆ రోజు హత్య జరిగిన డంపింగ్ యార్డుకు మీ భర్తతో కలిసే వెళ్లారా?

- ఆ రాత్రి కారులో ఎవరెవరు తిరిగారు?

- ఆ కారు ఎవరిది?

- మీరు వాడుతున్న సిమ్ కార్డు మీ పేరు మీద ఎందుకు లేదు?

- హత్య జరిగినప్పుడు మీ తమ్ముడ్ని చూసేందుకు ఆసుపత్రికి వెళ్లారని చెప్పారు కదా? ఆ రోజు అక్కడ మీతో పాటు ఎవరు ఉన్నారో చెబుతారా?

ఈ తరహాలో పలు ప్రశ్నలు అడిగినా.. మౌనంతో ఉండటం లేదా ముక్తసరిగా సమాధానం చెప్పినట్లుగా తెలుస్తోంది. చాలా ప్రశ్నలకు తెలీదు.. గుర్తు లేదు.. అంటూ ఆమె తన సమాధానాల్ని సరిపెట్టినట్లుగా చెబుతున్నారు. హత్య జరిగిన సమయంలో తాను అక్కడ లేనన్న విషయాన్ని స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తోంది. డ్రైవర్ హత్య జరిగిన సమయంలో లక్ష్మీ దుర్గ అక్కడే ఉన్నట్లుగా పోలీసులు పూర్తి ఆధారాలతో అనుబంధ చార్జిషీట్ దాఖలు చేయటంతో ఆమెను ఏ2గా చేర్చారు. ఈ సందర్భంగా ఆమె కొన్ని రోజులు అండర్ గ్రౌండ్ లోకి వెళ్లారు.

సిట్ అధికారుల విచారణలో భాగంగా అండర్ గ్రౌండ్ కు వెళ్లిన అంశాన్ని ప్రస్తావిస్తూ.. ఎక్కడకు వెళ్లారు? ఎందుకు వెళ్లారు? ఎవరు ఆమెతో ఉన్నారు? లాంటి ప్రశ్నలకు సమాధానాల్ని ముక్తసరిగా చెప్పినట్లు తెలిసింది. గడిచిన రెండురోజులుగా విచారణకు హాజరవుతున్న సందర్భంగా ఆమె అనుచరులు అవసరానికి మించి హడావుడి చేసినట్లుగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆమె విచారణకు వచ్చే వేళలోనూ.. తిరిగి వెళ్లే వేళలోనూ కుటుంబ సభ్యులు.. అనుచరుల హడావుడి ఒక రేంజ్ లో ఉన్నట్లుగా చెబుతున్నారు.

కారులో ఆమె వచ్చినట్లుగా క్రియేట్ చేసి.. అందుకు భిన్నంగా స్కూటీ మీద తీసుకొచ్చి.. తీసుకెళ్లటం గమనార్హం. ఆమె బంధువులు ఆమెను స్కూటీ మీద తీసుకెళ్లినట్లుగా ప్రత్యక్ష సాక్ష్యుల చెబుతున్నారు. విచారణ జరుగుతున్న సమయంలో ఎవరు వస్తున్నారు? ఎవరెవరు అక్కడ ఉన్నారు? లాంటి అంశాల మీద వైసీపీ ఎమ్మెల్సీ అనుచరులతో పాటు.. కాకినాడ వైసీపీ నేత.. మాజీ ఎమ్మెల్యే అనుచరులు కూడా కాపలా కాసినట్లుగా తెలుస్తోంది.

Tags:    

Similar News