అవంతి ఆ పార్టీలోకి జంప్ ?
విశాఖ జిల్లాకు చెందిన కీలక నేత మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ మీద మరోసారి చర్చ సాగుతోంది. ఆయన 2024 డిసెంబర్ లో వైసీపీకి రాజీనామా చేసి బయటకు వచ్చారు.
విశాఖ జిల్లాకు చెందిన కీలక నేత మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ మీద మరోసారి చర్చ సాగుతోంది. ఆయన 2024 డిసెంబర్ లో వైసీపీకి రాజీనామా చేసి బయటకు వచ్చారు. నాటి నుంచి ఏ రాజకీయ పార్టీలో చేరకుండా న్యూట్రల్ గా ఉంటున్నారు. ఆయన టీడీపీలో చేరుతారు అని జనసేనలోకి వెళ్తారు అని ప్రచారం గతంలో సాగింది. అయితే అవేమీ జరగలేదు. అంతే కాదు తన విద్యా సంస్థల గురించి మాత్రమే చూసుకుంటూ రాజకీయ ఊసు లేకుండా దాదాపుగా ఏణ్ణర్ధం కాలం నెట్టుకుని వచ్చారు అవంతి. ఇపుడు ఆయన గురించి చర్చ ఎందుకు అంటే లేటెస్ట్ గా జనసేన జాయింగ్స్ కమిటీని ఒకదానిని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో పద్నాలుగు మంది మెంబర్స్ గా సీనియర్ నేతలను నియమించారు. వీరు వివిధ జిల్లాల నుంచి ఉన్నారు. వీరంతా తమ జిల్లాలలో ఇతర పార్టీల నుంచి నేతలను ఆకట్టుకుని జనసేనలో చేర్పించడం చేయాల్సి ఉంది అని అంటున్నారు.
గతంలో వద్దు అన్నా :
ఇక్కడ మరో విషయం కూడా ఉంది. గతంలో జనసేనలోకి వస్తామని చాలా మంది నేతలు రాయబారాలు నడిపినా వద్దు అని గట్టిగా తిరస్కరించారు. అయితే ఇపుడు జనసేన ఏరి కోరి జాయినింగ్స్ కమిటీని వేసింది. దాంతో ఇపుడు జనసేన గేట్లు ఓపెన్ చేసింది అని అంటున్నారు. మరి పార్టీయే పిలుస్తూంటే చేరేందుకు ఆసక్తి ఉన్న నేతలు ఎందుకు వద్దు అనుకుంటారు. అలా చూస్తే వివాదాలు పెద్దగా లేని నాయకుడిగా మాజీ మంత్రిగా మాజీ ఎంపీగా బలమైన కాపు సామాజిక వర్గం నాయకుడిగా అవంతి శ్రీనివాస్ ఉన్నారు అని గుర్తు చేసుకుంటున్నారు. పైగా అంగబలం అర్థ బలం కలిగిన నేత కావడం మాజీ ప్రజారాజ్యం ఎమ్మెల్యే కూడా కావడం ప్లస్ పాయింట్లుగా చూస్తున్నారు.
సీట్లు పెరుగుతున్న నేపధ్యంలో :
మరో వైపు చూస్తే ఏపీలో అసెంబ్లీ సీట్లు 2029 నాటికి పెరుగుతాయని అంటున్నారు. దాంతో అతి పెద్ద నియోజకవర్గం భీమిలీ రెండుగా మారుతుందని అంటున్నారు. భీమిలీ నుంచి ఇప్పటికి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అవంతి మరోసారి అక్కడ నుంచే పోటీ చేయాలని అనుకుంటున్నారు. సీట్లు పెరిగితే భీమిలీ మధురవాడ అని రెండు సీట్లు ఏర్పడతాయి. వీటిలో దేనిలో అయినా తనకు సీటు తప్పకుండా వస్తుందని ఆయన భావిస్తున్నారు. సరైన పార్టీని ఎంచుకుంటే విజయం ఖాయమని కూడా లెక్క వేసుకుంటున్నారు.
చేరిక ఖాయమా :
ఇవన్నీ చూసుకున్నపుడు అవంతి శ్రీనివాస్ విశాఖ జిల్లా నుంచి జనసేనలో జాయింగ్ ఖాయమని అంటున్నారు. ఆయన వైసీపీలోకి వెళ్లరని టీడీపీని చూసి వచ్చారని దాంతో జనసేన ఆప్షన్ గా ఎంచుకుంటున్నారు అని అంటున్నారు. పైగా తన వారసుల ఫ్యూచర్ ని కూడా దృష్టిలో పెట్టుకుని ఆయన జనసేనలో చేరాలని భావిస్తున్నారు అని కూడా అంటున్నారు. మరి జాయినింగ్స్ కమిటీ పని మొదలెడితే విశాఖ జిల్లా నుంచి మొదటి జంప్ అవంతిదే అవుతుందని కూడా ప్రచారం సాగుతోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.