శత్రుత్వం పాకిస్తాన్ వ్యవస్థలతోనే.. ప్రజలతో కాదు.. మానవత్వాన్ని చాటిన భారత సైన్యం
సరిహద్దుల పొడవునా ముళ్లకంపలు ఉండొచ్చు, ఇరు దేశాల మధ్య తుపాకులు గర్జిస్తూ ఉండొచ్చు.. కానీ మానవత్వానికి ఏ సరిహద్దులూ ఉండవని భారత సైన్యం మరోసారి నిరూపించింది.
సరిహద్దుల పొడవునా ముళ్లకంపలు ఉండొచ్చు, ఇరు దేశాల మధ్య తుపాకులు గర్జిస్తూ ఉండొచ్చు.. కానీ మానవత్వానికి ఏ సరిహద్దులూ ఉండవని భారత సైన్యం మరోసారి నిరూపించింది. కళ్ళల్లో ప్రాణభయం, గుండెల్లో వణుకుతో పొరపాటున దారి తప్పి భారత భూభాగంలోకి అడుగుపెట్టిన ఒక పాకిస్థానీ పౌరుడిని శత్రువులా కాకుండా కన్నబిడ్డలా చేరదీసి.. అతడికి రక్షణ కల్పించి, తిరిగి సురక్షితంగా మాతృదేశానికి అప్పగించిన వేళ నియంత్రణ రేఖ సాక్షిగా ఒక అద్భుతం ఆవిష్కృతమైంది. ఉద్రిక్తతల నిప్పుకణికల మధ్య ఇరు దేశాల సైనికాధికారులు పంచుకున్న ఆ ఒక్క 'షేక్‌హ్యాండ్'.. యుద్ధాలు ప్రభుత్వాల మధ్యే కానీ అమాయక ప్రజల మధ్య కాదనే నిజాన్ని ప్రపంచానికి చాటిచెబుతూ ప్రతి ఒక్కరి గుండెలను పిండేసింది
భారత్–పాకిస్థాన్ సంబంధాలు అంటే సాధారణంగా అందరికీ గుర్తొచ్చేవి ఉద్రిక్తతలు.. కాల్పుల విరమణ ఉల్లంఘనలు.. సరిహద్దు వివాదాలు.. ఉగ్రవాదం. ముఖ్యంగా ఇటీవల జరిగిన 'ఆపరేషన్ సిందూర్' అనంతరం ఇరు దేశాల మధ్య పరిస్థితులు మరింత సున్నితంగా ఉద్రిక్తంగా మారాయి. ఇలాంటి అత్యంత ఉత్కంఠభరిత వాతావరణంలో నియంత్రణ రేఖ వద్ద చోటుచేసుకున్న ఒక అపూర్వ సంఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. భారత, పాకిస్థాన్ సైన్యాధికారులు పరస్పరం షేక్‌హ్యాండ్ చేసుకోవడం అక్కడున్న వారినే కాకుండా ఈ దృశ్యాన్ని చూసిన ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
మానవత్వాన్ని చాటిన భారత సైన్యం
ఈ అరుదైన కరచాలనం వెనుక ఉన్న నేపథ్యం అత్యంత ఆసక్తికరమైనది.. అలాగే మానవీయమైనది. కొద్దిరోజుల క్రితం పొరపాటున సరిహద్దు దాటి జమ్మూ-కాశ్మీర్‌లోని భారత భూభాగంలోకి ప్రవేశించిన పాకిస్థాన్ పౌరుడు అసద్ ను భారత భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. సాధారణంగా ఇలాంటి సమయాల్లో అనుమానాలు, కఠిన విచారణలు సహజం. కానీ భారత సైన్యం అతడిని శత్రువుగా చూడలేదు. ఒక సాధారణ పౌరుడిగా పరిగణిస్తూ పూర్తి మానవతా దృక్పథంతో వ్యవహరించింది. అతనికి అవసరమైన వైద్య, ఆహార సదుపాయాలను అందించి చట్టపరమైన విచారణను పూర్తి చేసింది. అసద్ అమాయకుడని తేలడంతో అధికారిక ప్రక్రియల ప్రకారం నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్ అధికారులకు సురక్షితంగా అప్పగించింది. ఈ సందర్భంలోనే ఇరు దేశాల సైనికాధికారులు పరస్పరం కరచాలనం చేసుకున్నారు.
యుద్ధం వ్యవస్థలపై.. అమాయకులపై కాదు..
ఈ ఘటన భారత సైన్యం అనుసరిస్తున్న ఉన్నతమైన విలువలను, సంస్కృతిని మరోసారి ప్రపంచ వేదికపై చాటిచెప్పింది. భారతదేశం ఎప్పుడూ ఉగ్రవాదాన్ని దానికి మద్దతు ఇచ్చే వ్యవస్థలను మాత్రమే వ్యతిరేకిస్తుందని.. అమాయక ప్రజలను కాదనే బలమైన సందేశాన్ని ఈ ఘటన ఇచ్చింది.
రాజీపడని భద్రత.. వీడని మానవత్వం
దేశ భద్రత విషయంలో అంగుళం కూడా రాజీ పడకుండానే, అవసరమైన చోట మానవత్వానికి అగ్రతాంబూలం ఇవ్వడం భారత సైన్యానికి మాత్రమే సాధ్యమైన ప్రత్యేకత. "యుద్ధ వాతావరణం, రాజకీయ విభేదాలు ఎన్ని ఉన్నప్పటికీ.. అంతర్జాతీయ నిబంధనలు, మానవతా విలువలకు భారత సైన్యం ఎప్పుడూ కట్టుబడి ఉంటుంది." అని ఈ ఘటన నిరూపించింది.
అంతర్జాతీయంగా భారత్ మార్క్ గౌరవం
అంతర్జాతీయ సరిహద్దుల వద్ద ముఖ్యంగా భారత్-పాక్ మధ్య ఇలాంటి సానుకూల దృశ్యాలు చాలా అరుదు. గతంలో కూడా పొరపాటున సరిహద్దులు దాటి వచ్చిన మహిళలు, పిల్లలు, వృద్ధులను భారత్ గౌరవప్రదంగా వారి దేశాలకు అప్పగించిన ఉదాహరణలు అనేకం ఉన్నాయి. ఇది ప్రతీకార రాజకీయాల కంటే అంతర్జాతీయ మానవతా సూత్రాలకు భారతదేశం ఇచ్చే గౌరవానికి నిదర్శనం.
సరిహద్దుల్లో తుపాకులు గర్జిస్తున్న వేళ ఈ ఒక్క కరచాలనం ఒక నిశ్శబ్ద విప్లవంలాంటి పెద్ద సందేశాన్ని ఇచ్చింది. దేశ రక్షణలో ఎంత కఠినంగా ఉంటామో.. మానవత్వం చూపించడంలో అంతే ఉదారంగా ఉంటామని భారత సైన్యం నిరూపించింది. విభేదాలు ప్రభుత్వాల మధ్య వ్యూహాలు సైన్యాల మధ్య ఉండొచ్చు.. కానీ అమాయక ప్రజల పట్ల గౌరవం ఎప్పటికీ కోల్పోకూడదనే విలువను ఈ అరుదైన ఘటన ప్రపంచానికి గుర్తు చేసింది.