ఓటు రూ.20 వేలు.. రాష్ట్ర ఎన్నికల్లో రికార్డ్...
ఓటుకు రూ.20వేలు...నిజం మీరు వింటున్నది నిజం. ఇదేదో ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికలనుకునేరు కానేకాదు. పంచాయతీ ఎన్నికల్లో ఓ పల్లెలో ఓటుకు పలికిన రికార్డు ధర ఇది.;
ఓటుకు రూ.20వేలు...నిజం మీరు వింటున్నది నిజం. ఇదేదో ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికలనుకునేరు కానేకాదు. పంచాయతీ ఎన్నికల్లో ఓ పల్లెలో ఓటుకు పలికిన రికార్డు ధర ఇది. రాష్ట్ర ఎన్నికల చరిత్రలోనూ ఇది రికార్డు. ఇంతకూ ఆ పల్లెలో అంతగా ఏముంది? సర్పంచిగా గెలిస్తే వేలల్లో కూడా జీతం రాదే...అధికారం చెలాయించే అవకాశమే ఉండదే. మరి అలాంటిది ఇంత పోటీ ఎలా వచ్చింది? ఎందుకొచ్చింది? చాలా ఇంటరెస్టింగ్...
తెలంగాణలో పంచాయతీ ఎన్నికల హోరు జోరు మామూలుగా లేదు. పార్టీల నేతలందరూ పల్లెల్లో తిష్ట వేసుక్కూర్చొని మరీ ఓట్ల పందేరం మొదలెట్టారు. ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల్ని తలదన్నేలా పంచాయతీ ఎన్నికల్లో కాసుల వర్షం కురుస్తోంది. ఏకంగా ఓటుకు రూ.20 వేల దాకా ధర పలుకుతోందంటే పరిస్థితి ఎంత దారుణంగా మారి పోయిందో అర్థం చేసుకోవచ్చు. గ్రామాభివృద్ధే లక్ష్యంగా నేతల్ని ఎన్నుకోవలసిన ఎన్నికలు కాస్త కాసుల కోసం కక్కుర్తిపడే వ్యవహారంగా మారిపోతోంది. పల్లెలోని సగటు ఓటరు ఏమాత్రం మొహమాటం లేకుండా తన ఓటుకు రేటు కట్టేస్తున్నాడు. పల్లెకు ఎవరు మంచి చేస్తారో అది లెక్కే కాదు. మనకు ఎవరు బాగా లెక్కిస్తారో వారికే ఓటు అనే రీతిలో దందా కొనసాగుతోంది.
మూడు విడతలుగా జరిగే ఈ పంచాయతి ఎన్నికల్లో మొదటి విడత పూర్తయి కౌంటింగ్ షురూ అయ్యింది. బరిలో నిలిచిన అభ్యర్థులు ఎలాగైనా గెలిచి తీరాలని పట్టుబట్టి మరీ రాత్రిళ్ళు పల్లెల్లో ఇంటింటికీ తిరిగి ఓటుకు రూ.2వేలు చొప్పున సొమ్ము అందజేసినట్లు తెలుస్తోంది. ఇంట్లో అయిదుగురు ఉంటే...రూ.10వేలు ఇస్తున్నారు. ఓటుకు రూ.2 వేలు కాస్త కాస్ట్లీ అయినా సరే చేసేదేముంది అనుకోవచ్చు. కానీ రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ మండలం నర్కుడ గ్రామంలో సర్పంచుగా పోటీ చేస్తున్న అభ్యర్థులు ఓటుకు రూ.15 వేల నుంచి రూ.20 వేల దాకా డబ్బులిస్తున్నట్లు ఓ వార్త సంచలనం సృష్టిస్తోంది. ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా ఓటు ఇంత ధర పలకలేదు....పంచాయతీ ఎన్నికల్లో ఇంత క్రేజీ ఏంటని చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
నర్కుడ గ్రామంలో 4వేల మంది ఓటర్లుండగా...పోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్య అధికంగా ఉండటంతో ఈ విచిత్ర పోటీ ఏర్పడింది. నర్కుడ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు దగ్గరగా ఉండటం, చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ బాగా పెరిగిపోవడంతో గ్రామానికి పెద్ద మొత్తంలో ఆదాయం లభిస్తోంది. అందుకే ఈ పల్లెలో ఎంత ఖర్చుపెట్టి ఎన్నికల్లో గెలిచినా...సర్పంచి అయ్యాక అంతకంతకు సంపాయించవచ్చనే ధీమాతోనే పెద్దఎత్తున కరెన్సీ కట్టలు కట్లు తెగి ప్రవహిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఓ పల్లెలో ఇంత బాహటంగా ప్రజాస్వామ్యాన్నే అపహాస్యం చేసేలా ఓట్లకు నోట్లు పంపిణీ జోరుగా సాగుతుంటే...ఎన్నికల అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు ఏం చేస్తున్నారనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
మేజర్ పంచాయతీల్లోనూ ఓట్ల పండగ జోరుగానే ఉంది. మందు, చికిన్ డబ్బు అందుతుండటంతో పల్లె ప్రజలు చాలా సంతోషంగా ఉంటున్నారు. చాలా గ్రామాల్లో ఓటు ధర రూ.5వేల దాకా పలుకుతోంది. కులసంఘ పెద్దలకు రూ.లక్షల్లో డబ్బు ముట్టజెబుతున్నారు. అలాగే నాగర్ కర్నూల్ లో రియల్ ఎస్టేట్ జోరుగా సాగే గ్రామంలో ఓటు ధర వెయ్యి నుంచి మూడు వేల దాకా ఉంటోంది. ఓగ్రామంలో అభ్యర్థికి ఉంగరం గుర్తు వస్తే...డబ్బుతోపాటు వెండి ఉంగరాలు కూడా పంపిణీ చేశాడట. తాండూరు మండలంలో ఓ గ్రామంలో సర్పంచి అభ్యర్థి తనను గెలిపిస్తే గుడి కట్టిస్తానని హామీ ఇచ్చాడు. ఎర్రుపాలెం మండలం కొత్తపాలెంలో ఓటుకు రూ.6వేలు ఇచ్చారు. ఇక కొన్ని గ్రామాల్లో డబ్బుతోపాటు మందు చికెన్ పంపిణీ చేస్తున్నారు. మహిళలకు చీరలు ఇస్తున్నారు.
దేశంలోప్రలోబాలు లేనిదే ఎన్నికలు జరగవని...ప్రజలే డబ్బుల్లేకుంటే ఓట్లు వేయని పరిస్థితికి వచ్చారని దీన్ని బట్టి మీకు అర్థమవట్లేదా? సరే ఓటు వేసేందుకు డబ్బు డిమాండ్ చేశారు ఇచ్చారు బాగుంది. వారు గెలిచాక అంతకంతకు మన నుంచి లాగుతాడన్న చిన్న లాజిక్ ప్రజలెలా మిస్ అవుతున్నారో తెలీదు. మొత్తానికి పంచాయతీ ఎన్నికలు మూడు బాటిళ్ళు ఆరు చికెన్ లు వేలల్లో నోట్లు అన్న చందంగా మారిపోయింది.