కేసీఆర్ విషయంలో కంచె ఐలయ్య క్లారిటీ మిస్

Update: 2017-09-21 11:02 GMT
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విషయంలో రిటైర్డ్ ప్రొఫెసర్ కంచె ఐలయ్య క్లారిటీ మిస్సయ్యారా? ఇటీవలి కాలంలో పదునైన విమర్శలతో ఎదుటివారిని ఇరుకునపడేస్తున్న ఐలయ్య అసలే మాత్రం లాజిక్ లేని విధంగా కేసీఆర్ కు లింకుపెట్టారా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సామాజిక విశ్లేషణ పేరుతో భావప్రకటన స్వేచ్ఛ ఆధారంగా కంచె ఐలయ్య రాసిన `సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు` అనే పుస్తకం రచ్చరచ్చగా మారిన సంగతి తెలిసిందే. ఐలయ్య పుస్తకంపై ఆర్యవైశ్యులు ఫైరవుతుండగా...తన వాదనలో తప్పేం లేదని ఐలయ్య బల్లగుద్ది మరీ చెప్తున్నారు.

అయితే ఈ క్రమంలో ఐలయ్య చేసిన కామెంట్లు ఆసక్తికరంగా మారాయి. తనను చంపేసిన పర్లేదనే కామెంట్లు చేసిన రాయలసీమ ప్రాంత వాసి - టీడీపీ ఎంపీ టీజీ వెంకటేశ్ తో తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఒప్పందం ఉందని ఐలయ్య ఆరోపించారు. అంతేకాకుండా టీజీ వెంకటేశ్ వ్యాపారాలకు కేసీఆర్ అండగా నిలుస్తున్నారని మండిపడ్డారు. ఈ ఇద్దరు నేతలు కలిసి తనను లక్ష్యంగా చేసుకున్నారని విరుచుకుపడ్డారు. అయితే ఐలయ్య మాటలు సింక్ కావడం లేదని విశ్లేషకులు అంటున్నారు.

తెలంగాణ ఉద్యమం సమయంలో టీఆర్ ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ ది ప్రత్యేక రాష్ర్టం ఎజెండా అయితే టీజీది సమైక్యవాదం. ఈ ఇద్దరు నేతలు తమ తమ వాదనలను బలంగానే నమ్మారు, ప్రచారం కూడా చేశారు. ఇప్పుడు ఈ ఇద్దరు నేతలు తమ తమ రాష్ర్టంలోని వ్యవహారాలు చూసుకోవడంలో బిజీ అయిపోయారు. అలాంటి నేతల మధ్య ఒక వ్యక్తిని టార్గెట్ చేసుకోవడం కోసం దోస్తీ కుదరడం అనేది అసాధ్యం అని విశ్లేషకుల మాట. అదే సమయంలో టీజీ వ్యాపారాల గురించి ఐలయ్య చేసిన కామెంట్లు సరైనవి కావని అంటున్నారు.  ఒక రాష్ర్ట ముఖ్యమంత్రిగా వ్యాపారాలు చేసేవారిని పొరుగు రాష్ర్టం అనే కోణంలో అడ్డుపడటం సరైంది కాదని చెప్తున్నారు. అందులోనూ టీజీ కోసం కేసీఆర్ చేసిన ప్రత్యేక మర్యాదలు - కల్పించిన సౌకర్యాలు కూడా ఏమీ లేవని విశ్లేషిస్తున్నారు. మొత్తంగా తన వాదనకు మద్దతుగా కేసీఆర్-టీజీ దోస్తీ గురించి ఐలయ్య చేసిన విశ్లేషణ వాస్తవ దూరంగా ఉందనే మాటను స్పష్టం చేస్తున్నారు.
Tags:    

Similar News