ప్రగతి భవన్ వద్ద జేసీ దివాకర్ రెడ్డి హల్ చల్

Update: 2022-01-19 15:35 GMT
సీమ రెడ్డప్ప వ్యవహారశైలి ఎప్పుడూ వినూత్నమే. ఆయన ఎప్పుడు ఎవరిని కలుస్తాడో ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఆయన ఏ పార్టీలో ఉన్నా అన్ని పార్టీల నేతల వద్దకు వెళతారు.. అందరినీ కలుస్తారు. ఆయన మోహమాటాలు ఉండవు. ఇక ఎవరిని పడితే వారిని జేసీ తిడుతుంటారు.. నోటికొచ్చినట్టు మాట్లాడుతారు. ఇప్పుడవే ఆయనను వివాదాస్పద నేతగా మార్చాయి.

తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్ దగ్గర రాయలసీమ రెడ్డప్ప జేసీ దివాకర్ రెడ్డి హల్ చల్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి ప్రగతి భవన్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే అపాయింట్ మెంట్ లేకుండా సీఎంను కలిసేందుకు లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు.

సీఎం కేసీఆర్ అపాయింట్ మెంట్ కాకుంటే మంత్రి కేటీఆర్ ను కలుస్తానంటూ పోలీసులతో జేసీ వాగ్వాదానికి దిగారు. ఇక పోలీసులు ఎంత చెప్పినా వినకపోవడంతో జేసీని అదుపులోకి తీసుకున్న పోలీసులు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు తరలించినట్టుగా తెలుస్తోంది. మొత్తంగా ప్రగతి భవన్ ముందు జేసీ దివాకర్ రెడ్డి కొద్దిసేపు హడావుడి చేశారు.

ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే జేసీ దివాకర్ రెడ్డి ఆ మధ్య తెలంగాణ అసెంబ్లీలోని సీఎల్పీ కార్యాలయంలో ప్రత్యక్షమై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఇప్పుడు ప్రగతి భవన్ దగ్గర పోలీసులతో వాగ్వాదానికి దిగి మరోసారి వార్తల్లోకి ఎక్కారు.
Tags:    

Similar News