జేసీ బ్రదర్స్ షాక్ అలా ఇలా ఉండదా... ?

Update: 2022-01-20 01:30 GMT
అనంతపురం జిల్లాలో జేసీ బ్రదర్స్ రాజకీయం ఈనాటిది కాదు, 1978లో జేసీ దివాకరరెడ్డి రాజకీయ అరంగేట్రం కాంగ్రెస్ పార్టీ తరఫున చేశారు. ఆయన ఇది నాలుగున్నర దశాబ్దాల పాలిటిక్స్. తరువాత కాలంలో తమ్ముడు ప్రభాకరరెడ్డి ఎంట్రీ ఇస్తే 2019 ఎన్నికల వేళ ఈ అన్నదమ్ముల వారసులు కూడా పోటీ చేశారు. మొత్తానికి చూస్తే రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖుడిగా  మాజీ మంత్రిగా ఉన్న జేసీ దివాకరరెడ్డి 2019 ఎన్నికల్లో వారసులను గెలిపించుకోకపోవడం పెద్ద చర్చగానే అయింది.

ఇక తాడిపత్రి నుంచి 1985తో మొదలుపెట్టిన జేసీ దివాకరరెడ్డి 2014 దాకా అయిదు సార్లు వరసబెట్టి గెలిచారు. 2014లో ఆయన తమ్ముడు జేసీ ప్రభాకరెడ్డి ఎమ్మెల్యే అయ్యారు. అలాంటి సీట్లో 2019 ఎన్నికల నాటికి వైసీపీ బాగా పుంజుకుంది. కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆ పార్టీ తరఫున ఎమ్మెల్యే అయ్యారు. ఆయనకు ఏడువేల అయిదు వందల దాకా మెజారిటీ వచ్చింది.

ఇక జేసీ ఫ్యామిలీ పని తాడిపత్రిలో అయిపోయింది అని సొంత పార్టీలో ప్రత్యర్ధులు కానీ బయట వారు కానీ అనుకునే సీన్ ఉంది. అయితే చాలా తొందరలోనే జేసీ బ్రదర్స్ అక్కడ పుంజుకున్నారు. అంతేకాదు, తాడిపత్రి మునిసిపాలిటీని జేసీ ప్రభాకరరెడ్డి గెలుచుకుని చైర్మన్ అయ్యారు. మరో వైపు ఎంపీటీసీలను కూడా బాగా గెలుచుకున్నారు. దాంతో జేసీల పట్టు మళ్ళీ అక్కడ రుజువు అయింది.

ఇక పెద్దారెడ్డి గట్టిగా నిలబడలేకపోవడం, జేసీ ప్రభాకరరెడ్డి ఇంటి మీదకు పెద్దారెడ్డి దాడికి వెళ్ళడం, ఆయన మీద కేసులు అక్రమంగా బనాయించడం వంటి పరిణామాలతో జేసీల మీద సానుభూతి వెల్లువలా ఎగిసిపడింది అంటారు. అదే విధంగా నియోజకవర్గంలో అభివృద్ధి అన్నది లేదని విమర్శలు ఉన్నాయి.

దీంతో పెద్దారెడ్డి మీద వ్యతిరేకత బాగా పెరుగుతోంది. ఇది మరో రెండేళ్ళలో మరింతగా ముదిరితే కనుక కచ్చితంగా పెద్దారెడ్డికి దెబ్బే అంటున్నారు. జేసీ బ్రదర్స్ ఈసారి అలాంటి ఇలాంటి షాక్ ఇవ్వరని, తాడిపత్రితో పాటు అనంతపురం రాజకీయాల్లో తమ సత్తా చాటి ఎవరికి షాక్ ఇవ్వాలో వారికే ఇస్తారు అంటున్నారు. చూడాలి మరి.
Tags:    

Similar News