పాత శపధాన్ని మర్చిపోలేదంటున్న జానా

Update: 2015-11-25 09:48 GMT
దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా వరంగల్ ప్రజలు ఇచ్చిన తీర్పుతో షాక్ తిన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడిప్పుడే వాస్తవంలోకి వస్తోంది. ఓటమి పక్కా అని తెలిసినప్పటికీ.. మరీ ఇంత దారుణ ఓటమి అన్న విషయాన్ని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎవరూ ఊహించలేదు. కాంగ్రెస్ నేతల అంచనాలకు భిన్నంగా వరంగల్ ప్రజలు తీర్పు ఇవ్వటంతో కంగుతిన్న వారంతా.. ఓటమిపై పెద్దగా స్పందించింది లేదు.

తాజాగా తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాఫక్ష నేత జానారెడ్డి మీడియాతో మాట్లాడారు. వరంగల్ ప్రజలు ఇచ్చిన తీర్పును స్వాగతించిన ఆయన.. కాంగ్రెస్ నేతలు చేసిన ప్రచారాన్ని ఓటర్లు నమ్మలేదన్నారు. ఓటమికి కారణాల్ని విశ్లేషించుకుంటామన్న ఆయన.. గెలుపునకు విర్రవీగిపోవటం.. ఓటమికి కుంగిపోవటం లాంటివి కాంగ్రెస్ చేయదని చెప్పారు. ఇలాంటి ఓటములు కాంగ్రెస్ కు కొత్తేం కాదన్న ఆయన.. తర్వలోనే తమ సత్తా చాటుతామన్న ఆశా భావాన్ని వ్యక్తం చేశారు.

వరంగల్ ఉప ఎన్నిక ఫలితాలు వెలువడిన తర్వాత మాట్లాడిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. గతంలో జానారెడ్డి చేసిన ఒక సవాలును ప్రస్తావిస్తూ.. ఉద్యమ స్ఫూర్తితో ప్రాజెక్టులు పూర్తి చేసి మూడేళ్లలో రెండో పంటకు నీళ్లు ఇస్తామని.. జానారెడ్డి గులాబీ కండువా కప్పుకోవటానికి సిద్దంగా ఉండాలని వ్యాఖ్యానించటం తెలిసిందే.

తాజాగా మీడియాతో మాట్లాడిన సందర్భంగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యల్ని ఉటంకిస్తూ.. గతంలో తాను చేసిన సవాలుకు కట్టుబడి ఉన్నానని తేల్చి చెప్పారు.  రానున్న మూడేళ్లలో ప్రాజెక్టుల ద్వారా రెండో పంటకు కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ నీళ్లు ఇస్తే.. ఆయనకు తాను ప్రచార సారథిగా వ్యవహరిస్తానంటూ చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నారు. మొత్తానికి షాకింగ్ ఓటమి తర్వాత కూడా.. జానారెడ్డి సాబ్ తన సవాలును మర్చిపోకపోవటం గొప్పే.
Tags:    

Similar News