రాములమ్మకు ఓపెన్ గా వార్నింగ్

Update: 2017-02-21 12:40 GMT
సినిమాల్లో తిరుగులేని రీతిలో సక్సెస్ అయి.. ఒకదశలో లేడీ అమితాబ్ గా గుర్తింపు పొందిన విజయశాంతి.. రాజకీయాల్లోకి వచ్చి అట్టర్ ప్లాప్ అయ్యారు. సొంతంగా పార్టీ పెట్టటం మొదలు.. రకరకాల పార్టీలు మార్చిన ఆమె.. ఎక్కడా నిలకడగా లేని వైనం తెలిసిందే. అరకొర అవగాహనతో రాజకీయాలు మాట్లాడేయటం.. ఆవేశమే తప్పించి.. ఆలోచన కించిత్ కూడా ఉండదన్న విమర్శల్ని మూటగట్టుకున్న ఆమెకు తాజాగా మరోసారి ఎదురుదెబ్బ తగిలింది.

తెలుగు రాజకీయాలు సరిపోవన్నట్లుగా తాజాగా ఆమె తమిళ రాజకీయాల మీద మాట్లాడటం తెలిసిందే. తమిళనాడు అధికారపక్షమైన అన్నాడీఎంకేలో నెలకొన్న అధికార సంక్షోభం నేపథ్యంలో.. చిన్నమ్మ శశికళకు మద్దుతుగా గళం విప్పారు. సినీ ప్రముఖుల నుంచి సాధారణ ప్రజల వరకూ అందరూ శశికళను తప్పు పడుతుంటే.. అందుకు భిన్నంగా ఆమెకు మద్దతుగా గళం విప్పిన విజయశాంతిపై తమిళ సంగీత దర్శకుడు వసంతన్ వార్నింగ్ ఇచ్చారు.

తమిళ రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దని చెప్పిన ఆయన.. ఇదేమీ సినిమా కాదని.. తమిళ ప్రజల జీవితాలన్న విషయాన్ని మర్చిపోవద్దని చెప్పటం గమనార్హం. అన్నాడీఎంకే అధినేత్రి అమ్మ జయలలితతో విజయశాంతికి సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఆమె మరణం తర్వాత.. అమ్మ స్థానాన్ని చేపట్టిన శశికళకు ప్రముఖులు.. ప్రజలు వ్యతిరేకిస్తుంటే.. అందుకు భిన్నంగా విజయశాంతి మాత్రం తన మద్దతును తెలిపారు. 122 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్న శశికళకు ముఖ్యమంత్రి పదవిని చేపట్టే అర్హత ఉందని వ్యాఖ్యానించటం కలకలాన్ని రేపింది.

శశికళకు తన మద్దతు తెలిపిన ఆమె.. మరోవైపు చిన్నమ్మపై తిరుగుబాటు చేసిన పన్నీర్ సెల్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అన్నాడీఎంకే పాలనను దెబ్బ తీయటానికే పన్నీర్ ప్రయత్నిస్తున్నారని ఆమె మండిపడుతున్నారు. ఆమె వ్యాఖ్యల్ని పలువురు తప్పు పడుతున్నారు. తెలుగు రాజకీయాల్ని చూసుకోవాలే కానీ.. తమిళ రాజకీయాలుఎందుకని ప్రశ్నించటమే కాదు.. ఆమెకు ఏం తెలుసని తమిళ రాజకీయాల్లో తల దూరుస్తున్నారంటూ మండిపడుతున్నారు. మరి.. ఇలాంటి విమర్శలకు.. హెచ్చరికలకు రాములమ్మ ఏం బదులిస్తారో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News