'అమ్మ ఒడి' లో జగన్ మరో వరం!

Update: 2019-06-27 10:24 GMT
పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికి పదిహేను వేల రూపాయలు ఖాతాలో వేసే కార్యక్రమంలో భాగంగా మరో ఆసక్తిదాయకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ మేరకు విద్యాశాఖ సమీక్షలో కొత్త నిర్ణయాన్ని ప్రకటించారు. దాని ప్రకారం బడికే కాదు - పిల్లలను  కాలేజీకి పంపే తల్లికి కూడా అమ్మ ఒడి పథకం వర్తించనుంది.

ఇంటర్మీడియట్ చదివే పిల్లలున్న తల్లికి కూడా ఈ పథకాన్ని వర్తింపజేయాలని భావిస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే ప్రైవేట్ కాలేజీలకు పిల్లలను పంపే వారికి కాకుండా ప్రభుత్వ - సంక్షేమ హాస్టళ్లలో ఉండే పిల్లల తల్లులకే ఈ పథకాన్ని అమలు చేయాలని అనుకుంటున్నట్టుగా ఉన్నారని తెలుస్తోంది.

పాఠశాలల విషయంలో ప్రభుత్వ - ప్రైవేట్ అనే తేడాలు లేకుండా.. అందరి కోసం ఈ పథకాన్ని అమలు చేయనున్నట్టుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. కాలేజీల విషయంలో మాత్రం ప్రభుత్వ కాలేజీల్లో పిల్లలను చదివించే కుటుంబాలనే ఈ పథకం విషయంలో పరిగణనలోకి తీసుకోవాలని భావిస్తున్నట్టుగా ఉంది జగన్ ప్రభుత్వం.

పాఠశాలల్లో సౌకర్యాల పెంపు, మెరుగైన విద్యాబోధన - నాణ్యతా ప్రమాణాల పెంపే లక్ష్యంగా విద్యాశాఖపై సీఎం సమీక్ష సాగినట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి 20-25 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండేలా చూడాలని ఆయన ఆదేశించారు. ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడుతున్నందున ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలని అధికారులకు సీఎం జగన్ మోహన్ రెడ్డి సూచించినట్టుగా సమాచారం.
Tags:    

Similar News