‘‘జై ఆంధ్రప్రదేశ్’’ బాబును దెబ్బేస్తుందా?

Update: 2016-10-25 04:49 GMT
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పాలనపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి ఎంతలా ఉందన్న విషయాన్ని చాటి చెప్పాలన్న నిర్ణయాన్ని ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించినట్లుగా కనిపిస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదా సాధనలో ఫెయిల్ కావటం.. అవినీతి.. పాలనా పరంగా చేస్తున్న తప్పుల్ని ఎండగట్టటంతో పాటు.. ప్రజల్లో అవగాహన పెంచేందుకు వీలుగా ఏపీ విపక్ష నేత భారీ నిర్ణయం ఒకటి తీసుకున్నారు.

రానున్న రోజుల్లో ఏపీ వ్యాప్తంగా ‘‘జై ఆంధ్రప్రదేశ్’’ పేరుతో ఐదు భారీ బహిరంగ సభల్ని నిర్వహించాలని జగన్ డిసైడ్ చేసినట్లుగా చెబుతున్నారు. అయితే.. ఈ ఐదు భారీ సభలు ఎక్కడ నిర్వహిస్తారన్న అంశాన్ని బయటపెట్టని జగన్ పార్టీ.. మొదటి బహిరంగ సభ వివరాల్ని మాత్రం అనౌన్స్ చేసింది. ఐదు బహిరంగ సభల సిరీస్ లో మొదటి సభను విశాఖపట్నంలో నిర్వహించాలని నిర్ణయించారు. బాబు ఫెయిల్యూర్స్ ను జనంలోకి తీసుకెళ్లటం.. ఏపీకి ప్రత్యేక హోదా అవసరం ఎంతన్న విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలన్నది జగన్ ఆలోచనగా చెబుతున్నారు.

హోదాతోనే ఏపీకి అభివృద్ధి సాధ్యమన్న నినాదాన్ని జపిస్తున్న జగన్.. దాన్నే ఆయుధంగా చేసుకొని బాబును దెబ్బ తీయాలని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. సెంటిమెంట్ ను రాజేసేందుకు హోదా సాధనకు మించిన అస్త్రం మరొకటి ఉండని నేపథ్యంలో.. ఆ అంశంపై పట్టు పెంచటంతో పాటు.. ప్రత్యేక హోదా విషయంలో తాను మాత్రమే పోరాడుతున్న భావన ప్రజల్లో కలిగేలా చేయటానికి జగన్ పావులు కదుపుతున్నారు. ఏపీలోని మూడు (ఉత్తరాంధ్ర.. సీమాంధ్ర.. కోస్తాంధ్ర) ప్రాంతాల్లో భారీ బహిరంగ సభల్ని నిర్వహించటం ద్వారా హోదా మీద పోరును మరింత పెంచాలని భావిస్తున్నారు.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇమేజ్ ను ‘‘జై ఆంధ్రప్రదేశ్’’ భారీగా డ్యామేజ్ చేస్తుందని నమ్ముతున్న జగన్.. తొలి సభను విశాఖపట్నంలో నిర్వహించనున్నారు. నవంబరు 6న నిర్వహించే భారీ బహిరంగ సభతో తన సత్తా చాటటంతో పాటు.. ఏపీ ముఖ్యమంత్రి మీద ఒత్తిడి పెంచాలన్నది జగన్ వ్యూహంగా చెబుతున్నారు. మరి.. జగన్ ఐడియా ఎంతవరకు వర్క్ వుట్ అవుతుందో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News