బాలినేని రాయబారంతో ఆనంపై జగన్ కూల్

Update: 2019-12-13 04:44 GMT
కాలానికి తగ్గట్లుగా మారాలి. ఆ విషయంలో కొందరు నేతల తీరును మెచ్చుకోవాల్సిందే. అప్పుడెప్పుడో దివంగత మహానేత వైఎస్ హయాంలోనే మంత్రిగా వ్యవహరించిన ఆనం తర్వాత కాలం కర్మం కలిసి రాలేదు. ప్రస్తుతం నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న ఆనం రామనారాయణరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. సీనియర్ నేతే అయినప్పటికీ పలు సమీకరణాల నేపథ్యంలో మంత్రి పదవి దక్కలేదు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఇటీవల ఆయన చేసిన మాఫియా వ్యాఖ్య కలకలం రేపటమే కాదు.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తీవ్ర ఆగ్రహానికి గురయ్యేలా చేసింది. విజయసాయి రెడ్డి సైతం ఈ వ్యాఖ్యల మీద పరోక్షంగా స్పందించి చర్యలు తప్పవన్న మాటను చెప్పేశారు. జిల్లా మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డిని ఉద్దేశించి ఆనం చేసిన వ్యాఖ్యపై సీఎం జగన్ సీరియస్ గా ఉన్నారన్న విషయం బయటకు వచ్చింది. గీత దాటిన వారిపై చర్యలు తప్పవన్న మాటను ఓపెన్ గానే చెప్పేసి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందన్న విషయాన్ని విజయసాయి తన మాటలతో చెప్పేశారు.

అధిపత్య పోరులో భాగంగా ఉండబట్టలేక నోరుజారిన ఆనం.. తాను చేసిన తప్పును గుర్తించారు. తనకున్న రాజకీయ అనుభవాన్ని రంగరించిన ఆయన.. అసెంబ్లీ సమావేశాల్ని తనకు అనుకూలంగా మార్చుకున్నారు. ప్రభుత్వాన్ని వెనకేసుకొస్తూ.. విపక్షాన్ని ఇరుకున పెట్టేలా ఆయన చేసిన వ్యాఖ్యలతో జగన్ హ్యాపీగా ఫీలయ్యారు. ఆనం వ్యాఖ్యలతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇబ్బందికి గురయ్యారు. దీంతో.. ఆనంకు మంచి మార్కులే పడ్డాయి.

ఇదే మంచి టైం అనుకున్న ఆనం.. ముఖ్యమంత్రి జగన్ కు అత్యంత సన్నిహితుడైన బాలినేనిని వెంటపెట్టుకొని అధినేత వద్దకు వెళ్లినట్లుగా చెబుతున్నారు. తాను చేసిన వ్యాఖ్యల వెనుక అసలు విషయాన్ని వివరించటంతో పాటు.. తానిక తొందరపడనన్న మాట ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఆనం ‘‘వివరణ’’కు సీఎం జగన్ మొత్తబడినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి టైం చూసుకొని బాలినేని రాయబారంతో ఆనం సేఫ్ గా బయటపడినట్లేనని చెప్పక తప్పదు.
Tags:    

Similar News