కరోనా డెడ్ బాడీస్ తో వైరస్ సోకదా? ఎవరు చెప్పారు?

Update: 2020-08-03 05:15 GMT
భయం మా చెడ్డది. అదెంత వరకైనా మనిషిని తీసుకెళుతుంది. నిండుగా ఉండే మానవత్వాన్ని చంపేస్తుంది. చేయరాని పనుల్ని చేసేలా చేస్తుంది. తాజాగా ఇలాంటి పరిస్థితే నెలకొంది. కరోనా వేళ.. ఈ మాయదారి వైరస్ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. బతికి ఉన్నోళ్ల కంటే మరణించినోళ్లతోనే తమకు ఎక్కువ అపాయమన్న తప్పుడు భావనతో ఉండటం గమనార్హం. వాస్తవానికి మరణించిన వారితో వైరస్ వ్యాపించదన్నది మర్చిపోకూడదు. ఇప్పటికే ఈ విషయాన్ని పలువురు స్పష్టం చేస్తున్నారు.

తాజాగా ఇల్లినాయిస్ వర్సిటీ అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ విజయ్ ఎల్దండి స్పందించారు. కరోనాతో మరణించిన వారికి దహన సంస్కాల్ని అడ్డుకోవటం మంచిది కాదని స్పష్టం చేస్తున్నారు. వైరస్ కారణంగా మరణించిన వారి భౌతికకాయాల్ని శ్మశానాలకు రాకుండా అడ్డుకోవటాన్ని ఆయన తప్పు పడుతున్నారు. వాస్తవానికి మరణించిన వారి కంటే కూడా.. ఎవరి వల్ల ఎక్కువగా కరోనా ప్రమాదం ఉంటుందో చెప్పే ప్రయత్నం చేశారు.

వైరస్ సోకిన వారి దగ్గు.. తుమ్ములు లేదంటే.. వారి నోటి తుంపరులతోనే ఎక్కువ ప్రమాదమని ఆయన స్పష్టం చేస్తున్నారు. అంతేకానీ మృతదేహాలతో వ్యాపించదని మర్చిపోకూడదని పేర్కొన్నారు. మరణించిన వారితో వైరస్ వ్యాప్తి ఉండదన్న విషయాన్ని అందరూ తెలుసుకోవాలని.. అంతిమ సంస్కారాల విషయంలో ఎవరిని ఎవరూ అడ్డుకోకూడదని.. ఇది మంచి పద్దతి కాదని పేర్కొన్నారు. ప్రజలు మానవత్వంతో వ్యవహరించాలని ఆయన కోరుతున్నారు. ఇటీవల కాలంలో కరోనాతో మరణించిన వారికి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తుంటే.. వారిని పలు ప్రాంతాల్లో అడ్డుకోవటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఈ వినతిని చేశారు.
Tags:    

Similar News