400 అడుగులు.. 11 సెకన్లు: 'కంబళ' సరికొత్త రికార్డు!
ఏపీలో సంక్రాంతిని పురస్కరించుకుని కోడిపందేలు.. పొట్టేళ్ల పందేలు(కొన్ని ప్రాంతాల్లో) నిర్వహించినట్టుగానే.. పొరుగున ఉన్న కర్ణాటకలో కూడా నూతన సంవత్సరానికి ముందు.. `కంబళ` పేరుతో దున్నపోతుల పందేలను నిర్వహిస్తారు.;
ఏపీలో సంక్రాంతిని పురస్కరించుకుని కోడిపందేలు.. పొట్టేళ్ల పందేలు(కొన్ని ప్రాంతాల్లో) నిర్వహించినట్టుగానే.. పొరుగున ఉన్న కర్ణాటకలో కూడా నూతన సంవత్సరానికి ముందు.. `కంబళ` పేరుతో దున్నపోతుల పందేలను నిర్వహిస్తారు. వీటిని సంప్రదా యంగా కొన్ని తరాల నుంచి నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం వీటిని ప్రోత్సహిస్తోంది కూడా. `కాంతార-1`లో దీనికి సంబంధించి కొన్ని ఘట్టాలు కూడా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో జరిగే ఈ కంబళ పోటీల కోసం.. దున్నపోతులను బలిష్టంగా మేపుతారు. దీని కోసం.. ప్రత్యేకంగా శిక్షకులు కూడా ఉంటారు. హైదరాబాద్‌లో కూడా సంక్రాంతి, దసరాలకు ముందు దున్నపోతులను పూజిస్తారు. ఇది అక్కడి సంప్రదాయమే.
ఇక, తాజాగా నిర్వహించిన `కంబళ` పోటీలు సరికొత్త రికార్డును సృష్టించాయి. 125 మీటర్లు(400 అడుగులు) దూరాన్ని దున్న పోతులు.. కేవలం 10.87(దాదాపు 11).. సెకన్లలోనే పరిగెత్తి.. అప్పటి వరకు ఉన్న రికార్డును తుడిచి పెట్టాయి. తాజాగా సోమవారం మంగళూరులో జరిగిన పోటీల్లో స్వరూప్ అనే యువకుడు.. తన దున్నపోతులతో బరిలో దిగారు. 125 మీటర్ల దూరాన్ని కూడా 10.87 సెకన్ల అత్యంత తక్కువ వ్యవధిలో పరిగెత్తి రికార్డు సృష్టించాడు. గతంలో శ్రీనివాస్ అనే వ్యక్తి.. 100 మీటర్ల దూరాన్ని తన దున్నపోతులతో 8.78 సెకన్ల వ్యవధిలో దూసుకుపోగా.. తాజాగా ఆ రికార్డును స్వరూప్ తిరగరాసినట్టు అయింది.
పోటీ ఎలా ఉంటుంది?
పాదం లోతు నీటిలో ఉన్న పొలంలో.. రెండు దున్నపోతులకు కాడి కట్టి.. వాటిని పట్టుకుని యజమాని నిర్ణీత దూరాన్ని దూసుకుపోవాలి. ఈ క్రమంలో ఎంత దూరం ఎంత సమయంలో దూసుకుపోయాడన్న దానిని బట్టి.. అవార్డులు.. రివార్డులు అందిస్తారు. తక్కువ సమయంలో నిర్ణీత దూరాన్ని దూసుకుపోయిన.. దున్నపోతులను ఘనంగా సత్కరిస్తారు కూడా. కాగా.. ఇది అత్యంత సంక్లిష్ట పోటీ కావడం గమనార్హం. నీటితో నాని నాని ఉన్న మన్ను.. జారిపోతూ ఉంటుంది.
మరోవైపు.. చూసేందుకు వచ్చిన యువత పెట్టే అరుపులు కేకలతో దున్నపోతులు భయ భ్రాంతులకు గురవుతూ ఉంటాయి. ఇలాంటి సమయంలో నిర్ణీత దూరాన్ని దూసుకుపోవడం యజమానికి కత్తిమీద సాములాంటి పనే. కొన్ని కొన్ని సందర్భాల్లో దున్నపోతులు ఎదురు దిరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక, ఈ పోటీలో ఫస్ట్ ప్లేస్‌లో నిలిచిన వారికి 10 లక్షల రూపాయలు, ద్వితీయ స్థానంలో ఉన్నవారికి 5 లక్షల రూపాయలను బహుమతిగా ఇస్తారు.