అమరావతిలో మొత్తం 13 వేల మంది.. త్వరలో మరో 30 వేల మంది రాక

2024లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని నిర్మాణం కోసం అనేక చర్యలు తీసుకుంది. అయితే ఐదేళ్ల పాటు పనులు ఎక్కడికక్కడ నిలిచిపోవడం వల్ల రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి.;

Update: 2025-12-29 19:30 GMT

రాజధాని అమరావతి నిర్మాణ పనులు పుంజుకున్నాయి. మే నెలలో అమరావతి 2.0 పనులకు ప్రధాని మోదీ ప్రారంభించిన తర్వాత పనులు ఒక్కొక్కటిగా మొదలయ్యాయి. దాదాపు ఆరు నెలల తర్వాత రాజధాని ప్రాంతంలో అన్నిరకాల పనులు జరుగుతున్నాయి. ఒకవైపు ప్రభుత్వ భవనాలు, మరోవైపు కనెక్టింగ్ రహదారులు, ఇంకోవైపు ప్రైవేటు కార్యాలయాలు, బ్యాంకులు, ప్రైవేటు హోటల్స్ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ పనులు చేసేందుకు వచ్చిన కూలీలతో రాజధాని గ్రామాలు కిటకిటలాడుతున్నాయి. ప్రస్తుతం రాజధాని పనుల కోసం దాదాపు 13 వేల మంది పనిచేస్తుండగా, మరో నెల రోజుల్లో ఇంకో 30 వేల మంది కూడా వారితో జత కడతారని అంటున్నారు.

రాజధానిగా అమరావతిని ప్రకటించిన తర్వాత 2014-19 మధ్య కూలీలు, కార్మికులతో సీఆర్డీఏ ప్రాంతం సందడిగా ఉండేది. అప్పట్లో దాదాపు 50 వేల మంది నిర్మాణ పనుల్లో పాల్గొనేవారు. దీంతో అప్పట్లో ప్రతి ఆదివారం రాజధాని గ్రామాల్లో జాతర వాతావరణం కనిపించేది. వారాంతాల్లో తమకు కావాల్సిన సరుకుల కోసం కార్మికులు, కూలీలు రాజధాని గ్రామాలకు వచ్చేవారు. అయితే 2019 తర్వాత రాజధాని పనులు నిలిచిపోయిన తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. నిర్మాణ పనులు చేయడానికి వచ్చినవారు ఉపాధి కోల్పోయారు. సుమారు ఆరేళ్ల తర్వాత పనులు తిరిగి ప్రారంభం కావడంతో రాజధాని కళకళలాడుతోంది.

2024లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని నిర్మాణం కోసం అనేక చర్యలు తీసుకుంది. అయితే ఐదేళ్ల పాటు పనులు ఎక్కడికక్కడ నిలిచిపోవడం వల్ల రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. భవన నిర్మాణాల కోసం తవ్విన పునాదుల్లో నీళ్లు చేరాయి. అదేవిధంగా కంప చెట్లు పెద్ద ఎత్తున పెరిగిపోవడంతో రాజధాని ప్రాంతం చిట్టడవిని తలపించింది. ఇవన్నీ తొలగించడానికి ప్రభుత్వానికి సుమారు ఏడాది కాలం పట్టింది. అన్నీ పూర్తయిన తర్వాత ఈ ఏడాది మే నెలలో ప్రధాని మోదీ చేతుల మీదుగా అమరావతి పనులను తిరిగి ప్రారంభించారు.

ఇక మే నెల తర్వాత రాజధానిలో అన్నిరకాల పనులు ప్రారంభమయ్యాయి. సీఆర్డీఏ నిర్మాణం ఇప్పటికే పూర్తవగా, హైకోర్టు, సెక్రటేరియట్ ఐకానిక్ భవనాల పనులు యుద్ధప్రాతపదికన సాగుతున్నాయి. రాజధానిలోని ప్రధానమైన సీడ్ యాక్సెస్ రోడ్డు, కనెక్టింగ్ రహదారులు, డ్రైనేజీలు, కరెంటు, వాటర్ పైపులైన్ల పనులను సమాంతరంగా చేస్తున్నారు. దీంతో సుమారు 13 వేల మంది కార్మికులు రేయింబవళ్లు పనులు చేస్తున్నారు. ఫలితంగా ఆరేళ్ల విరామానికి ఎండ్ కార్డు పడిందని అంటున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వ భవనాల నిర్మాణాలతోపాటు మౌలిక సదుపాయాల కల్పన పనులు వేగం అందుకున్న నేపథ్యంలో కాంట్రాక్టు సంస్థలు కొత్తగా మానవ వనరులను సమీకరించుకునేందుకు ఒప్పందాలు చేసుకుంటున్నాయి. దీంతో వచ్చేనెలలో రాజధాని పనుల కోసం మరో 30 వేల మంది కార్మికులు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

Tags:    

Similar News