తిరుమలలో తెలంగాణ భవన్

దేవ దేవుడు కలియుగ వైకుంఠం అయిన తిరుమలలో వెలసిన వెంకటేశ్వర స్వామి వారు ప్రపంచానికే దేవుడుగా ఉన్నారు.;

Update: 2025-12-29 18:54 GMT

దేవ దేవుడు కలియుగ వైకుంఠం అయిన తిరుమలలో వెలసిన వెంకటేశ్వర స్వామి వారు ప్రపంచానికే దేవుడుగా ఉన్నారు. ఆయన కోసం దేశ విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తూంటారు. స్వామి వారి దర్శన భాగ్యం కోసం ఎంతో మంది ఆరాటపడతారు. వారిలో పెద్ద చిన్న అన్న తారతమ్యం అయితే లేదు. ఎంతటి పదవిలో ఉన్నా కూడా స్వామి దర్శనం కోసం రావాలని ఆయన కరుణా కటాక్ష వీక్షణాలను అందుకోవాలని చూస్తారు. ఉమ్మడి ఏపీలో ఉన్నపుడు మొత్తం తెలుగు వారు అంతా వెంకన్న స్వామి కి ఏ ఇబ్బంది లేకుండా దర్శించుకునేవారు. అయితే విభజన ఏపీలో మాత్రం తెలంగాణా వారికి కొత్త సమస్యలు వస్తున్నాయని వాపోతున్నారు.

ప్రాధాన్యత ఏదీ :

రాష్ట్రం విడిపోయినా అంతా ఒక్కటి అని అంటున్నా తమకు తిరుమలలో సరైన ప్రాధాన్యత అయితే దక్కడం లేదని తెలంగాణాకు చెందిన కొంతమంది ప్రజా ప్రతినిధులే ఆవేదన వ్యక్తం చేయడం విశేషం. తెలంగాణాకు చెందిన ఎమ్మెల్యేలు మంత్రులకు సైతం తగిన ప్రాముఖ్యత అయితే లేకుండా పోతోందని మాజీ మంత్రి బీఆర్ఎస్ కీలక నాయకుడు గతంలోనే ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతలు చాలా మంది అయితే ఇదే మాటగా ఉంది. వారు మనసులో ఏదీ దాచుకోకుండా పూర్తిగా తన అసంతృప్తిని వెళ్ళగక్కారు.

ఆ పనిచేస్తే బాగు :

ఇక తాజగా సోమవారం నుంచి ప్రారంభం అయిన తెలంగాణా శాసనసభ సమావేశాలలో బీఆర్ఎస్ కి చెందిన ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్ అయితే ఇదే విషయాన్ని సభలో ప్రస్తావించడం విశేషం. ఆయన తెలంగాణా నుంచి తిరుమలకు వెళ్ళిన ప్రజా ప్రతినిధులకు అయితే ఇబ్బందులే ఎదురవుతున్నాయని బాధను వ్యక్తం చేశారు. ఈ విషయంలో పరిష్కారాలు చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. వీలు అయితే తిరుపతిలో తెలంగాణా భవన్ ని నిర్మించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది అని సూచనలు కూడా ఇచ్చారు.

బసతో పాటు అన్నీ :

తిరుమలకు మంత్రులు వెళ్తే ఒకలా ఉంటోందని ఇతర ప్రజా ప్రతినిధులు వెళ్తే మరోలా ఉంటోందని కూడా ఆయన చెప్పారు. దర్శనమే కాదు బసకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. అందువల్ల తిరుమలలో తెలంగాణా భవన్ ని ఏర్పాటు చేయడం ఉత్తమనని సూచించారు. ఇప్పటికే తిరుపతిలో కర్ణాటక భవన్, తమిళనాడు భవన్ ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. ఇపుడు తెలంగాణా భవన్ ని కూడా నిర్మిస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు. అయితే ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి ఆలోచిస్తుందో చూడాల్సి ఉంది. ఎందుకంటే ఏపీ ప్రభుత్వంతో సంప్రదించి నిర్ణయం తీసుకోవాలి. అయితే సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబుకు మధ్య మంచి రిలేషన్స్ ఉన్నాయని అంటారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలో అయితే కచ్చితంగా తిరుపతిలో తెలంగాణా భవన్ నిర్మాణం జరిగి తీరవచ్చు అన్న ఆశలు కూడా అందరిలో ఉన్నాయట.

Tags:    

Similar News