అమెరికా ఏం చెప్తే భారత్ అది చేయాలా .. సొంత నిర్ణయం ఉండదా ?
అమెరికా తాజా ప్రకటన భారత్ కు పెద్ద ఊరటనిచ్చింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయవచ్చని అమెరికా ప్రకటించింది.;
అమెరికా తాజా ప్రకటన భారత్ కు పెద్ద ఊరటనిచ్చింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయవచ్చని అమెరికా ప్రకటించింది. కానీ షరతు విధించింది. ఇప్పటికే సముద్రంలో నిలిచిపోయిన నౌకల నుంచే కొనుగోలు చేయాలన్నది షరతు. అప్పుడు రష్యాకు పెద్దగా లబ్ధి జరగదని అమెరికా భావన. ఈ ప్రకటన భారతదేశానికి ఊరటనిచ్చేది. ఎందుకంటే.. భారత చమురు, గ్యాస్ దిగుమతులు ఎక్కువగా హార్మూజ్ జలసంధి నుంచే వస్తాయి. ఇప్పుడు ఇరాన్ హార్మూజ్ జలసంధిని మూసివేసింది. దీని వల్ల దిగుమతులు ఆగిపోయి భారత ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని పెంచుతాయి. ప్రత్యామ్నాయంగా రష్యా నుంచి దిగుమతి చేసుకుంటే ఇరాన్ ప్రభావం నామమాత్రంగా ఉంటుంది.
భారత్ కు స్వతంత్రత లేదా ?
భారతదేశం ఎవరి నుంచి చమురు కొనుగోలు చేయాలో, ఎవరి నుంచి కొనుగోలు చేయకూడదో అమెరికా చెప్పడం విడ్డూరం. భారతదేశానికి ఎక్కడ కొనుగోలు చేస్తే ప్రయోజనకరమో అక్కడ కొనుగోలు చేయాలి. అంతే తప్పా.. అమెరికా చెప్పనట్టు కొనుగోలు చేస్తే వెనుజులాకు, ఇండియాకు మధ్య పెద్ద తేడా ఏం ఉంటుంది ?. అమెరికా వెనుజులా అధ్యక్షుడిని కిడ్నాప్ చేసి తన మాట వినేలా చేసుకుంది. భారత్ లో టారిఫ్ ల భయం చూపి తన మాట వినేలా చేసుకుంటోంది. వ్యాపారంలో ఏది ప్రయోజనకరమో అది చేయడమే ఉత్తమ వ్యాపార లక్షణం. ఎవరి కోసమో ఇష్టం లేకపోయినా కొనుగోలు చేస్తే అది వ్యాపారం కాదు. ఇప్పుడు భారత్ చేస్తున్నది అలాగే ఉంది. అమెరికా ఎత్తుగడ స్పష్టంగా అర్థమవుతోంది. ఉక్రెయిన్, రష్యా యుద్ధ సాకుతో రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయొద్దని ఒత్తిడి చేసింది. భారత్ కూడా ఒప్పుకుంది. ఆ స్థానంలో వెనుజులా చమురు భారత్ కు అమ్మాలన్నది అమెరికా యోచన. ఇక్కడ రష్యా చమురు వల్ల భారత్ కు ప్రయోజనమా ?. వెనుజులా చమురు వల్ల భారత్ కు ప్రయోజనమా అన్నది ముఖ్యం. వెనుజుల చమురు నుంచి రష్యా చమురు కంటే ఎక్కువ ప్రయోజనం ఉంటే కొనుగోలు చేస్తే అది తప్పు కాదు. ప్రయోజనం లేకున్నా అమెరికా కోసం కొనుగోలు చేస్తే ఒకచోట లాభం ఇంకో చోట నష్టంగా మారుతుంది.
భారత్ తేల్చుకోవాల్సిన అంశం
మనం ఏం కొనాలో, ఎవరితో కొనాలో చెప్పే హక్కు అమెరికాకు లేదు. అది పూర్తీగా సొంత నిర్ణయం. దేశానికి ఏది ప్రయోజనమో, ఎక్కడ తక్కువకు దొరుకుతుందో, మన అవసరాలను ఎంత మెరుగ్గా తీరుస్తుందో అది ముఖ్యం. అంతే కానీ అమెరికా చెప్పిందని కొనడం అంటే మన హక్కులను మనమే కాలరాసుకోవడం. ఈ విషయంలో భారత్ చాలా సీరియస్ గా ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు ఆయిల్ కొనొద్దు అంటారు. రేపు ఇంకో దేశం నుంచి ఇంకోటి కొనద్దని చెబుతారు. ఇది చాలా ప్రమాదకరం. మన ప్రయోజనాల్ని తాకట్టు పెట్టే అంశం. మన ఎగుమతులు అమెరికా మార్కెట్ మీద ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి. కాబట్టే అమెరికా టారిఫ్ ల పేరుతో మనల్ని శాసిస్తోంది. ఎగుమతులు, దిగుమతుల విషయంలో ఒకే దేశం మీద ఆధారపడకుండా ఉంటే అప్పుడు ఇలాంటి ఆదేశాలను పాటించాల్సిన అవసరం ఉండదు. మన ప్రయోజనాల్ని మనం కాపాడుకోవచ్చు. అమెరికాకు చెక్ పెట్టాలంటే.. ముందుగా ఎగుమతులు, దిగుమతుల విషయంలో రిస్క్ డైవర్షిఫికేషన్ ఉండాలి. అప్పుడే దేశ ప్రయోజనాలు కాపాడుకోగలం.