ఏపీ స‌ల‌హాదారుగా కార్టూనిస్టు శ్రీధ‌ర్‌.. మంతెన కూడా!

మొత్తంగా 3 విభాగాల‌కు.. ప్ర‌జాద‌ర‌ణ పొందిన వ్య‌క్తుల‌ను, ఎలాంటి మ‌చ్చ‌లు, మ‌ర‌క‌లు లేని వారిని స‌ల‌హాదారులుగా నియ‌మించ‌డం గ‌మ‌నార్హం.;

Update: 2025-12-29 15:01 GMT

ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వం తాజాగా ముగ్గురు స‌ల‌హాదారుల‌ను నియ‌మించింది. మొత్తంగా 3 విభాగాల‌కు.. ప్ర‌జాద‌ర‌ణ పొందిన వ్య‌క్తుల‌ను, ఎలాంటి మ‌చ్చ‌లు, మ‌ర‌క‌లు లేని వారిని స‌ల‌హాదారులుగా నియ‌మించ‌డం గ‌మ‌నార్హం. వీరిలో ప్ర‌ముఖ కార్టూ నిస్టు(ఈనాడు) శ్రీధ‌ర్‌, ప్ర‌కృతి వైద్య నిపుణులు మంతెన రామ‌రాజు, ప్ర‌ముఖ ఆధ్యాత్మిక వేత్త చుండూరి సీతారామాంజ‌నేయ ప్ర‌సాద్‌ల‌ను స‌ల‌హాదారులుగా ప్ర‌భుత్వం నియ‌మించింది. దీనికి సంబంధించిన జీవోను తాజాగా విడుద‌ల చేశారు.

ఏయే రంగాలకంటే..

మాస్ క‌మ్యూనికేష‌న్‌: ప్ర‌భుత్వం నిర్వ‌హిస్తున్న కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌జ‌ల‌కు చేరువ చేసే ఉద్దేశంతో ఐ అండ్ పీఆర్‌తో స‌మ‌న్వ‌యం చేసుకుని.. మాస్ క‌మ్యూనికేష‌న్ విభాగం ప‌నిచేస్తోంది. ఈ నేప‌థ్యంలో ఈ విభాగానికి స‌ల‌హాదారుగా ప్ర‌ముఖ కార్టూనిస్టు శ్రీధ‌ర్‌ను నియ‌మించారు. మీడియా రంగంలో అపార‌మైన అనుభ‌వం ఉన్న శ్రీధ‌ర్.. దాదాపు 42 ఏళ్ల‌పాటు.. ఈనాడులో ప‌నిచేశారు. తొలుత లే అవుట్ ఆర్టిస్టిగా చేసిన ఆయ‌న‌.. త‌ర్వాత‌.. త‌న కుంచెకు ప‌దును పెట్టి సంస్థ ప్రోత్సాహంతో కార్టూనిస్టుగా ఎదిగారు. చురుక్కు-చెమ‌క్కు మ‌నేలా స‌మకాలీన వ‌ర్త‌మాన అంశాల‌తోపాటు రాజ‌కీయ అంశాల‌పై ఆయ‌న వేసిన కార్టూన్లు అశేష ప్ర‌జాద‌ర‌ణ పొందాయి.

ప్ర‌కృతి వైద్యం: ప్ర‌స్తుతం అల్లోప‌తి స్థానంలో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప్ర‌కృతి వైద్యాన్ని ప్రోత్స‌హిస్తున్నాయి. ధ్యానం, యోగా వంటి వాటిని ప్రోత్స‌హిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆహార వినియోగం విష‌యంలోనూ సీఎం చంద్ర‌బాబు మార్పుల దిశ‌గా అడుగులు వేస్తున్నారు. తృణ‌ధాన్యాలు ఎక్కువ‌గా తీసుకోవాల‌ని.. బియ్యం వినియోగం త‌గ్గించాల‌ని ఆయ‌న చెబుతున్నారు. త‌ద్వారా ఒబేసిటీ, షుగ‌ర్ వంటి వాటికి దూరంగా ఉండే అవ‌కాశం ఉంటుంద‌న్నారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌కృతి వైద్యాన్ని మ‌రింత ప్రోత్స‌హించే ఉద్దేశంతో ఈ రంగంలో నిపుణులైన మంతెన స‌త్య‌నారాయ‌ణ రాజును ప్ర‌భుత్వ ప్ర‌కృతి వైద్య స‌ల‌హాదారుగా నియ‌మించారు. ఈయ‌న గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.

దేవ‌దాయ‌శాఖ : ఆధ్యాత్మిక రంగంలో త‌న‌దైన ముద్ర వేసిన చుండూరు సీతారామాంజ‌నేయ ప్ర‌సాద్‌కు ప్ర‌భుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. ఆయ‌న‌ను దేవదాయశాఖ సలహాదారుగా నియ‌మించింది. దేవాల‌యాల్లో అభివృద్ది, ఆధ్యాత్మిక‌త పెంపు.. మార్పులు, చేర్పులు ఇలా..అ నేక విష‌యాల‌పై ఆయ‌న స‌ల‌హాలు సూచ‌న‌లు ఇవ్వ‌నున్నారు. కాగా.. వీరు ఆయా ప‌ద‌వుల్లో.. 2 సంవ‌త్స‌రాలు ఉంటారు. నెల‌కు 2.3 ల‌క్ష‌ల రూపాయ‌ల వేత‌నంతోపాటు ఇత‌ర భ‌త్యాలు, కారు, డ్రైవ‌రు వంటి సౌక‌ర్యాల‌ను ప్ర‌భుత్వం అందిస్తుంది.

Tags:    

Similar News