టీడీపీ బీఆర్ఎస్ సున్నా...వైసీపీ మాత్రం వామ్మో !

ఒక విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలలో టీడీపీ బీఆర్ఎస్ లను వైసీపీ అధిగమించి రికార్డు నెలకొల్పింది. ఏపీలో బలమైన ప్రాంతీయ పార్టీలుగా అధికారం అందుకున్న పార్టీలుగా ఈ మూడు ఉన్నాయి.;

Update: 2026-03-16 22:30 GMT

ఒక విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలలో టీడీపీ బీఆర్ఎస్ లను వైసీపీ అధిగమించి రికార్డు నెలకొల్పింది. ఏపీలో బలమైన ప్రాంతీయ పార్టీలుగా అధికారం అందుకున్న పార్టీలుగా ఈ మూడు ఉన్నాయి. ఇందులో నాలుగున్నర దశాబ్దాల వయసు కలిగినది టీడీపీ అయితే పాతికేళ్ల ప్రాయం బీఆర్ఎస్ ది. దశాబ్దన్నర ప్రస్తానం వైసీపీది. అయితే నేమి ఆ రెండు పార్టీల కంటే కూడా వైసీపీ ఒక విషయంలో తాను పైచేయి అని చాటుకుంది. ఇంతకీ ఎందులో పైచేయి అంటే అదే ఇంట్రెస్టింగ్ మ్యాటర్ గా ఉంది.

సోషల్ మీడియా ఖర్చు చూస్తే :

ఇక 2024లో ఏపీలో అసెంబ్లీ పార్లమెంట్ లకు కలిపి ఒకేసారి ఎన్నికలు జరిగాయి. తెలంగాణలో మాత్రం లోక్ సభకు ఎన్నికలు జరిగాయి. అయితే ఈ ఎన్నికల్లో టీడీపీ బీఆర్ఎస్ సోషల్ మీడియా కోసం పెట్టిన ఖర్చు ఏమీ లేదు, జస్ట్ జీరో మాత్రమే. అయితే వైసీపీ మాత్రం ఏకంగా 8.26 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లుగా వెల్లడైంది. దీని మీద కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించిన వివరాల ఆధారంగా తీసుకుని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ సేకరించిన గణాంకాల ప్రకారం ఈ విధంగా లెక్కలు తేలాయి. ఇక 2024 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోషల్ మీడియాపై తాము ఎటువంటి ఖర్చు చేయలేదని టీడీపీ బీఆర్ఎస్ స్పష్టం చేశాయి. అదే సమయంలో వైసీపీ మాత్రం తన ఎన్నికల ఖర్చు ఆ ఎన్నికల్లో 328.37 కోట్లుగా పేర్కొంది. అందులో సోషల్ మీడియా ప్రచారాల కోసం వెచ్చించిన 8.26 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లుగా తెలియచేయడం విశేషం.

సోషల్ మీడియా యుగంలో :

ఇదిలా ఉంటే ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా ఎంతో పవర్ ఫుల్ అన్నది తెలిసిందే. అలా డిజిటల్ ఫ్లాట్ ఫారంగా చలామణీలో ఉన్న ఈ కాలంలో తాము ఒక్క రూపాయి కూడా సోషల్ మీడియా రూపేణా ఖర్చు చేయలేదని టీడీపీ బీఆర్ఎస్ స్పష్టం చేయడం విశేషంగానే ఉంది. అయితే బీఆర్ ఎస్ 2024 ఎన్నికల కోసం పెట్టిన మొత్తం ఖర్చు అయితే 120.14 కోట్లుగా ఉంది. అలాగే టీడీపీ మొత్తం ఖర్చు చూస్తే 35.66 కోట్ల రూపాయలుగా ఉంది. ఇక సోషల్ మీడియా కోసం తాము వెచ్చించామని బీజేపీ సహా మరి కొన్ని పార్టీలు ఎన్నికల సంఘానికి తెలియచేశాయి. బీజేపీ మొత్తం ఎన్నికల ఖర్చు 1,778.70 కోట్ల రూపాయలు ఉంటే అందులో సొషల్ మీడియా ఖర్చు 187.69 కోట్లు ఉండడం గమనార్హం. అలా సోషల్ మీడియా ఫ్లాట్ ఫారానికి దేశంలోనే ఎక్కువ ఖర్చు చేసిన పార్టీగా బీజేపీ నిలిచింది అని అంటున్నారు.

కాంగ్రెస్ ఖర్చు చూస్తే :

ఇక దేశంలో మరో కీలకమైన పార్టీగా ఉన్న కాంగ్రెస్ తన ఎన్నికల ఖర్చుగా 686.19 కోట్ల రూపాయలను చూపించింది. ఇందులో డిజిటల్ ప్రచారాల కోసం 47.69 కోట్ల రూపాయలుగా తెలిపింది. అలాగే ఒడిషాలో బిజు జనతా దళ్ ఎన్నికల ఖర్చు అయితే 278.4 కోట్ల రూపాయలుగా ఉంది. అందులో 3.03 కోట్లు డిజిటల్ ప్రచారానికే వెచ్చించినట్లుగా వివరించింది. ఇక డీఎంకే ఎన్నికల ఖర్చు చొస్తే 145.68 కోట్ల రూపాయలు ఉంది. అందుల సోషల్ మీడియా ప్రచారానికి 50.26 కోట్లు కూడా ఉంది. ఏఐడీఎంకే, బీఎస్పీ, ఎస్పీ వంటి పార్టీలు అయితే ప్రత్యేకించి సోషల్ మీడియా ప్రచారం కోసం ఏ విధమైన ఖర్చు చేయలేదని స్పష్టం చేశాయి. ఈ వివరాలను అన్నీ సేకరించిన ఏడీఆర్ ఆయా పార్టీలు ఎన్నికల సంఘానికి ఇచ్చిన నివేదికల నుంచి సేకరించామని పేర్కొంది. మొత్తానికి తెలుగు రాష్ట్రాలలో సోషల్ మీడియాకు పెద్ద ఎత్తున ఖర్చు చేసిన పార్టీగా వైసీపీ ఉంది అన్న మాట.

Tags:    

Similar News