ఎమ్మెల్సీ అనంతబాబు భార్య విచారణ.. తెరపైకి మరికొందరి పేర్లు!!
సోమవారం విచారణకు హాజరైన నిందితురాలు లక్ష్మీదుర్గను ఇద్దరు మహిళా ఎస్ఐల సమక్షంలో విచారణాధికారి సుదీర్ఘంగా విచారించారు.;
కాకినాడలో డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యకేసుకు సంబంధించి ఏ2 నిందితురాలు అనంత లక్ష్మీదుర్గ విచారణ కొనసాగుతోంది. హైకోర్టు ఆదేశాలతో సోమవారం దర్యాప్తు అధికారి మనీష్ దేవరాజ్ పాటిల్ ఎదుట నిందితురాలు, ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గ హాజరయ్యారు. 2022 మే 19న రాత్రి డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య జరిగింది. అప్పట్లో ఈ కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు ఒక్కరినే నిందితుడిగా గుర్తించారు. అయితే హతుడి కుటుంబ సభ్యుల అనుమానంతో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హత్య కేసు పునర్విచారణకు ఆదేశించింది. దీంతో నేరంలో ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గకు భాగస్వామ్యం ఉందని పోలీసులు నిర్ధారిస్తూ ఆమెపై కేసు నమోదు చేశారు.
ఎమ్మెల్సీ అనంతబాబు భార్య పేరును నిందితురాలుగా చేర్చడంతో ఆమె సుమారు 15 రోజులుగా అజ్ఙాతంలో ఉన్నారు. ముందస్తు బెయిలు కోసం కోర్టులో పిటిషన్ వేయగా, పోలీసు విచారణకు సహకరించాల్సిందిగా హైకోర్టు సూచించింది. ఈ నెల 30 వరకు ఆమెపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సూచించింది. హైకోర్టు సూచనలతో సోమవారం లక్ష్మీదుర్గను పోలీసులు విచారించారు. హత్యకు ఇంకెవరైనా సహకరించారా? హత్య జరిగిన సమయంలో అక్కడ ఎందుకు ఉన్నారు? ఏ కారణంతో హత్య జరిగింది? అని ప్రశ్నలు వేసినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య పక్కా ప్లాన్ ప్రకారం జరిగిందని అనుమానిస్తున్న పోలీసులు ఇందుకు ఎవరెవరు సహకరించారన్న కోణంలో విచారణ సాగిస్తున్నారని చెబుతున్నారు.
దీంతో డ్రైవర్ హత్య కేసులో మరికొందరి పాత్ర వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. హత్య జరిగిన సమయంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా, ఎమ్మెల్సీ అనంతబాబు వైసీపీ కీలక నేతగా ఉన్నారు. అప్పట్లో డ్రైవర్ హత్య సంచలనం సృష్టించింది. హత్య తర్వాత డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని కారులో పెట్టుకుని ఎమ్మెల్సీ అనంతబాబు డోర్ డెలవరీ చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో అప్పట్లో సరైన విచారణ జరగలేదని హతుడి కుటుంబ సభ్యులు న్యాయపోరాటం చేయడంతో కీలక మలుపు తిరిగింది. ఎమ్మెల్సీ అనంతబాబు భార్యతోపాటు మరికొందరి పాత్ర బయటకు తీయడమే ప్రధానంగా విచారణ సాగుతోందని అంటున్నారు.
సోమవారం విచారణకు హాజరైన నిందితురాలు లక్ష్మీదుర్గను ఇద్దరు మహిళా ఎస్ఐల సమక్షంలో విచారణాధికారి సుదీర్ఘంగా విచారించారు. మంగళవారం కూడా విచారణకు రావాల్సిందిగా సూచించారని అంటున్నారు. దర్యాప్తు అధికారి ప్రశ్నలకు లక్ష్మీదుర్గ సరైన సమాధానాలు ఇవ్వలేదని అంటున్నారు. తన పేరు, చిరునామా తప్ప మిగిలిన ప్రశ్నలకు తెలియదు, గుర్తులేదు, మరచిపోయానన్న మాటలనే చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. విచారణ సమయంలో లక్ష్మీదుర్గ ప్రశాంతంగానే ఉన్నారని, ఆమెలో ఎటువంటి ఆందోళన, భయం కనిపించలేదని చెబుతున్నారు. కాగా, విచారణకు వచ్చిన సమయంలో నిందితురాలు కారులో నేరుగా డీఎస్పీ కార్యాలయం పోర్టికో వరకు రావడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో విచారణ అనంతరం నిందితురాలును గేటు బయటకు పంపారు. ఆమె కారును కార్యాలయం వెలుపలే ఉంచారు.
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యలో లక్ష్మీదుర్గ విచారణ కీలకంగా చెబుతున్నారు. ప్రస్తుతం ఆమె పోలీసులకు సహకరించడం లేదని అంటున్నారు. అయితే కీలక పత్రాలను, సాక్ష్యాలను ఆమె ముందు ఉంచి ప్రశ్నిస్తున్నారని, దీంతో ఆమె నోరు తెరిచి ఏమైనా చెప్పొచ్చని పోలీసు వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. లక్ష్మీదుర్గ వాంగ్మూలం కేసును కీలక మలుపు తిప్పే అవకాశం ఉందని అంటున్నారు. అప్పట్లో ఈ ఘటనకు ఇంకెవరు సహకరించారన్న ప్రధాన అంశంపైనే పోలీసులు ఎక్కువగా ఫోకస్ చేశారని, డ్రైవర్ ను ఎమ్మెల్సీ దంపతులు మాత్రమే హత్యచేసే పరిస్థితి ఉండదని, కచ్చితంగా మరికొందరి సహకారం తీసుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ దిశగా సాగుతున్న దర్యాప్తు తీవ్ర ఉత్కంఠ రేకేత్తిస్తోంది.