దళపతికి 'ఏప్రిల్' గండం.. అటు కోర్టు.. ఇటు ఓటు
తమిళ రాజకీయాల్లో కేంద్ర బిందువుగా మారిన విజయ్ అనూహ్యంగా వ్యక్తిగత జీవితానికి సంబంధించి సమస్యల్లో చిక్కుకున్నారు.;
తమిళ సూపర్ స్టార్, టీవీకే పార్టీ అధినేత విజయ్ జీవితంలో ‘ఏప్రిల్’ నెల అత్యంత కీలకంగా మారనుంది. ఈ నెలలో ఆయన వ్యక్తిగత, రాజకీయ జీవితాల్లో పెను మార్పులు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కొత్తగా రాజకీయ పార్టీని ప్రారంభించి, రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని విజయ్ భావిస్తున్నారు. ఏప్రిల్ 23న జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఆయన జీవితాన్ని కీలక మలుపు తిప్పే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇదే సమయంలో ఎన్నికలకు మూడు రోజుల ముందు ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించి భార్య సంగీత వేసిన విడాకుల పిటిషన్ పై కోర్టు తీర్పు వెలువడనుంది.
తమిళ రాజకీయాల్లో కేంద్ర బిందువుగా మారిన విజయ్ అనూహ్యంగా వ్యక్తిగత జీవితానికి సంబంధించి సమస్యల్లో చిక్కుకున్నారు. ఆయన ఓ నటితో సన్నిహితంగా ఉంటున్నారని ఆరోపిస్తూ విజయ్ భార్య సంగీత పెను దుమారాన్ని సృష్టించారు. అంతేకాకుండా విజయ్ తో 27 ఏళ్ల వైవాహిక సంబంధాన్ని తెంచుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. విజయ్ కు వివాహేతర సంబంధం ఉందని, ఆ కారణంగా తాను మానసిక వేదనకు గురవుతున్నానని పేర్కొంటూ ఆయన నుంచి విడాకులు కావాలని పిటిషన్ దాఖలు చేశారు.
ఫిబ్రవరిలో సంగీత విడాకుల పిటిషన్ దాఖలు చేయగా, ఏప్రిల్ 20న విచారిస్తామని, ఆ రోజు తమ నిర్ణయాన్ని వెల్లడిస్తానని గతంలో న్యాయాధికారి వెల్లడించారు. దీంతో ఏప్రిల్ 20న కోర్టు వెలువరించే తీర్పు విజయ్ జీవితాన్ని ప్రభావితం చేయనుందని అంటున్నారు. ఈ తీర్పు ఆ నెల 23న జరిగే ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ప్రస్తుతం తమిళనాడులో అధికార డీఎంకే, ప్రతిపక్ష ఏఐడీఎంకే కూటముల మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది. ఈ రెండు పక్షాల మధ్య ఓట్ల శాతం స్వల్పంగా ఉందని విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ పార్టీ టీవీకే చీల్చే ఓట్లు కీలకంగా మారాయి. దీంతో విజయ్ ను ప్రసన్నం చేసుకోడానికి విపక్షం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
తనను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే పొత్తుకు రెడీ అని లేదంటే 234 స్థానాల్లో పోటీకి రెడీ అంటూ విజయ్ సంకేతాలు ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఆయన విడాకుల కేసుపై వచ్చే తీర్పు ఎన్నికల్లో ప్రభావం చూపుతుందని, అది ఎలా ఉంటుందనే టెన్షన్ ఎక్కువగా ఉంది. ఎన్నికల తేదీకి విడాకుల కేసుపై తీర్పు వెలువడే రోజుకు కేవలం మూడు రోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో ఈ విషయమై ఏం తేల్చుకోలేకపోతున్నారని అంటున్నారు. దీంతో విజయ్ జీవితంలో ఏప్రిల్ అత్యంత ముఖ్యమైన నెలగా మారనుందని వ్యాఖ్యానిస్తున్నారు. అంతా అనుకూలంగా జరిగితే ఆయన ఒక చరిత్ర సృష్టిస్తారని, లేని పక్షంలో ఇటు జీవితంలో అటు రాజకీయంగా తీవ్రమైన నష్టాన్ని ఎదుర్కొనే ప్రమాదం ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.