అర్నాబ్ యూ టర్న్ ... బాంబు లాంటి తుఫాన్ !
ఆర్నాబ్ తుఫాన్ నిజానికి గత పదేళ్ళలో సంభవించిన భారీ తుఫాన్లలో ఒకటి అని చెబుతున్నారు. ఈ రోజుకీ అది అలాగే జల ఖడ్గం గా మారి ఏపీలో విలయం సృష్టించింది.
ఆర్నాబ్ తుఫాన్ నిజానికి గత పదేళ్ళలో సంభవించిన భారీ తుఫాన్లలో ఒకటి అని చెబుతున్నారు. ఈ రోజుకీ అది అలాగే జల ఖడ్గం గా మారి ఏపీలో విలయం సృష్టించింది. అయితే ఆర్నాబ్ తుఫాన్ మీద ముందు వేసుకున్న అంచనాలు అన్నీ తారు మారు అయ్యాయి. ఈ తుఫాన్ సముద్రంలోనే ఒకానొక దశలో యూటర్న్ తీసుకుంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. దాని వల్ల తుఫాన్ వేగం తగ్గిందని ఆయన వివరించారు. అది కనుక జరిగి ఉండకపోతే ఆర్నాబ్ వేగం వేరే లెవెల్ లో ఉండేది, ఇక అది ఏపీపై మరింత పవర్ ఫుల్ గా విరుచుకుపడేది అని చెప్పుకొచ్చారు. ఇదంతా డెస్టిని అని బాబు అన్నారు. తుఫాన్ రాకను దాని గమనాన్ని ఎవరూ ఊహించలేరని బాబు మీడియాకు చెప్పుకొచ్చారు.
పది గంటలుగా అక్కడే :
తుఫాన్ అంటేనే వేగం, దూకుడు అయితే ఆర్నాబ్ తుఫాన్ మాత్రం చాలా తమాషాలే చేసింది. అది సముద్రంలో తీవ్ర స్థాయిలో ఏర్పడి ఏపీ వైపు కదిలినా దాని గమనంలో ఏర్పడిన కొన్ని అవాంతరాల వల్ల అది ఒక దశలో యూటర్న్ తీసుకోవాల్సి వచ్చింది. సముద్రంలో ఏర్పడుతున్న మరో వ్యవస్థ ఎదురుగా రావడంతో అర్నాబ్ తుపాను యూ టర్న్ తీసుకుందని చంద్రబాబు మీడియాకు విడమరచి చెప్పారు. అలా మంగళవారం రాత్రి 11:15 కి తీరాన్ని తాకిన తుపాను బుధవారం తెల్లవారుజామున మూడు నుంచి నాలుగు గంటలకు పూర్తిగా తీరాన్ని దాటుతుందని అంచనా వేస్తే అది కాస్తా పూర్తిగా 10 గంటల పాటు అక్కడే నిలిచిపోయిందని బాబు చెప్పారు. ఇలా తుఫాను నిలిచిపోవడం వల్ల తీవ్రతలో కూడా నెమ్మదించడం కనిపించింది అని ఆయన అన్నారు. లేకపోతే మరింత పెను ముప్పు వాటిల్లేది అని చెప్పుకొచ్చారు.
గరిష్టంగా 150 :
అప్పటికీ ఆర్నాబ్ తుఫాన్ గంటకు 125 నుంచి 135 కిలో మీటర్ల వేగంతో దూసుకుని వచ్చిందని ఇక తుపాను తీరం దాటిన తర్వాత కూడా గరిష్టంగా 150 కిలోమీటర్ల వేగం కనిపించిందని బాబు అన్నారు. భారీ తుఫానులు అన్నీ కూడా 150 కి మించి కిలోమీటర్ల వేగంతో సాగినవే. ఇపుడు ఆర్నాబ్ కొంత నెమ్మదించినా 150 స్పీడ్ ని అయితే క్రాస్ చేసింది అంటే సముద్రంలో వ్యవస్థ కనుక అడ్డుకోకపోయి ఉంటే దాని తీవ్రత కానీ స్పీడ్ కానీ ఏ 180 పై దాటేది అన్న అంచనాలూ ఉన్నాయి. మొదట్లో ఈ తుఫాన్ గురించి వచ్చిన తొలి అంచనాలు ఇదే చెబుతూ వచ్చాయి. అయితే దేవుడి దయ వల్లనే ఇలా జరిగింది అని అనుకోవాలి మరి
అలెర్ట్ గానే ఉండాలి :
ఇక తుఫాన్ తీరం దాటింది అని చాలా మంది ఇక అంతా మామూలే అని అనుకుంటారు. కానీ అది నిజం కాదు తుఫాన్ మళ్ళీ తీవ్ర వాయుగుండంగా ఆ మీదట వాయుగుండంగా అక్కడ నుంచి అల్పపీడనంగా ఇలా దశలు ఎన్నో జరిగి అపుడు అది బలహీన పడుతుంది. ఈ మొత్తం ప్రక్రియలు జరగాలీ అంటే కచ్చితంగా ఒక రోజు పైగా పడుతుంది. అందుకే తుఫాన్ తీరం తాకిన తరువాత కూడా భారీ వర్షాలు కురుస్తూనే ఉంటాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తుఫాన్ అయిపోయింది అనుకోవద్దని ప్రజలకు సూచించారు. కొన్ని జిల్లాలలో ఇంకా భారీ వర్షాలు పడుతున్నాయని అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ఆయన కోరారు.