ఫాంహౌస్ డ్ర*గ్స్ పార్టీ : ముఖాలు తెలియని 11 మంది నేపథ్యం ఇంట్రస్టింగ్

హైదరాబాద్ శివార్లలోని ఫాంహౌస్ డ్రగ్స్ పార్టీ ఉదంతం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.;

Update: 2026-03-17 05:08 GMT

హైదరాబాద్ శివార్లలోని ఫాంహౌస్ డ్రగ్స్ పార్టీ ఉదంతం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. విభిన్న నేపథ్యాలు, వేర్వేరు ప్రాంతాలకు చెందిన వ్యక్తులు ఒకే చోట చేరి మత్తులో మునిగిపోవడం వెనుక ఉన్న అసలు కథను పోలీసులు ఛేదిస్తున్నారు. భాగ్యనగర శివార్లలోని రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌ వేదికగా జరిగిన మత్తు పార్టీ వ్యవహారం రాజకీయ, వ్యాపార వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో అరెస్టయిన 11 మంది నిందితుల ప్రొఫైల్స్ చూసి దర్యాప్తు అధికారులు సైతం విస్మయానికి గురవుతున్నారు. రాజస్థాన్‌కు చెందిన రియల్ ఎస్టేట్ దిగ్గజాల నుంచి బెంగళూరు లాయర్ల వరకు.. ప్రజా ప్రతినిధుల నుంచి బడా వ్యాపారుల వరకు ఈ ముఠాలో సభ్యులుగా ఉండటం గమనార్హం.

రియల్ ఎస్టేట్ ముసుగులో ‘మత్తు’ నెట్‌వర్క్

ప్రాథమిక విచారణలో వెల్లడైన వివరాల ప్రకారం.. ఈ 11 మందిని కలిపిన ప్రధాన సూత్రం రియల్ ఎస్టేట్ వ్యాపారం. బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్ వంటి నగరాల్లో స్థిరాస్తి పెట్టుబడులు, భూ వివాదాల సెటిల్‌మెంట్ల క్రమంలో వీరికి పరిచయాలు ఏర్పడ్డాయి. ఈ వ్యాపార చర్చల కోసమే వీరు తరచూ రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌ను అడ్డగా మార్చుకున్నట్లు తెలుస్తోంది. కేవలం హైదరాబాద్‌లోనే కాకుండా దేశంలోని ప్రముఖ మెట్రో నగరాల్లోనూ వీరు ఇలాంటి రేవ్ పార్టీలు నిర్వహించేవారని సమాచారం.

రాజకీయ ప్రముఖుల ప్రమేయంపై విస్మయం

తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్‌పై యుద్ధం ప్రకటిస్తూ ‘ఈగల్’ వంటి ప్రత్యేక దళాలను రంగంలోకి దించిన సమయంలోనే ఈ స్థాయిలో పార్టీ జరగడం పోలీసులకు సవాలుగా మారింది. మరీ ముఖ్యంగా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ ఈ పార్టీలో కనిపించడం పెను సంచలనమైంది. గత ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడం, విదేశీ వ్యాపారాల్లో నష్టాలు వంటి కారణాలతో ఆయన ఈ వ్యాపార ముఠాకు దగ్గరైనట్లు పోలీసుల రిమాండ్ రిపోర్టు పేర్కొంటోంది.

శిమ్లా టు హైదరాబాద్.. పక్కా స్కెచ్‌తో సరఫరా

ఈ పార్టీ వెనుక పక్కా ప్రణాళిక ఉన్నట్లు పోలీసులు గుర్తించారు . రోహిత్‌రెడ్డి కొన్ని రోజుల ముందే ఫాంహౌస్‌ను సిద్ధం చేశాడు. కౌశిక్ రవి అనే వ్యక్తి శిమ్లా నుంచి మత్తు పదార్థాలను తరలించినట్లు సమాచారం. ఢిల్లీలో లోక్‌సభ సమావేశాల్లో ఉండాల్సిన ఎంపీ ఆహ్వానం అందగానే తన స్నేహితుడు నమిత్ శర్మతో కలిసి ప్రత్యేకంగా హైదరాబాద్‌కు చేరుకున్నట్లు అనుమానిస్తున్నారు. వీరి విమాన ప్రయాణ వివరాలను పోలీసులు ప్రస్తుతం విశ్లేషిస్తున్నారు.

ఈ కేసు కేవలం ఒక పార్టీకి పరిమితం కాకుండా అంతర్రాష్ట్ర డ్రగ్స్ నెట్‌వర్క్‌ను వెలికితీసే దిశగా సాగుతోంది. రాజకీయ నేతలు, వ్యాపారవేత్తల చుట్టూ తిరుగుతున్న ఈ ఉదంతం రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణ చర్యలకు ఒక కీలక మలుపుగా మారనుంది.

Tags:    

Similar News