తగలబడిన ఇళ్ళు, తలుపులకు తాళాలు.. షాకింగ్ వీడియో!
గత కొన్ని రోజులుగా బంగ్లాదేశ్ లో భారత్ వ్యతిరేక వాక్ చాతుర్యం పెరుగుతున్న సంగతి తెలిసిందే.;
గత కొన్ని రోజులుగా బంగ్లాదేశ్ లో భారత్ వ్యతిరేక వాక్ చాతుర్యం పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో హిందువులపై దైవదూషణ అభియోగాలు మోపి దారుణంగా హింసిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో.. డిసెంబర్ 18న మైమెన్ సింగ్ లో ఇదే ఆరోపణలపై దీపు చంద్ర దాస్ అనే హిందూ వ్యక్తిని అత్యంత కిరాతకంగా హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మరో దారుణం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా.. హిందువుల ఇళ్లు కాలి బూడిదైపోయాయి!
అవును... బంగ్లాదేశ్ లో హిందువులే లక్ష్యంగా ఇటీవల దాడులు పెరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమాలపై భారత్ లో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ బంగ్లాలో మైనారిటీలైన హిందువుల పరిస్థితిలో మాత్రం మార్పు రావడం లేదు! ఈ నేపథ్యంలో తాజాగా పిరోజ్ పూర్ జిల్లాలోని దుమ్రితల గ్రామంలో హిందూ కుటుంబానికి చెందిన కనీసం ఐదు ఇళ్ళకు నిప్పటించబడింది. ఇది హిందూ మైనారిటీలను లక్ష్యంగా జరిగిన దాడిగా చెబుతున్నారు.
ఈ సందర్భంగా స్పందించిన బాధిత కుటుంబం... మంటలు ఎలా ప్రారంభమయ్యాయో తమకు తెలియదని.. పోలీసులు మాత్రం ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారని చెబుతున్నారు. తెల్లవారుజామున కాల్పుల శబ్దం విని తాము మేల్కొన్నామని.. ఆ సమయంలో తమ ఇంటి తలుపులు బయటి నుండి లాక్ చేయబడి ఉన్నాయని తెలిపారు. ఆ సమయంలో ఇంట్లోని వ్యక్తులు తగరపు షీట్లు, వెదురు కంచెలను కత్తిరించి మంటల్లో చిక్కుకోకుండా తప్పించుకోగలిగినట్లు వెల్లడించారు.
కుటుంబ సభ్యులైతే అగ్నికి ఆహుతవ్వకుండా తప్పించుకోగలిగారు కానీ.. ఇళ్ళు, వస్తువులు పూర్తిగా కాలి బూడిదైపోయాయని.. ఇదే క్రమంలో పెంపుడు జంతువులు కూడా మరణించాయని తెలిపారు! అయితే... ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తులు గదుల్లో ఒకదానిలో వస్త్రాన్ని నింపి, దానికి నిప్పంటించారని.. దీనివల్ల మంటలు ఇంటి అంతటా వేగంగా వ్యాపించాయని నివేదికలు చెబుతున్నాయి.
ఈ సందర్భంగా స్పందించిన పిరోజ్ పూర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ)మహ్మద్ మంజూర్ అహ్మద్ సిద్ధిఖీ.. సంఘటనపై వెంటనే దర్యాప్తు చేస్తామని బాధితులకు హామీ ఇచ్చారు. అగ్నిప్రమాదం జరిగిన ప్రదేశాన్ని సందర్శించి పరిశీలించారు. మరోవైపు.. ఐదుగురు అనుమానితులను స్థానిక పోలీసులు అరెస్టు చేశారు.. మిగిలిన నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నాలు.. దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.
ఇక.. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియోలో.. స్థానికులు మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపించింది. ఆ సమయంలో పెద్ద ఎత్తున చెలరేగిన మంటలు అనేక ఇళ్లకు వ్యాపించాయి!
కాగా... మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా గద్దె దిగిన దగ్గరి నుంచి బంగ్లాదేశ్ లో సామాజిక, రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయిన సంగతి తెలిసిందే. యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వ పాలనలో హిందూ మైనారిటీలపై వరుస దాడులు జరుగుతున్నాయి. ఇక.. ఇటీవల విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హైదీ హత్యతో పరిస్థితి మరింత దిగజారింది. ఇక వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న ఎన్నికల తర్వాత బంగ్లా భవిష్యత్తు, అక్కడున్న హిందువుల రక్షణపై ఒక క్లారిటీ రావొచ్చని అంటున్నారు!