పోలవరంలో పోలవరం ఉండదు! ఎందుకంటే..
మైసూరు బజ్జీలో మైసూరు ఉండదు అన్నట్లు.. పోలవరం జిల్లాలో పోలవరం ఊరు ఉండదు.. ఇదేంటి అనుకుంటున్నారా? ఏపీ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ఈ చర్చకు తావిస్తోంది.;
మైసూరు బజ్జీలో మైసూరు ఉండదు అన్నట్లు.. పోలవరం జిల్లాలో పోలవరం ఊరు ఉండదు.. ఇదేంటి అనుకుంటున్నారా? ఏపీ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ఈ చర్చకు తావిస్తోంది. రాష్ట్రంలో కొత్తగా రెండు జిల్లాల ఏర్పాటుతోపాటు 17 జిల్లాల్లో చిన్నచిన్న మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో జిల్లాల పునర్విభజనపై మంత్రివర్గ ఉప సంఘం సిఫార్సులను కేబినెట్ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సమావేశంలో మొత్తం 24 అంశాలపై చర్చించగా, జిల్లాల పునర్విభజనపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే పలు సంచలనాలకు తెరలేపింది.
అన్నమయ్య జిల్లా కేంద్రం మార్పుతోపాటు పోలవరం జిల్లాలో పోలవరం ఊరు లేకుండా తీసుకున్న నిర్ణయం విస్తృత చర్చకు దారితీసింది. దీనిపై రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. గత 18 నెలలుగా ఏపీలో సుపరిపాలన అందిస్తున్నామని తెలిపారు. గిరిజనులు, పోలవరం నిర్వాసితు ప్రాంతాల అభివృద్ధి జరగాలనే లక్ష్యంతోనే రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ప్రకటించినట్లు మంత్రి సత్యప్రసాద్ వెల్లడించారు. పోలవరం జిల్లాను ఏర్పాటు చేస్తున్నప్పటికీ, పోలవరం గ్రామం ఏలూరు జిల్లాలో ఉండిపోవడంపై విలేకరులు ప్రశ్నించగా, మంత్రి ఆసక్తికర వివరాలు వెల్లడించారు.
పోలవరం జిల్లా కేంద్రంగా రంపచోడవరం పట్టణాన్ని ఎంపిక చేశామని, పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత ప్రాంతాలు ఎక్కువగా ఉన్నందున పోలవరం జిల్లాగా ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరు కృష్ణా జిల్లాలో ఉండగా, విజయవాడ కేంద్రంగా ఏర్పాటు చేసిన జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని మంత్రి సత్యప్రసాద్ ఈ సందర్భంగా ఉదహరించారు. అదేవిధంగా ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు జిల్లాల ఏర్పాటులో మార్పులు, చేర్పులు చేసినట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 26 జిల్లాల్లో 17 జిల్లాల్లో మార్పులు చోటు చేసుకున్నాయని, 9 జిల్లాలు యథాతథంగా కొనసాగుతాయని మంత్రి వివరించారు.
ప్రజల నుంచి వచ్చిన సూచనల మేరకు కొన్ని డివిజన్లు, మండలాల మార్పు చేసినట్లు మంత్రి సత్యప్రసాద్ తెలిపారు. గత ప్రభుత్వం సరైన ఆలోచన లేకుండా జిల్లాలను విభజించిందని, నాటి తప్పులను తమ ప్రభుత్వం సరిదిద్దుతోందని మంత్రి వ్యాఖ్యానించారు. గతంలో పారదర్శకంగా జిల్లాల విభజన చేస్తే ఈ సమస్యలు వచ్చేవి కావని మంత్రి సత్యప్రసాద్ తోపాటు నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ప్రస్తుతం తీసుకున్న నిర్ణయం మేరకు జిల్లా కేంద్రం హోదా కోల్పోతున్న రాయచోటిని మరింత అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్రబాబు హామీ ఇచ్చినట్లు తెలిపారు. స్థానిక శాసనసభ్యుడు, మంత్రి మండిపల్లి రామప్రసాద్ కు విషయాన్ని వివరించామని, పరిపాలన సౌలభ్యం కోసమే నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు.