ఈటలకు దిమ్మ తిరిగిపోయేలా ‘తెలంగాణ దళిత బంధు’.. ఎలానంటే?

Update: 2021-07-19 04:41 GMT
రాజకీయ ప్రత్యర్థులకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా.. ఆ మాటకు వస్తే కనికరం లేకుండా తన ఎత్తులతో చిత్తు చేయటం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కున్న పెద్ద అలవాటుగా చెప్పాలి. ఒకసారి టార్గెట్ చేశాక.. దాని అంతు చూడనిదే వదిలిపెట్టని మొండితనం గులాబీ బాస్ గొప్పతనంగా పలువురు అభివర్ణిస్తుంటారు. పట్టించుకోనట్లుగా ఉన్నంత వరకు బాగానే ఉన్నా.. ఒకసారి దాని సంగతి చూడాలని డిసైడ్ అయినప్పుడు మాత్రం.. మిగిలిన వారు ఏ మాత్రం ఊహించలేని రీతిలో కేసీఆర్ ప్లానింగ్ ఉంటుందని చెప్పాలి.

త్వరలో జరిగే హుజూరాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి.. ఊహించలేని రీతిలో భారీ ప్లాన్ ను సిద్ధం చేయటమేకాదు.. తాజాగా దాన్ని రివీల్ చేశారు. ఈ పథకం డిటైల్స్ విన్న తర్వాత తనకు గతంలో అత్యంత సన్నిహితుడైన ఈటల రాజేందర్ విషయంలో లెక్క తేల్చాలన్న పట్టుదల కేసీఆర్ లో ఎంత ఎక్కువగా ఉందన్న విషయం ఇట్టే అర్థం కాక మానదు. కొద్ది రోజుల క్రితం త్వరలో దళితులకు సాధికారత కల్పించేందుకు ఒక వినూత్న పథకాన్ని తెర మీదకు తీసుకురానున్నట్లుగా ప్రకటించి ఉత్కంటకు గురి చేశారు.

తాజాగా సదరు పథకానికి పేరు పెట్టటమే కాదు.. దాని పైలెట్ ప్రాజెక్టు అమలు ఎక్కడన్న విషయాన్ని వెల్లడించిన అందరిని ఆశ్చర్యచకితుల్నిచేశారు. ఈ  పథకం కానీ సీఎం కేసీఆర్ చెప్పినట్లుగా సాగితే..రాజకీయ ప్రత్యర్థులకు చుక్కలు కనిపించటమే కాదు.. భారీ ఓటు బ్యాంక్ ను ఆయన సమీకరించినట్లుగా చెప్పాలి. తెలంగాణ దళిత బంధు పథకాన్ని తొలుత ఈటల ప్రాతినిధ్యం వహించే హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో అమలు చేయనున్నట్లుగా ప్రకటించారు. ఈ పథకంలో భాగంగా ఏం చేస్తారు? ఎన్ని కుటుంబాల్ని టార్గెట్ గా చేసుకుంటారన్న వివరాల్ని తాజాగా వెల్లడించటం విశేషం. ఈ లెక్కల్ని చూస్తే చాలు.. జరిగేదేమిటో ఇట్టే అర్థమయ్యే పరిస్థితి.

కొద్ది నెలల్లో ఉప ఎన్నిక జరుగుతుందన్న వేళ.. తాను కొత్తగా ప్రవేశ పెడుతున్న తెలంగాణ దళిత బంధు పథకాన్ని తనకు సెంటిమెంట్ అయిన కరీంనగర్ జిల్లాను ఈసారి ఎంచుకున్నట్లుగా పేర్కొన్నారు. జిల్లాలోని హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈ కొత్త పథకాన్ని అమలు చేయాలని డిసైడ్ చేశారు. గతంలోనూ పలు పథకాల్ని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే ప్రవేశ పెట్టారని.. తాజాగా అదే సంప్రదాయాన్ని పాటిస్తున్నట్లు చెబుతున్నా.. అసలు సంగతి అందరికి అర్థమయ్యే పరిస్థితి.
4

తెలంగాణ రాజకీయాల్ని ఒక మలుపు తిప్పిన రైతుబంధు పథకాన్ని సైతం కరీంనగర్ జిల్లా నుంచే షురూ చేయటం తెలిసిందే. అదే సంప్రదాయాన్ని ముఖ్యమంత్రి పాటిస్తున్నారని.. అందుకే తెలంగాణ దళితబంధు పథకాన్ని ఈటల బరిలోకి దిగే హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో అమలు చేయాలని డిసైడ్ చేశారు. అయితే..పథకాన్ని ప్రారంభించే డేట్ ను మాత్రం ఇంకా ప్రకటించలేదు. త్వరలోనే ప్రకటిస్తారని చెబుతున్నారు.

ఈ పథకంలో భాగంగా ఏం చేస్తారంటే.. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో దళిత కుటుంబాల వివరాలు..వారి స్థితిగతులు తెలుసుకుంటారు. అనంతరం నిబంధనలకు అనుగుణంగా లబ్దిదారుల్ని ఎంపిక చేస్తారు. నియోజకవర్గంలోని హుజూరాబాద్ మండలంలోని 5,323 దళిత కుటుంబాలు.. కమలాపూర్ మండలంలోని  4346 కుటుంబాలు.. వీణవంక మండలం లో 3678 కుటుంబాలకు.. జమ్మికుంట మండలంలోని 4996 కుటుంబాలు.. ఇల్లంత కుంట మండలంలో 2586 కుటుంబాలు.. మొత్తంగా హుజూరాబాద్ నియోజకవర్గంలోని 20,929 దళిత కుటుంబాలనుంచి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు.

నిబంధనల ప్రకారం, అర్హులైన ఎంపిక చేయబడిన లబ్ధిదారు కుటుంబాలకు దళిత బంధు పథకాన్ని పరిపూర్ణ స్థాయిలో వర్తించేలా చేస్తారు. అంటే.. తక్కువలో తక్కువ 50 వేల ఓట్లను కేసీఆర్ టార్గెట్ చేసినట్లే చెప్పాలి. ఈ పథకంలోని లబ్థిదారులకు రూ.10లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందిస్తున్న సంగతి తెలిసిందే. మరీ.. భారీ పథకంపై ఈటల ఎలా రియాక్టు అవుతారో చూడాలి. మొత్తంగా ఈటలకు భారీ షాకిచ్చేలా ఈ పథకాన్ని రూపొందించారన్న మాట రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
Tags:    

Similar News